చిన్మయి ఓవరాక్షన్.. క్షమాపణ చెప్పాల్సిందే!

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ద్వారా సెలబ్రిటీగా చెలామణీ అవుతూ ఉండే గాయని చిన్మయి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో అతిగాచేసిన వ్యాఖ్యలు, ఓవరాక్షన్ కారణంగా ఆమె వార్తల్లో నిలవడం విశేషం.

స్త్రీస్వేచ్ఛ గురించి, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు స్త్రీల వేషధారణ వ్యవహార సరళి కూడా కారణం అవుతున్నదన్న అభిప్రాయాల గురించి చిన్మయి ఫైర్ కావడంలో విశేషం ఏమీ లేదు. కానీ.. అలా ఫైర్ కావడాన్ని ఇంకాస్త స్పైసీగా మార్చడానికేనా అన్నట్లుగా.. భారతదేశంలో అమ్మాయిగా పుట్టడమే ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.

గాయని చిన్మయి కేవలం పాటలు పాడడంతో ఎప్పుడూ పరిమితం కాలేదు. చాలా సామాజిక సమస్యల మీద ఆమె స్పందిస్తుంటారు. తన గళం వినిపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆమె చాలా దూకుడుగా ఉంటారు. తరచూ అలా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నప్పటికీ వెనుకాడే రకం కాదని నిరూపించుకుంటూ ఉంటారు. అలాంటి చిన్మయి, ఈసారి సీనియర్ తెలుగు నటి అన్నపూర్ణమ్మ మీద విరుచుకుపడ్డారు. ఇందుకు సహేతుకమైన కారణమే ఉంది.

ప్రస్తుతం బామ్మ పాత్రలు వేస్తున్న అన్నపూర్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడారు. ‘‘అర్థరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు రాత్రిళ్లు బయటకు వచ్చేశారా? ఆడదానికి ఎందుకు స్వాతంత్ర్యం కావాలి? రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోయింది.. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం.. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనడమే కాదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది..’’ అంటూ అన్నపూర్ణ అన్నారు. Readmore!

ఈ వ్యాఖ్యలు చాలా సహజంగా వివాదాస్పదం అయ్యాయి. దేశంలో ఎప్పుడు మహిళల మీద అత్యాచారాలు జరిగినా, వారికి మద్దతుగా ఎంతో మంది స్పందిస్తూ ఉండగా.. మహిళల వస్త్రధారణ అలాంటి దుర్మార్గాలకు కారణం అవుతోందంటూ.. డ్రెస్ కోడ్ గురించి మాట్లాడే వాళ్లు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారి వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు విరుచుకుపడుతూ ఉంటారు. అమ్మాయిలు తమకు నచ్చిన డ్రస్ వేసుకున్నంత మాత్రాన అత్యాచారం చేసేస్తారా? అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఇలాంటి వాదనపై సమాజంలో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతూ ఉంటాయి. అయితే, అత్యాచారాలకు అమ్మాయిలే కారణం అంటూ సంకుచిత వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా అభ్యంతరకరమే.

దానికి తగ్గట్టుగానే గాయని చిన్మయి కూడా స్పందించారు. అన్నపూర్ణమ్మకు చాలా ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. తనకు బాగా నచ్చిన ఒక నటి అలా మాట్లాడడం గుండె పగిలినట్టుగా అనిపిస్తోందన్నారు. అర్ధరాత్రి ఏ ప్రమాదాలు జరిగినా హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లకుండా ఆడదాన్ని ఇంట్లోనే ఉంచేయాలేమో అంటూ ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ గారు చెప్పినట్టు చేస్తే.. పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు.. అంటూ లాజిక్ లేని కొన్ని వెటకారాలు కూడా చేశారు.

అన్నపూర్ణ వ్యాఖ్యలకు ఆమె ఎన్ని కౌంటర్లు వేసినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడం ఒక ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం అవుతున్నాయి. ఈ విషయంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దేశాన్ని అవమానించేలా ఆమె మాట్లాడారని అంటున్నారు. పోలీసు కేసు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యాఖ్యల ద్వారా చిన్మయి చేసింది మాత్రం ఖచ్చితంగా ఓవరాక్షనే.

దేశంలోని ఒక వ్యక్తి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన దేశాన్ని నిందించడం ఎలా సహేతుకం అనిపించుకుంటుందో చిన్మయి ఆలోచించుకోవాలి. చిన్మయి కాస్త బుద్ధిపూర్వకంగా ఆలోచించి ఉంటే.. ఇలాంటి వివాదం రేగకుండా చాలా చక్కగా సమస్యను హైలైట్ చేసి ఉండచ్చు. ‘‘ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు వెల్లడిస్తున్న అన్నపూర్ణ లాంటి వాళ్లు 2024లో కూడా మన చుట్టూ ఉన్నందుకు మనం సిగ్గుపడాలి’’ లాంటి కౌంటర్లు ఇచ్చి ఉండచ్చు.

‘‘అత్యాచారాలకు కారణం కూడా అమ్మాయిలే అని మాట్లాడే వాళ్లు ఈ దేశంలో పుట్టడం మన ఖర్మ’’ అని వ్యాఖ్యానించి ఉన్నా కూడా గౌరవంగానే ఉండేది. మహిళలకు ఈ దేశంలో ఎంతటి గౌరవం, ప్రాధాన్యం, అవకాశాలు లభిస్తున్నాయో కళ్లెదురుగా కనిపిస్తూ ఉండి కూడా.. ఈ దేశంలో అమ్మాయిగా పుట్టడం ఒక ఖర్మ అంటూ సంకుచితమైన బుర్రలేని వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పే. దేశం పట్ల అవమానకరంగా మాట్లాడడమే. అందుకు ఆమె ఖచ్చితంగా దేశప్రజలకు, దేశానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే.

Show comments

Related Stories :