తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?

మూడు పార్టీల పొత్తులు పెట్టుకుని.. ఓట్ల బదిలీ జరుగుతుందనే నాటకీయమైన పదాలను చంద్రబాబునాయుడు వల్లెవేస్తున్నారు గానీ.. నిజానికి ఈ పొత్తుల వలన పార్టీలో పుడుతున్న అసంతృప్తులు మొత్తం కూటమి పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. మూడు పార్టీల సీట్ల పంపకం తరువాత.. అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తుతుల తీవ్రస్థాయిలో పెల్లుబికిన సంగతి తెలిసిందే. దాదాపుగా అందరు నాయకుల్ని చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారు. అంతా సెట్ చేసేసినట్టుగా.. అందరినీ బుజ్జగించేసినట్టుగా ఆయన కలర్ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని గమనిస్తే పరిస్థితి ఆ విధంగా కనిపించడం లేదు.

ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులు చేసే కీడువలన కూటమి పార్టీలు ఓడిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో పరిశీలిస్తే తెలుగుదేశం అసంతృప్త నేత దెబ్బకు కనీసం రెండు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు దెబ్బతప్పదని స్థానికులు చెబుతున్నారు.

అనంతపురంలో ధర్మవరం నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ వచ్చిన తెలుగుదేశం కీలక నాయకుడు పరిటాల శ్రీరామ్.. తనకు దక్కకపోయినప్పటికీ.. సత్యకుమార్ కు అనుకూలంగా చాలా గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్యను గెలిపించి.. ధర్మవరం సత్తా ఏమిటో ఢిల్లీలో కూడా వినిపించేలా కార్యకర్తలు పనిచేయాలని శ్రీరాం పిలుపు ఇచ్చారు కూడా. ఆయన గట్టిగానే పనిచేస్తున్నప్పటికీ.. సత్య గెలుపు మాత్రం సందేహాస్పదంగానే ఉంది. 

అదే నియోజకవర్గం నుంచి శ్రీరాంతో పాటు, వరదాపురం సూరి కూడా తెలుగుదేశం టికెట్ ఆశించారు. అయితే వారిద్దరి మధ్య పీటముడి బిగియడంతో సీటు బిజెపికి వెళ్లింది. ఇదే సమయంలో.. తనకు టికెట్ రాకపోయినా పర్లేదు గానీ.. తన శత్రువు వరదాపురం సూరికి టికెట్ రాకుండా చేయగలిగినందుకు శ్రీరాం సంతోషిస్తున్నట్టుగా స్థానికంగా పుకారు ఉంది. ఆ భావన వరదాపురం సూరికి కూడా ఉంది. పైకి ఎలా కనిపిస్తున్నప్పటికీ.. సత్యకుమార్ ఓటమికి వరదాపురం సూరి పావులు కదుపుతున్నారు. Readmore!

ఆయన ప్రతీకారం ఒక్క ధర్మవరం నియోజకవర్గంతో ఆగడం లేదు. పరిటాల సునీత పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఆమె ఓటమికి కూడా తెరవెనుక నుంచి సాయం అందిస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ధర్మవరం టికెట్ తనకు కాకుండా చేసినందుకు పరిటాల కుటుంబం అసలు శాసనసభలోనే అడుగుపెట్టకుండాచేయాలని సూరి పట్టుదలగా ఉన్నారని ఒక వాదన ఉంది. అదే జరిగితే ఆయన దెబ్బకు ధర్మవరం, రాప్తాడు రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి పార్టీలు బిజెపి,తెలుగుదేశం ఓడిపోతాయని ప్రజలు అంటున్నారు.

వరదాపురంసూరి తరహాలో మరెన్ని నియోజకవర్గాల్లో ఎందరు తెలుగుదేశం నాయకులు చాపకింద నీరులా కూటమి ఓటమికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Show comments

Related Stories :