ఎమ్బీయస్‍: పెన్షన్ల గత్తర బిత్తర

ఆంధ్రలో పెన్షన్ల పంపిణీ గత్తరబిత్తర అయిపోయింది. 55 నెలలుగా ఒకటో తారీకుకే పొద్దున్నే గుమ్మం కదలకుండా పెన్షన్లు అందుకుంటూ వచ్చిన 66 లక్షల పై చిలుకు పెన్షనర్లు యిప్పుడు గ్రామ సచివాలయాల వద్దకు వచ్చి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలకు సంతోషించాలో, వద్దో తెలియకుండా పోయింది టిడిపికి. వాలంటీర్లపై వైసిపి కార్యకర్తలనే ముద్ర కొట్టి, వారిని విధుల్లోంచి తప్పించినప్పుడు కలిగిన ఆనందం పెన్షన్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి అయోమయంగా, గజిబిజిగా మారింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఆపేయండి అని ఆదేశించే ముందు ఎన్నికల కమిషనర్ ప్రత్యామ్నాయ వ్యవస్థ సాధ్యాసాధ్యాల గురించి ఏమీ ఆలోచించలేదని అర్థమౌతోంది.

పిటిషన్ పెట్టిన ఒకప్పటి ఉన్నతాధికారైనా యీ ఉపద్రవాన్ని ముందే ఊహించి, ఆ మార్గం బదులు యీ మార్గంలో యివ్వవచ్చు అని సూచించ వలసినది. అదేమీ చేయకుండా ఆపించడమే ఘనకార్యం అనుకున్నారు. భళాభళా అన్నారు టిడిపి, జనసేన వర్గాలు. ఇప్పుడు ఎండలు మండుతున్న వేళ, ఔట్‌డోర్‌లో షూటింగులు అలవాటైన విప్లవాల సినిమా స్టారును రెండు రోజులకే జ్వరపడేలా చేసిన చండమార్తాండుడు చెలరేగుతున్న వేళ, వికలాంగులు, వృద్ధులు ఆపసోపాలు పడుతూ తమకీ దుస్థితి తెచ్చిపెట్టిన వారికి శాపనార్థాలు పెడుతూ ఉంటే  ‘మేం కాదు, అవతలివాళ్లే దీనికి కారణం’ అంటున్నారు యీ శూరులు. తమదేమీ తప్పు లేదని చూపుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. పిటిషనర్ నిమ్మగడ్డ గారు నిమ్మకు నీరెత్తినట్లు ఏ రాష్ట్రంలోనో కూర్చున్నారు. ఆయన నిప్పు ముట్టించి వదిలేసిన లంకలో మంటలు ఆర్పడానికి టిడిపి అవస్థ పడాల్సి వస్తోంది. ఆ మంటలను ఎగదోసి, బాధితుల గుండెల్లో మంట ఆరకుండా చేద్దామని వైసిపి చూస్తోంది.

చంద్రబాబు గారు ఎన్నికల కమిషనర్‌కు ఓ ఉత్తరం రాసి పడేసి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడేసి ఓ పెద్ద బాధ్యత తీర్చేసుకున్నా మనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసైనికులను వాలంటీర్లగా పని చేయమని పిలుపు నిచ్చారు. ఈ పిలుపుల వలన, ఆ ఉత్తరాల వలన ఆ పెన్షను రూకలు వచ్చి ఒళ్లో పడవని యీ రోజు క్యూలో నిలబడిన బాధితులకు తెలుసు. ఎన్నికల ప్రకటన వచ్చాక జగన్‌ది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అని వాళ్లకు తెలుసు. ఏదైనా చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగమే పూనుకుని చేయాలి. తమ వలన ఎంతవరకు సాధ్యమో అంతే చేస్తారు వాళ్లు. మరోలా చేస్తే ఓట్లు వస్తాయన్న ఆశా, చేయకపోతే పోతాయన్న చింతా లేదు వాళ్లకి. ఇలా చేయలేదేం అని నిలదీయడానికి ఎన్నికలయ్యేదాకా ఏ ప్రజా ప్రతినిథికీ అధికారం లేదు. ఇవన్నీ తెలిసిన ప్రజానీకానికి మన ప్రాప్తం యింతే అనుకుంటున్నారు. ఈ ప్రారబ్దాన్ని తెచ్చి పెట్టిన దెవరో, వాలంటీర్లకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తున్నదెవరో వాళ్లకు తెలుసు.

ఈ బాధితులు డైరక్టుగా కూటమి పార్టీలను తిడుతున్న వీడియోలు నేను చూడలేదు కానీ, మనసులో నైనా తిట్టుకుంటూ ఉంటారనే భయం టిడిపి, జనసేనల్లో ఉంది. బిజెపి యీ విషయంలో చేసిన గొడవా లేదు, యిప్పుడీ కారణంగా ఓట్లు పోతాయన్న బెదురూ లేదు దానికి. ‘నిమ్మగడ్డ సాయం చేస్తున్నట్లే చేసి, అనాలోచితంగా వ్యవహరించి, కొంప ముంచాడని’ కొందరు టిడిపి వాళ్లు గోల పెడుతున్నారట. ‘నిమ్మగడ్డ కోరితే మాత్రం, ఎన్నికల కమిషన్ ఎందుకు ఒప్పుకుంది? ఇలాటి పర్యవసానాలు ఊహించ లేదంటే నమ్మలేం. ఈ రూపేణా పెన్షన్లు అందుకునే 66 లక్షల కుటుంబాలను (ఓట్లగా తర్జుమా చేస్తే కనీసం 2 కోట్లు) టిడిపికి వ్యతిరేకంగా మార్చడమనే కుట్రను కావాలనే చేసింది. కేంద్రంలోని బిజెపి అధిష్టానమే ఎన్నికల కమిషన్ ద్వారా యీ పని చేయించి, వైసిపికి మేలు కలిగిస్తోంది. బిజెపి-వైసిపి తెర వెనుక సహకరించు కుంటున్నాయన్న మా అనుమానం ధృవపడింది.’ అని కొందరు టిడిపి అభిమానులు వాపోతున్నారట.

అప్పటిదాకా టిడిపిపై అభిమానం పెంచుకుని, వైసిపిని యింటికి సాగనంపాలని నిశ్చయించు కున్నవారు యీ ఒక్క కారణంగా పిల్లి మొగ్గ వేసి అటు మారిపోతారని నేను నమ్మను. తటస్థంగా ఉన్నవారే యిలాటి ఆటుపోట్లకు గురవుతారు. ఇలా చేయడం అవసరమా? అని చికాకు పడతారు. ‘ఇన్నాళ్లూ కడుపులో చల్ల కదలకుండా యింటి గడప దాటకుండా ఉన్నవాళ్లు బయటకు వచ్చి కాస్త నాలుగడుగులు వేస్తే అరిగిపోతారా? కరిగిపోతారా?’ అని పిల్ వేసిన పెద్దలు అనుకున్నా ఒకటి మాత్రం నిజం. మీరూ నేనూ ఎవరైనా సరే, కొత్త సౌకర్యాలు కల్పించక పోయినా ఊరుకుంటాం కానీ ఉన్నవి తీసేస్తే నొచ్చుకుంటాం. కరంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు కట్టడానికి క్యూలో నిలబడి అవస్థలు పడేవాళ్లం. లంచ్ టైమనేవారు, క్లర్కు సెలవనేవారు, చిల్లర లేదనేవారు.. ఒకటా రెండా అనేక యిబ్బందులు. ఈ-సేవలు, తదుపరి మీ-సేవలూ వస్తే హమ్మయ్య అనుకున్నాం. ఇప్పుడు యింట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో అర్ధరాత్రయినా బిల్లు చెల్లించేస్తున్నాం.

గ్యాస్ సిలండరు బుక్ చేయాలంటే గ్యాస్ కంపెనీ వాడి ఫోన్ ఎప్పుడూ దొరికేది కాదు, నువ్వు చెయ్యవచ్చుగా అంటే నువ్వు చెయ్యవచ్చుగా అంటూ భార్యాభర్తా పోట్లాడుకునేవారు. ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజి పంపితే చాలు. సినిమా హాలుకి గంట ముందు వెళ్లడాలు, క్యూలో నిలబడి చెమట్లు పట్టించుకోవడాలు, మన దాకా వచ్చేసరికి కౌంటరు మూసివేయడాలూ అవీ లేవు. ఇంట్లో కూర్చుని టిక్కెట్టును సెల్‌లోకి తెప్పించుకుంటున్నాం. ఈ సౌఖ్యాలకు ఎంతలా అలవాటు పడ్డామంటే,   వెబ్‌సైట్ మేన్‌టెనెన్స్‌కై ఫలానా రోజున నాలుగైదు గంటలు షట్‌డౌన్ అని ముందే చెప్పి ఆపినా కోపం వచ్చేస్తోంది. అలా అలవాటు చేసి, యిప్పుడు ఆ డిపార్టుమెంటు వారు ‘ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయి. వెబ్‌సైట్ ఎవరో హ్యాక్ చేశారు, మీరు ఆఫీసులకి వెళ్లి బిల్లు కట్టండి’ అంటే ఒళ్లు మామూలుగా మండుతుందా?

అసలు పెన్షన్ చెల్లింపులనేది పెద్ద తలకాయ నొప్పి పని. మాది స్టేటు బ్యాంకు కాబట్టి, మేం వీటితో అవస్థలు పడ్డాం. నెల మొదటి మూడు రోజులూ పెన్షన్ పేయింగ్ బ్రాంచీల్లో ఎటు చూసినా వృద్ధజనం. ముందు రోజే స్టేట్ ట్రెజరీ నుంచి లిస్టులు రావాలి, పెన్షన్ రిజిస్టర్లలో పోస్టు చేయాలి, ఆ ఎంట్రీలన్నీ సేవింగ్స్ ఖాతాల్లో పోస్టు చేయాలి, దానిలోంచి పెన్షనర్ ఎంత విత్‌డ్రా చేస్తే అంత  వాళ్లకు క్యాష్ చెల్లించాలి. ఈ ప్రక్రియ ఎన్నాళ్లు పడుతుంది, రోజులో ఎంతమందికి యివ్వగలుగుతున్నారు అనేది, క్లర్కులు, సంబంధింత అధికారి, కాషియర్‌ల సమర్థతపై మాత్రమే కాదు, కాగితాలు అటూయిటూ పట్టుకెళ్లే ప్యూన్ చురుకుదనంపై కూడా ఆధారపడుతుంది. ఒక్కో బ్రాంచ్‌లో ఒక్కోలా టైము పట్టేది. దాంతో పెన్షనర్లు చికాకు పడేవాళ్లు, అరిచే వాళ్లు. మామూలుగానే ముసలివాళ్లకు సహనం తక్కువ, ఫిర్యాదులు ఎక్కువ. వృద్ధాశ్రమాలు నడపడం అందుకే చాలా కష్టం. బ్యాంకుకు వచ్చే పెన్షనర్లందరూ వృద్ధులే! వారిది అసహనమైతే, తోడుగా వచ్చిన యువకులది ఆవేశం.  

పైగా మెజారిటీ మంది పెన్షన్ డబ్బులపై ఆధార పడతారేమో, ఒకటో తారీకుకల్లా డబ్బు చేతికి రాకపోతే విలవిలలాడి పోతారు. ‘పెన్షన్ల కౌంటర్ యింపార్టెంటు, అక్కడ ఎక్కువ స్టాఫ్ వేయాలి’ అంటారు. అలాగే స్టూడెంట్స్ వచ్చి ‘చలాన్ కౌంటర్ యింపార్టెంటు, అక్కడ ఎక్కువ స్టాఫ్ వేయాలి’ అంటారు. మరోళ్లు డ్రాఫ్టుల కంటారు. రెండు, మూడు రోజుల భాగ్యానికి అదనంగా స్టాఫ్‌ పుట్టుకురారు కదా, ఉన్నవాళ్లనే మేనేజరు అటూయిటూ సర్దాలి. ఇవన్నీ పెన్షనర్లకు అనవసరం. అరుస్తారు, బిపీ తెచ్చుకుంటారు. టోకెన్ తీసుకుని క్యాష్ గురించి వెయిట్ చేస్తూ బ్యాంకు ఆవరణలో ప్రాణాలు విడిచిన వారూ ఉన్నాయి. కస్టమర్ల కోసం కూర్చోడానికి, నీళ్లు తాగడానికి, టాయిలెట్‌కు అంతోయింతో సౌకర్యాలుండే బ్యాంకుల్లోనే పరిస్థితి యిలా వుంటే ప్రభుత్వాఫీసుల్లో ఎలా ఉంటుందో ఊహించు కోవాల్సిందే.

పాత సినిమాల్లో పెన్షన్ల కోసం సాధారణ జనం ప్రభుత్వాఫీసు చెట్ల కింద పడిగాపులు కాయడాలు చూపించేవారు. అప్పట్లో పెన్షన్లు వచ్చేవాళ్లు తక్కువగా ఉండేవాళ్లు. ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చాక, ఎటు చూసినా పెన్షనర్లే. తక్కిన రాష్ట్రాలలో పాత పద్ధతిలోనే యిస్తున్నారేమో కానీ, ఆంధ్రలో వాలంటీరు వ్యవస్థ పెట్టాక యీ యిన్‌ఫ్రాస్ట్రక్చర్ చెదిరిపోయింది. మిగతా చోట్ల వాలంటీర్లు లేకుండా యిస్తున్నారుగా అని వ్యాఖ్యానించిన హైకోర్టు యిది గమనించాలి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేయడమంటే మాటలా? ఎటిఎమ్‌లు వచ్చాక, ఆన్‌లైన్ బ్యాంకింగు పెరిగాక, బాంకుకి వచ్చేవాళ్లు తగ్గిపోయారంటూ స్టాఫ్‌ను తగ్గించేశారు. రిటైరైన వాళ్ల స్థానంలో కొత్తవాళ్లను వేయటం లేదు. ఫోన్‌పేలు అవీ వచ్చాక, క్యాష్ వాడకం తగ్గి, ఎటిఎమ్‌ల నిర్వహణ దెబ్బ తింది. ఇప్పుడు ఆన్‌లైన్, ఫోన్‌పే జాన్తానై బాంకుకి వెళ్లి ట్రాన్సాక్షన్లు చేయాలని ఏ కోర్టో చెప్తే ఆ రద్దీని బాంకులు తట్టుకోగలవా? అలాగే యీ గ్రామ సచివాలయాలు వగైరాలు పెన్షనర్ల తాకిడిని తట్టుకోగలవా? వాళ్లు నిలబడడానికి, కూర్చోడానికి, తాగడానికి, మరోదానికి ఏర్పాట్లు చేయగలవా?

పెన్షన్ పేమెంట్ల విషయంలో బాంకుల్లో అలసత్వం ఉంటుంది కానీ, ఆ లెవెల్లో అవినీతి ప్రసక్తి ఉండదు. ప్రభుత్వాఫీసు అనగానే అడ్డ దారిలో త్వరగా తెచ్చిపెడతాను, చెయ్యి తడి చేయండి అంటూ ఎవరో ఒకరు వచ్చి తగులుకుంటారు. ఆర్‌టిఏ ఆఫీసుల్లో చూడండి. సగం పని ఆన్‌లైన్‌లోనే అన్నా దళారులు ఉంటూనే ఉన్నారు. ఆ రద్దీ నెలంతా ఉంటుంది. పెన్షనంటే అందరూ ఒకటో తారీకునే వచ్చి పడతారు. ఫలానా ఊరి వారికి ఫలానా రోజున యిస్తాం అని స్టేగర్ చేస్తే మేనేజ్ చేయవచ్చు. కానీ ఆలస్యంగా యిస్తానంటే ఒప్పుకునే వారెవరు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వికలాంగులు యింటి దగ్గరే కూర్చోవచ్చు, సచివాలయాలకు రానక్కర లేదు అంటున్నారు కానీ వాళ్లు వెయిట్ చేస్తారా? తక్కినందరికీ యిచ్చేస్తున్నారు అని ఆతృత పడతారు.

పైగా టిడిపి వారు ‘ప్రభుత్వం దగ్గర పెన్షన్లకు డబ్బు లేక యిలా అవస్థ పెడుతున్నారు’ అనే ప్రచారం మొదలుపెట్టారు. దాంతో వాళ్లు మామూలు వాళ్ల కంటె ముందుగానే క్యూలో నిలబడతారు. అసలీ ప్రచారం అత్యంత ఫన్నీగా ఉంది. 55 నెలలుగా ఠంచన్‌గా యిస్తూ వచ్చారు కదా, యిప్పుడు వీళ్లు పిల్ వేశారు కదాని, నిధులన్నీ హాంఫట్ అని ఆవిరై పోతాయా? ప్రభుత్వానికి రోజువారీ ఆదాయం వస్తూనే ఉంటుందిగా! జగన్ ప్రభుత్వం ఎలాటిదంటే కావాలంటే రెగ్యులర్ ప్రభుత్వోద్యోగులకు పెన్షన్ ఓ వారం వాయిదా వేసైనా వీళ్లకు పెన్షన్లు యిచ్చే రకం. ఖజానా ఖాళీ అయి వుంటే, పెన్షన్లకు రూకలు లేకపోతే ఆ ముక్క పైకి చెప్పడానికి చీఫ్ సెక్రటరీకి ఏ మొహమాటమూ ఉండదు. అయినా నిధులున్నాయో లేవో, పెన్షనర్లు అందరికీ యిస్తారో, సగం మందికి యిచ్చి తక్కిన వాళ్లకు బాండ్లు యిస్తారో అన్న దాని గురించి టిడిపి, జనసేనలకి దేనికి ఆరాటం? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే వాళ్లకే కదా లాభం!

తుపానులు వచ్చినపుడు, వరదలు వచ్చినపుడు ఎంత కష్టమైన పనైనా చేయగలమని ప్రభుత్వ యంత్రాంగం అనేక సార్లు రుజువు చేసుకుంది. కానీ దాన్ని ముందుగా ఎలర్ట్ చేయాలి, ప్లాను చేయడానికి టైమివ్వాలి. ఈ పెన్షన్ల పంపిణీ కూడా ఏ పదిహేను రోజుల క్రితమో చెపితే ఏదో ఒకటి ఏర్పాటు చేసేవారు. కానీ రాజకీయ నాయకులకు అదంతా అనవసరం. వాళ్లకు కావలసినది డ్రామా. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేద్దామని ఎన్టీయార్ అనుకున్నాడు. మంచిదే, ఆ వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దవచ్చు, కాదు, యిర్రేపరబుల్ అనుకుంటే ఏకంగా రద్దు చేయవచ్చు. కానీ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వాళ్లకు హేండోవర్ చేసి అప్పుడు పదవులు దిగండి అనాలి.

అదేం లేకుండా హఠాత్తుగా చేసి, పెద్ద సామాజిక విప్లవకారుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీయార్. దాంతో కొత్తగా వచ్చినవారికి రికార్డులు సరిగ్గా హేండోవర్ కాలేదు. అంతా గందరగోళం. తెలుగు రాష్ట్రాలలో యిప్పటికీ భూమికి సంబంధించిన రికార్డులన్నీ అస్తవ్యస్తమే. ధరణి పేరుతో చేసిన గోల్‌మాల్ ఫలితాలు తెలంగాణ ఎన్నికలపై ఎలాటి ప్రభావం చూపాయో చూశాం. ఇప్పుడు వాలంటీర్ల చేత పెన్షన్లు యిప్పించ కూడదు అని ఎన్నికల కమిషన్ నిర్ణయించినప్పుడు, మరి పంపిణీ విషయమేమిటి అని ప్రభుత్వ యిన్‌చార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శిని, ఎలా చేయాలని మీ సూచన? అని పిటిషనర్‌ను అడగాలి కదా. అదేమీ లేకుండా చేతిలో అధికారం ఉంది కదాని  ఆదేశాలిచ్చేశారు.

తక్కిన రాష్ట్రాలలో వాలంటీర్లు లేకుండా పంపిణీ జరగటం లేదా?  అని హైకోర్టు అడుగుతోంది. ఔను, జరుగుతోంది, దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక పాత వ్యవస్థను మార్చేశారు. ఇప్పటికిప్పుడు దాన్ని పునరుద్ధరించమంటే ఎలా? ఆడియో సిడిలు వచ్చాక కాసెట్లు మూల పడేశాం. ఇప్పుడు సిడిలు వాడకూడదని ఆంక్షలు విధిస్తే కాసెట్ ప్లేయరు ఎక్కడుందో వెతకాలి, దుమ్ము దులపాలి, రిపేరు చేసే వాడి కోసం ఊరంతా గాలించాలి. ఇదంతా రెండు రోజుల్లో అయ్యే పనా? అయ్యే పనే అనేస్తున్నారు టిడిపి నాయకులు, వారి సమర్థకులు. ప్రభుత్వం ఎలా నడపాలి అనే విషయంలో ప్రతిపక్షం ఎప్పుడూ సలహాలివ్వదు. ఇప్పుడు టిడిపి, జనసేనలు బకెట్ల కొద్దీ సలహాలిచ్చే అగత్యం ఎందుకు పడింది వాటికి? ఎందుకంటే ఈ నెల పెన్షన్ల పంపిణీ వ్యవస్థ ధ్వంసం కావడానికి కారణం తామే అని ప్రజలు అనుకుంటున్నారని అవి భయపడుతున్నాయి. ఆ విషయం గురించి ‘‘టిడిపికి ఉక్కపోత’’ అనే వ్యాసంలో రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :