Krishnamma Review: మూవీ రివ్యూ: కృష్ణమ్మ

చిత్రం: కృష్ణమ్మ
రేటింగ్: 2.5/5
నటీనటులు:
సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, ఆతిరా రాజ్, అర్చన అయ్యర్, నంద గోపాల్, రఘు కుంచె, తారక్ పొన్నప్ప తదితరులు 
కెమెరా: సన్నీ కూరపాటి
సంగీతం: కాలభైరవ
నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
దర్శకత్వం: వివి గోపాలకృష్ణ
విడుదల: 10 మే 2024

ప్రతిభగల నటుడు సత్యదేవ్ సినిమా అంటే ఎంతో కొంత మంచి కంటెంట్ ఉంటుంది అనే అంచనా ఉంటుంది. ట్రైలర్ కూడా కొద్దొ గొప్పో ఆసక్తి కలిగించినప్పుడు సగటు ప్రేక్షకుడు హాలుకెళ్లి చూడడానికి సమాయత్తమవుతాడు. మరి ఈ చిత్రం ఆ అంచనాని అందుకుందా! 

కథలోకి వెళితే 2004 ప్రాంతంలో విజవాడ నేపథ్యం. ముగ్గురు స్నేహితులు (సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ బూరుగుల) కలిసి నివసిస్తుంటారు. వారిలో ఒకడు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటే, మిగిలిన ఇద్దరూ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. అనుకోకుండా ఈ ముగ్గురూ ఒక పెద్ద కేసులో నిందితులుగా ఇరుక్కోవల్సి వస్తుంది. అసలు క్రైం చేసిన వ్యక్తిని కాపాడేందుకు కొన్ని పెద్ద చేతులు ఈ ముగ్గుర్నీ ఇరికిస్తారు.

ఎవరా పెద్ద చేతులు? ఏవిటా నేరం? చివరికి ఏమౌతుంది?.. కథగా చెప్పుకుంటే ఇంతే!  Readmore!

అమాయకుల మీద కేస్ ఫ్రేం చేసి ఇరికించడం, హింసించడం అనే ప్లాట్ పాయింట్ కొత్తదేం కాదు. ఆల్రెడీ "విచారణ", "జై భీం" సినిమాలు ఈ జానర్లో టాప్ సినిమాలు అనిపించుకున్నాయి. అలా అని ఆ తరహా కథలు రాసుకోకూడదని కాదు. ప్లాట్ పాయింట్ ఒకటే అయినా ఏ కథకి ఆ కథని రక్తి కట్టించొచ్చు. అయితే ఎలా చూసుకున్నా ఈ చిత్రం ఆ చిత్రాల స్థాయిని అయితే అందుకోదు. 

ఇందులో కథ లేదా అంటే లేదని కాదు.. ఉంది! కథనంలో ట్విస్టులు గట్రా లేవా అంటే అదీ కాదు. మరి తేడా ఎక్కడొచ్చింది?

ఏది ఎంత చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని తనం ప్రధామార్ధంలో ప్రధానంగా కనిపించింది. 

అసలు చెప్పాలనుకున్న కథ నిడివి గంటన్నరుంటే, మిగతా గంట ఏదో నింపాలి కాబట్టి నింపినట్టుంది. 

సత్యదేవ్ హీరో కాబట్టి అతనికొక హీరోయిన్ ఉండాలనుకుని అసలే గూడ్సు బండిలా నడిచే ప్రధమార్ధానికి అదనపు బోగీ తగిలించినట్టయ్యింది. అసలా ట్రాక్ ఏమిటో, కథకి ఆవిడగారి అవసరమేంటో, ముగింపేమిటో అర్ధం కాదు. 

ఈ లోపానికి తోడు సత్యదేవ్ క్యారెక్టరైజేషన్. హీరో పాత్రతో మమేకం అవ్వడానికి బదులు ప్రేక్షకుడికి "ఇదేం హీరో పాత్రరా బాబూ" అనిపిస్తూ విసుగొస్తుంది ఫస్టాఫులో. ఈ డ్రాబ్యాకులో క్రెడిట్ ని దర్శకుడిని కూడా ఇవ్వాలి. ఆద్యంతం ప్రధాన పాత్ర ఎలా బిహేవ్ చేయాలి, ప్రేక్షకుడికి ఆ పాత్ర పట్ల ఆసక్తిని ఎలా పెంచుతూ వెళ్లాలి అనే లెక్క సరిగ్గా వేసుకోలేదు. సత్యదేవ్ కూడా తానేం చేస్తున్నాడో శ్రద్ధగా చూసుకోలేదు. 

వీటికి అదనంగా బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అక్కర్లేని పాటలు మరింత నీరసాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. 

ఇక డైలాగుల విషయానికొస్తే రెండు చోట్ల తప్ప హత్తుకునే విధంగా ఒక్కటి లేదు. 

"పదవి ముండ లాంటిది. మీరన్నంత ఈజీ కాదు వదిలేయడం". 

"బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావడం పుస్తకాల్లోనే ఉంటుంది. నిజ జీవితంలో కాదు" అనే డైలాగ్స్ సందర్భోచితంగా పేలాయి. 

ప్రధానంగా సీన్ కన్సెప్షన్, షాట్ డివిజన్ టెక్నికల్ గా బాగానే ఉన్నా కంటెంట్ పరంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇంటర్వల్ లో విలన్ ని రివీల్ చేయడంతో క్లైమాక్స్ ఊహించేలా అయింది. ఊహించినట్టే జరిగింది కూడా. 

ద్వితీయార్ధానికి కాస్త కథనం గాడిలో పడి ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. ఫస్ట్ సీన్ లో ఉన్న పాయింటు సెకండాఫులో క్రమంగా రివీల్ చేయడం బాగుంది. అయితే, దర్శకుడు పూర్తిగా దాని మీదే ఫోకస్ పెట్టి మిగతాది గాలికొదిలేసినట్టు అనిపించింది. 

2 గంటల 17 నిమిషాల నిడివి గల సినిమా అన్నప్పుడు 2 గంటల సినిమా ఉత్కంఠగా నడవాల్సిందే అనే లెక్క వేసుకుని దిగాలి. అలా దిగలేదు. అందుకే చూసేవాళ్లకి ఎక్కలేదు. కేవలం 17 నిమిషాలే ఆసక్తి గలిగించేలా ఉంది. థియేటర్ పరీక్షలో సినిమా పాసవడానికి అది సరిపోదు. 

పైన చెప్పుకున్నట్టు సత్యదేవ్ నటనలో తూకం తప్పింది. టాలెంటెడ్ నటుడన్న పేరు తెచ్చుకున్న అతను ఇందులో ఎందుకో అసహజంగా, ఫోర్స్డ్ గా కనిపించాడు. అవసరానికి మించిన కోపాన్ని ప్రదర్శించడం, ఒక్కోచోట కృతకమైన డైలాగ్ డెలివెరీతో నిరాశపరిచాడు. 

లక్ష్మణ్ ఓకే. పెద్దగా హత్తుకున్నదీ లేదు, అలా అని చిరాకుపెట్టిందీ లేదు. 

రఘు కుంచె అతిథి పాత్రలో రెండు మూడు సీన్స్ లో కనిపించాడు. 

తారక్ పొన్నప్పకి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. సరైన పాత్రలు ఎంచుకుంటే తెలుగు తెర మీద మంచి విలనౌతాడు. 

పోలీస్ ఆఫీసర్ సుబుద్ధిగా కనిపించిన నందగోపాల్ ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. పూర్తిగా న్యాయం చేసాడు. 

హీరోయిన్ గా ఆతిరా రాజ్ కంటికింపుగా ఉంది. రెండవ హీరోయిన్ అర్చన అయ్యర్ ఎందుకుందో అర్ధం కాలేదు. 

కాలభైరవ సంగీతం ఏ మాత్రం ప్లస్సవ్వలేదు. కథనం ఎలా సాగుతున్నా ప్రేక్షకులని గ్రిప్పింగ్ గా కూర్చోబెట్టగలిగే శక్తి బ్యాక్ గ్రౌండ్ స్కోరుకుంటుంది. ఆ ప్రయత్నం కానీ, పనితనం కానీ అస్సలు కనపడలేదు. అనంత్ శ్రీరాం సాహిత్యం కూడా ఆకట్టుకోదు. చిన్న సినిమాలని పెద్ద పేరున్న టెక్నీషియన్స్ చిన్న చూపు చూస్తూ పనిచేస్తారేమో అనే అనుమానమొస్తుంది ఇలాంటి ఔట్పుట్ చూసినప్పుడు. 

మిగిలిన టెక్నికల్ విభాగాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సినిమా బాగుందా లేదా అనే ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం క్లైమాక్స్. ఆ ముఖ్యమైన అంశం ఇక్కడ తేలిపోయింది. మెయిన్ విలన్ ని అంతమొందించే సీన్ చాలా సీదాసాదాగా, పేలవంగా, బూజుపట్టిన పాత చింతకాయలాగ ఉంది. 

రివెంజ్ డ్రామా బాగానే ఉన్నా.. ప్రేక్షకులకి కావాల్సిన బలమైన ముగింపు లేదు. ఎంతో బలమైన కథనంతో ఉత్కంఠభరితంగా నడిచి ప్రేక్షకుల మన్ననలు అందుకుని, పాజిటివ్ టాక్ విస్తృతంగా స్ప్రెడ్ అయితే తప్ప హాలుకి జనం రాని ఈ రోజుల్లో ఇలాంటి యావరేజ్ టు బిలో యావరేజ్ స్టాండర్డ్ తో బరిలో నిలబడితే గట్టెక్కడం కష్టం. 

బాటం లైన్: పరవళ్లు తొక్కలేదు!

Show comments

Related Stories :