ఎమ్బీయస్‍: ఎవాయిడబుల్ వీడియో

వృత్తిరీత్యా పారిశ్రామిక వేత్త, ప్రవృత్తి రీత్యా కళారాధకుడు ఐన రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లోకి దిగారు కానీ అవి పూర్తిగా వంటపట్టినట్లు లేదు. బిజెపి నరసాపురం పార్లమెంటరీ టిక్కెట్టును తన కివ్వలేదని తెలియగానే నిన్న సాయంత్రం ఒక వీడియో చేసి ప్రెస్‌కు రిలీజు చేశారు. అది ‘పొలిటికల్లీ ఇన్‌కరెక్ట్’ చర్య అని నా అభిప్రాయం. ఇలాటి సందర్భాల్లో మౌనంగా ఉండి, స్థితప్రజ్ఞతతో పరిస్థితిని ఎదుర్కోవలసిన రాజకీయ నాయకుడు ఆవేశానికి లోనై తన భావోద్వేగాలను బాహాటంగా వ్యక్తపరుస్తూ వీడియో చేయడం ఎవాయిడ్ చేసి ఉండాల్సిందని నా భావం. ప్రెస్ ఎదురై ప్రశ్నలడిగితే ‘నో కామెంట్’ అని తప్పించుకునే సందర్భాలివి. అలాటిది తనే ఎదురేగి, నాటకీయ హావభావాలతో వీడియో చేసి మనసులో భావాలను బయట పెట్టుకోవడం రాజకీయంగా సరైనదేనా?

నరసాపురం టిక్కెట్టు ఆయనకు బిజెపి యివ్వకపోవడానికి సవాలక్ష కారణాలుండవచ్చు. సిటింగు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా పార్టీలు టిక్కెట్లు యివ్వని రోజులివి. స్థానాలు, హోదాలు కూడా తారుమారు చేస్తున్నారు. ఎందుకని సిటింగులు అడిగితే ‘సర్వే మీకు ప్రతికూలంగా ఉంది’ అని అధినేతలు చెప్తున్న రోజులివి. తనది ఏ పార్టీయో ఆయనకీ తెలియదు, అవతలివాళ్లకూ తెలియదు. టిక్కెట్టెందుకు యివ్వలేదని ఆయన ఎవర్ని అడగగలడు? ఎవరిమీద అలగగలడు? నర్సాపురం ఎంపీ సీటు రాకపోతే పుట్టి మునిగిపోయినట్లు అంత బాధ పడిపోవడం దేనికి? అక్కడ కాకపోతే వేరే చోటికి వెళ్లవచ్చు. కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఆయన పెరిగినది విజయవాడ, అక్కణ్నుంచి పోటీ చేయవచ్చు. గోదావరి జిల్లాయే కాబట్టి కాకినాడ ఎంపీ సీటు అడిగి వుండవచ్చు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు అనే పుకారు వస్తోంది. అబ్బే విజయనగరం అశోక గజపతి రాజు గారి స్థానంలో అంటున్నారు కొందరు.

స్థానికతతో సంబంధం లేకుండా ఎవరైనా ఎక్కణ్నుంచైనా పోటీ చేసే రోజులివి. నెల్లూరుకి చెందిన అనిల్ యాదవ్‌ను నరసరావుపేటకు తెచ్చింది వైసిపి, రాయలసీమకు చెందిన యనమల అల్లుణ్ని ఏలూరికి తెచ్చింది టిడిపి. ఇది ఒకరకంగా మంచిదే. లోకల్ నాన్-లోకల్ ఫీలింగ్స్ చెరిగి పోతున్నాయి. ఆ మాట కొస్తే ఏ నియోజకవర్గం నుంచి నెగ్గినా, మంత్రి అయితే తప్ప, చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాదులోనే నివాసముంటున్నారు. రఘురామ విషయానికి వస్తే ఆయన ఉండేది హైదరాబాదులో. గత కొన్నేళ్లగా దిల్లీలోనే ఎక్కువ కాలం ఉంటున్నారు. ఇక సొంత నియోజక వర్గం గోదావరిలో ఉంటేనేం, ఉత్తరాంధ్రలో ఉంటేనేం, రాయలసీమలో ఉంటేనేం? అలాటప్పుడు ‘నాకు నరసాపురమే కావాలి, ఎవరు టిక్కెట్టిస్తే అరగంటకు ముందు వాళ్ల కండువా కప్పుకుంటా’ అంటూ మంకుపట్టు దేనికి? అది వదులుకుంటే టిడిపి యీయనకు సాయపడగలదు.

నిజానికి యీయన టిడిపికి చేసిన ఉపకారానికి వాళ్లు ఎక్కణ్నుంచైనా టిక్కెట్టు యిచ్చి ఆదుకోవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి టిడిపి వాళ్లు కలుగుల్లో దాక్కుంటే, జగన్‌ను ఎదిరించినది యీయనే. ‘మా నాయకుడు, మా సిఎం’ అంటూనే యీయన తిట్టినంతగా జగన్‌ను వేరెవరూ తిట్టలేదు. జగన్‌పై యీయన పెట్టినన్ని కేసులు వేరెవరూ పెట్టలేదు. దిల్లీలో బాబు కోసం యీయన చేసినంత లాబీయింగు వేరెవరూ చేయలేదు. అరెస్టు టైములో టిడిపి వారంతా చేష్టలుడిగి కూర్చుంటే లోకేశ్‌ను దిల్లీకి రప్పించి, గైడ్ చేసినది యీయనే అన్నారు. రచ్చబండ అంటూ నిరంతర రచ్చ చేసినది యీయనే. దానికి గాను జగన్ ప్రభుత్వం నుంచి కేసులు ఎదుర్కున్నాడు, కస్టడీలో ఉన్నాడు, అవస్థలు పడ్డాడు. ఇవన్నీ గుర్తించి టిడిపి యీయనకు ఏదో ఒకటి, అసెంబ్లీ సీటైనా యిస్తే చటుక్కున తీసుకోవడమే మేలు.   Readmore!

అయినా యీయన ఎంపీగానే నెగ్గాలని ఏముంది? ఒకప్పుడు ఎంపీ అంటే ఏడుగులు ఎమ్మెల్యేల పెట్టు అనే తరతమ భేదాలుండేవి కానీ యిప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ తేడాలు లేకుండా పోయాయి. ఎవరైనా ఏదైనా కావచ్చు. జగన్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయమంటున్నాడు, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమంటున్నాడు. ఆరుద్ర గారు ‘రాముడేమన్నాడోయ్, రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్, మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్’ అని రాసినట్లు ఓడలు బళ్లయి, నిన్నటి ఎంపీలు యివాళ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. లోకసభ సభ్యురాలు వంగా గీత గారు సరే, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారూ యిప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. నిజానికి రఘురామ అసెంబ్లీకి వెళితే మహ రంజుగా ఉంటుంది. నాకు బగ్గిడి గోపాల్ గుర్తుకు వస్తున్నారు.

గోపాల్ ఎన్టీయార్ అభిమాని. 1983 ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ పార్టీ తరఫున, తెలుగు దేశం మద్దతుతో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. నాదెండ్ల తిరుగుబాటు సమయంలో ఆయనవైపు మళ్లిపోయి, అసెంబ్లీలో ఎన్టీయార్‌ను వేధించుకు తిన్నాడు. ఎన్టీయార్ లాగానే వేషం వేసుకుని, ఆయన లాగానే మాట్లాడుతూ ఆట పట్టించేవాడు. 1985 ఎన్నికలలో ఓడిపోయాడనుకోండి. ఇప్పుడు రఘురామ అసెంబ్లీలో అడుగు పెడితే జగన్‌ను అద్భుతంగా అనుకరించి, వైసిపిని ఉడికించగలడు. ముఖ్యమంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ జగన్ ఉపన్యాసం యిచ్చి కూర్చోగానే, యీయన లేచి జగన్ తరహాలో ‘మేం ఇంగ్లీషులో షదువు షెప్పించాం’ అని వెక్కిరిస్తూ ప్రసంగిస్తే సభంతా నవ్వుల్లో మునిగిపోతుంది. ‘లక్ష కోట్లు, లక్ష కోట్లు’ అని అరిచినదాని కంటె ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ విధంగా రఘురామ కసి తీర్చుకోవచ్చు.

ఈ ఆప్షన్లేవీ ఆలోచించుకోకుండా నరసాపురం ఎంపీ సీటు దక్కలేదని భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అర్జునుళ్లా యింత విషాదయోగంలో మునగడం దేనికి? ఓపిక పడితే ఉపయెన్నికలు రావచ్చు, పోటీ చేయవచ్చు. లేదా రాజ్యసభ సీటు తెచ్చుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా కనీసం 60 సీట్లు వస్తాయి కదా, రాజ్యసభలో ఖాళీ రాగానే యీయనకే యివ్వవచ్చు. ఖాళీ కాగానే భర్తీ చేయవలసిన మొదటి సీటు నాగబాబుకి యిస్తామని మాట యిచ్చారని చదివాను. ఈయనతో పోలిస్తే నాగబాబు చేసినది ఈషణ్మాత్రం. నాలుగేళ్లన్నరగా యీయన టిడిపికై, దాని స్నేహితులకై ఎంతో కష్టపడ్డాడు. అందువలన నరసాపురంపై ఆశ పడ్డాడు. సరే యిప్పుడు ఆశాభంగం కలిగింది.

ఆ మాత్రానికి ఆక్రోశించాలా? దాన్ని జనాలతో పంచుకోవాలా? తాత్కాలికంగా అని చేర్చినా ‘ఓటమి చెందాను’ అని అనుయాయులకు చెప్పుకోవలసిన అవసరం ఏముంది? నాయకుడెవరూ అలా చెప్పుకోడు. కింద పడ్డా ‘అబ్బే శవాసనం బోర్లా వేయడమెలాగో ప్రాక్టీసు చేస్తున్నా, మీసాలకు మట్టి అంటలేదు చూశావా?’ అనాలి. చింతామణి నాటకంలో ‘వాడు కొట్టిన దెబ్బకి నువ్వు కింద పడ్డావా?’ అని సుబ్బిశెట్టిని అడిగితే, ‘లేవదీసింది నన్నే కానీ కింద పడినదెవరో తెలియదు’ అంటాడతను యుక్తిగా. నాయకుడు తన దీనత్వాన్ని ప్రజలతో ఎప్పుడూ పంచుకోకూడదు. అవేదన పంచుకున్నా  నా యీ బాధ నాకోసం కాదు, మీ కోసం అనే కలరింగు యివ్వాలి. చలం ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ’ అన్నాడు.

విరహంతో కృష్ణశాస్త్రి బాధ పడితే ప్రపంచం అయ్యోపాపం అంది తప్ప ఆయన్ని ఆరాధించలేదు. ప్రపంచంలోని పీడిత, తాడిత జనుల గురించి బాధ పడుతున్నాను అని శ్రీశ్రీ అంటే ‘మన కోసం ఎంత ఫీలవుతున్నాడో’ అని ప్రపంచం ఆయన్ని ఆరాధించింది. టిక్కెట్టు దక్కకపోయినా, పదవి దక్కకపోయినా నాయకుడు ప్రజలతో చెప్పేటప్పుడు తన బాధలా చెప్పకూడదు, మీరు నష్టపోతారే పాపం అన్నట్లు చెప్పాలి. ప్రజల బాధకు స్పందించాలి. బాబు కూడా యిటీవల అది గుర్తించటం లేదు. అమరావతి రైతుల అవస్థ చూసి కన్నీరు కారిస్తే వచ్చే రిజల్టు వేరు, నా భార్యను ఎవరో ఏదో అన్నారంటూ వెక్కివెక్కి ఏడిస్తే వచ్చే రిజల్టు వేరు. ఇప్పుడు కూడా శర్మిల విషయంలో జగన్ చెల్లికి అన్యాయం చేశాడంటూ పొలిటికల్ కలరింగు యివ్వడం కంటె ‘ఒకప్పటి నా మిత్రుడి కూతురు అన్న చేతిలో మోసపోవడం చూసి దుఃఖిస్తున్నాను’ అనే టోనులో మాట్లాడితే ఎఫెక్టివ్‌గా ఉండేది.

రఘురామ కూడా ‘నాకు సీటు రాలేదు, కుట్ర జరిగింది’ అంటే సామాన్య జనాలకు సింపతీ ఏముంటుంది? దాన్ని వేరే విధంగా ప్రొజెక్టు చేయాలి. సినీ డైరక్టరు రాఘవేంద్రరావు గారు ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పేర రాసిన ఆత్మకథలో ఒక విషయం చెప్పారు. కెరియర్ ప్రారంభ దశలో ఒక నిర్మాత ఏదో వాదన వచ్చి యీయనను అసిస్టెంటు డైరక్టరుగా తీసేస్తే యీయన యింటికి వచ్చి ఏడ్చాడట. వీళ్ల నాన్నగారు ‘‘నిన్ను తీసేసినందుకు నిర్మాత ఏడవాలి కానీ నువ్వెందుకు ఏడవడం?’’ అన్నారట. అలా ఉండాలి స్పిరిట్! రఘురామ కూడా నాకు టిక్కెట్టు రానందుకు ‘నరసాపురం ప్రజలకు నా సింపతీ, పార్టీలకు నా సింపతీ, నా బదులు టిక్కెట్టు తెచ్చుకున్నాయన నా అంత బాగా మిమ్మల్ని చూసుకోవాలని ఆశిస్తాను’ అనే టోన్‌లో మాట్లాడాలి.

అసలు వీటన్నిటి కంటె మాట్లాడకపోవడం మేలు. ఒక్కోప్పుడు మాటల కంటె మౌనమే ఎక్కువ పవర్‌ఫుల్. ఇంగ్లీషులో ‘సైలెన్స్ యీజ్ ఎలాక్వెంట్’ అనే పలుకుబడి ఉంది. ముళ్లపూడి రమణగారు ఓ చోట ‘మౌనం గంభీరంగా ప్రసంగించింది’ అని రాశారు. టిక్కెట్టు దక్కలేదని తెలిశాక యీయన మౌనంగా ఉండి ఉంటే జనాలు ఏవేవో ఊహించుకుని, ఆయన యిమేజి పెంచేవారు. బిజెపి చాలాకాలం పాటు కూటమి ఏర్పాటుపై మౌనం పాటించినప్పుడు చూడండి జనాలు ఏమోమో అనుకున్నారు. 4-2-1 నిష్పత్తిలో సీట్లు అడుగుతోందని, అదనీ యిదనీ పుకార్లు చెలరేగాయి. నిజానికి తన శక్తి 10-6 కంటె ఎక్కువ లేదని దానికి తెలుసు. కానీ పెదవి విప్పకపోవడంతో ప్రజలు దాని శక్తిని, డిమాండ్‌ను ఎక్కువగా ఊహించారు. మౌనానికి ఉన్న పవర్ అలాటిది.

ఇప్పుడు యీయనా ఏ రియాక్షనూ యివ్వకుండా ఊరుకుంటే ఎబిఎన్ వెంకట కృష్ణ లాటి వాళ్లు ‘ఆరారార్ మౌనంగా ఉన్నారంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. బిజెపి నుంచి ఏదో ఒక హామీ దక్కి ఉంటుంది. తప్పి దారి జగన్ మళ్లీ  అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన కిందకు తెచ్చి, యీయన్ని గవర్నరుగా వేస్తామని బిజెపి చెప్పి ఉంటుంది’ అనే ఊహను జనంలోకి వదిలేవారు. ‘అలాటి హామీ ఏదీ లేకుంటే ఊరుకునే రకం కాదు మన ఆరారార్’ అంటూ బిల్డప్ యిచ్చేవారు. ఈ ఆరారార్ పేరు యిప్పుడు గుదిబండగా మారింది. ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు ‘నాకు మాటల మాంత్రికుడు అని పేరు పెట్టినవాడు నా శత్రువు. ప్రతీ మాటలోనూ ప్రేక్షకులు మాజిక్ ఎదురుచూస్తున్నారు’ అని వాపోయారు. అలా యిప్పుడీ ఆరారార్‌కు రౌద్రం, రణం.. బదులు వేరే ఏవేవో పేర్లు పెట్టి టీజ్ చేస్తారు.

ఇంతకీ బిజెపి యీయనకు టిక్కెట్టెందుకు యివ్వలేదు అని ప్రశ్నించబోతే, అసలు యీయన వాళ్లకు చేసిందేముందిట అనే తిరుగు ప్రశ్న మనను తాకుతుంది. ఈయన చేసినదంతా టిడిపికి! దిల్లీలో లాబీయింగు అనండి, పొత్తుకై బిజెపిపై ఒత్తిడి చేయడమనండి, అంతా బాబు కోసం చేశారు. ఇప్పుడు బిజెపి టిక్కెట్టివ్వలేదని, దాని మీద బండరాళ్లేస్తే ఎలా? కొలిచింది ఒక దేవుణ్ని, వరాలిమ్మంటోంది మరో దేవుణ్ని! రఘురామను ఒబ్లయిజ్ చేయవలసినది బాబు. తన పార్టీ ద్వారానో, జనసేన ద్వారానో ఎకామడేట్ చేయాల్సింది ఆయనే. బిజెపికి యీయనతో ఏ మొహమాటం ఉంది? మహా అయితే రఘురామకు కొందరు నాయకులు తెలిసి ఉండవచ్చు. కానీ అధిష్టానానికి యీయన చేసిన మేలేముంది? పార్టీలో చేరలేదు కాబట్టి టిక్కెట్టివ్వలేదు, లేకపోతే యిచ్చేవారు అనేది ఒట్టి మాట.

టిక్కెట్టిచ్చామని ప్రకటించాక పార్టీలోకి వచ్చిన వాళ్లూ ఉన్నారు. తిరుపతి కాండిడేటు గంట ముందు వచ్చాడు. తనూ అలాగే అనుకున్నాడీయన. వాళ్లివ్వలేదు కాబట్టి టిడిపిలో చేరబోతున్నాడట. ఈయన గెలుపు గుర్రం కాదని బిజెపి వారకున్నారేమో లేకపోతే బాబు మనిషనుకున్నారేమో యివ్వదలచుకోలేదు, యివ్వలేదు. దట్సాల్! కూటమిలో మేజర్ పార్టీ, తన వలన లాభాలు పొందిన టిడిపి యీ విషయంలో తనకు సాయం చేయనందుకు వాళ్లను తప్పు పట్టకుండా బిజెపిని, దాని నాయకులను ఆడిపోసుకోవడం దేనికి? జగన్‌తో కుమ్మక్కయి, తనకు సీటు రాకుండా చేశారంటూ సోము వీర్రాజుని బ్లేమ్ చేశారు. జగన్ చేసిన టక్కుటమార విద్యలంటూ చేష్టలతో డబ్బును యిండికేట్ చేశారు. ఇలాటి ఆరోపణలు పబ్లిగ్గా ఎవరైనా చేస్తారా? రేపు టిడిపి తరఫున పోటీ చేసినా కూటమి సభ్యుడిగానే చేయాలి కదా! బిజెపి అభిమానుల ఓట్లు తెచ్చుకోవాలి కదా!

టిక్కెట్టు రాకపోవడమనేది చాలామందికి జరిగింది. జివిఎల్ నరసింహారావు సంగతి చూడండి. వైజాగ్ 2014లో బిజెపి గెలిచిన సీటు. 2019లో టిడిపి పోటీ చేసి ఓడిపోయిన సీటు. ఈసారి బిజెపికి యిస్తారని, అదీ తనకే యిస్తారనీ జివిఎల్ ఆశ పెట్టుకున్నారు. కానీ చివరకి ఆయనకు మొండిచెయ్యి చూపించింది అధిష్టానం. బిజెపికి ఆంధ్రలో పార్టీ యంత్రాంగం తక్కువ. సిటింగు అభ్యర్థులెవరూ లేరు. పైగా యీసారి అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యంగా జరుగుతోంది. రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగి, ప్రచారం చేయవలసిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తనూ అభ్యర్థిగా, అదీ పెద్ద పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడతా ననడమేమిటి? దానికి అధిష్టానం సై అనడమేమిటి? వింతగా లేదూ! ఒకవేళ ఆవిడ చేద్దామనుకున్నా, 2009లో తను నెగ్గిన వైజాగ్‌లోనే నిలబడవచ్చుగా! అప్పుడు రాజమండ్రి రఘురామకో, సోము వీర్రాజుకో, జివిఎల్‌కో యిచ్చేవారేమో!

అబ్బే, ఆవిడ రాజమండ్రి తను తీసుకుని, వైజాగ్‌ను టిడిపి కోటాలో మేనకోడలు మొగుడికి యిప్పించి జివిఎల్‌కి జెల్ల కొట్టి చంద్రబాబుకి తృప్తి కలిగించారని టాక్ నడుస్తోంది. ‘మాతో పొత్తుకై చంద్రబాబే వెంపర్లాడుతున్నారు’ అని గతంలో వ్యాఖ్యానించి, బాబుకి కోపం తెప్పించిన జివిఎల్‌కి యీ పరిణామాలపై కడుపు మండి ఉంటుంది. కానీ బయటకు వచ్చి, పురంధరేశ్వరి టిడిపికి అమ్ముడు పోయారు, బిజెపి టిడిపి ఒత్తిడికి లొంగింది అని ఆరోపణ చేశారా? లేదు కదా! మరి రఘురామ మాత్రం, జగన్ ఒత్తిడికి బిజెపి లొంగింది అంటున్నారు. సోము వీర్రాజుకి అంత చేవ ఉంటే రాజమండ్రి సీటు తన కిప్పించుకోలేక పోయాడా? రాష్ట్ర అధ్యక్ష పదవీ, ఎంపీ టిక్కెట్టూ రెండూ ఆవిడకేనా? అనకాపల్లిని బాబు ఆత్మీయుడికి, రాజమండ్రిని బాబు వదినకి యివ్వడం భావ్యమా అని వాదించలేక పోయాడా? సోము వీర్రాజు మాట అధిష్టానం దగ్గర చెల్లుతుంది అనుకోవడానికి లేదు. అధిష్టానమే అలా నిర్ణయించింది, జగన్ ఒత్తిడికి లొంగినవారు వారే అని చెప్పకనే చెప్పినట్లయింది.

రఘురామ యిలా ఆరోపించడం రాజకీయంగా చాలా పొరపాటు అని నా ఉద్దేశం. టిడిపిలో ఒక బలమైన వర్గం బిజెపి-వైసిపిల మధ్య రహస్య బంధం ఉందని నమ్ముతోంది. జగన్‌ ప్రభుత్వానికి అలవి కాని అప్పులు పుట్టడం, బాబు అరెస్టు.. యివన్నీ మోదీ, అమిత్‌ల చల్లని చూపు లేనిదే సాధ్యం కాదని వారి నమ్మకం. బిజెపితో పొత్తు పెట్టుకోవడం అనర్థదాయకం అని వారి వాదన. ఆదివారం నాటి రాధాకృష్ణ కొత్తపలుకు కూడా అదే ధ్వనిస్తోంది. టిడిపిలో చాలామందికి ‘జనసేనతో పొత్తు కూడా అనవసరం. వాళ్ల కిచ్చిన సీట్లూ వైసిపికి ధారాదత్తం చేసినట్లే’ అనే భావన ఉంది. కాపుల నుంచి ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది వారి సందేహం. 31 సీట్లు కూటమి భాగస్వాములకు యిచ్చే బదులు, ఏ పొత్తూ లేకుండా విడిగా వెళితేనే మనకు లాభం అని ఒక వర్గం భావిస్తోందని, దానికి లోకేశ్ ఆశీస్సులున్నాయని అంటున్నారు. దానికి తగ్గట్టు లోకేశ్ పొత్తు చర్చల్లో పాల్గొనటం లేదు. మొన్న మోదీ సభకూ రాలేదు. టిడిపిలోని పొత్తు వ్యతిరేక వర్గాన్ని ఊరడించడానికే లోకేశ్ బహిరంగంగా అలా ప్రవర్తిస్తున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.

‘కూటమిలో బిజెపి చేరడం ఒక వ్యూహంతోనే..’ అని నాబోటి వాడు ఏ ఆధారమూ, ఏ సమాచారమూ లేకుండా ఊహించి రాయవచ్చు. అది ధృతరాష్ట్ర కౌగిలి అని మరో యూట్యూబరు వ్యాఖ్యానించ వచ్చు. వీటికి పెద్దగా విలువ లేదు. కానీ నిత్యం బిజెపి వాళ్లతో దిల్లీలో అంటకాగే రఘురామ ‘బిజెపిని జగన్ ప్రభావితం చేయగలిగాడు’ అని అన్నారంటే దానికి చాలా వెయిటేజి ఉంటుంది. ‘అదిగో, చూశావా, బిజెపి నమ్మకద్రోహం చేస్తోంది. జగన్ వ్యతిరేకుల పట్ల కుట్ర చేస్తోంది.’ అని టిడిపి ఓటరు అనుకున్నాడంటే కూటమి సభ్యుల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగదు. దానిలో పెద్ద భాగస్వామి ఐన టిడిపి భారీగా నష్టపోతుంది. రఘురామ టిడిపికి ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో సేవలు అందించారు. వాటన్నిటినీ మించిన అపకారం యిప్పుడు చేశారు.

ఇది ఒక రాజకీయ నాయకుడు చేయవలసిన పని కాదు. రఘురామ రాజకీయాలతో ఏకీభవించినా, విభేదించినా ఆయన హితం కోరుకునేవారు వైసిపిని పిక్చర్‌లోకి తీసుకురాకుండా ఉండాల్సింది అనుకుంటారు అనేదానికి తార్కాణం, ఆంధ్రజ్యోతి ఆ ప్రస్తావన చేయకపోవడం! రాజకీయాల క్రౌర్యం అనుభవంలోకి వచ్చిందని అన్నారని రాసింది తప్ప జగన్-సోము మిలాఖత్ అయ్యి తనకు టిక్కెట్టు రాకుండా చేశారని ఆరోపించిన విషయాన్ని రాయలేదు. ఈనాడు మాత్రం రాసేసింది. ఇక రఘరామ భవిష్యత్తు ఏమిటి? ఆయన వైసిపి తెప్ప యిప్పటికే కాల్చేసుకున్నారు. బిజెపిపై యీ ఆరోపణ ద్వారా ఆ తెప్పా కాల్చేసుకున్నారు. టిడిపి ఒక్కటే గతి. ఇప్పటికే అక్కడ టిక్కెట్ల గురించి పోరాటం సాగుతోంది. ఈయన కోసం ఎవరినైనా పక్కకు జరగమంటే వాళ్లెలా రియాక్టవుతారో తెలియదు. ఎలాగోలా ఎకామడేట్ చేసినా, యిలాటి వీడియోలు వద్దు అని బాబు హెచ్చరించి మరీ టిక్కెట్టు చేతిలో పెడతారేమో!  

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :