నటుడు నాగబాబు, దర్శకుడు ఆర్జీవీ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో వాళ్ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు మరోసారి అది మొదలైంది.
ఈసారి నేపథ్యం ఇది.. వ్యూహం అనే సినిమా తీశాడు వర్మ. అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ ఈ సినిమాపై చర్చావేదిక నిర్వహించింది. ఈ డిస్కషన్ లో టీడీపీకి చెందిన ఓ కార్యకర్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆర్జీవీ తల తీసుకొస్తే కోటి రూపాయలిస్తాననే విధంగా మాట్లాడాడు. దీనిపై ఆర్జీవీ భగ్గుమన్నాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా ఏపీ డీజీపీని కలిసి లేఖ సమర్పించాడు.
నాగబాబు ఏమన్నారంటే... ఈ మొత్తం వ్యవహారంపై నాగబాబు స్పందించారు. తల నరికితే కోటి ఇస్తానని అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే టైమ్ లో ఆర్జీవీపై సెటైర్లు వేశారు.
"ఆర్జీవీ గారు మీరు భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను మాటిస్తున్నాను. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే, ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో-విలన్ కొట్టుకుంటుంటే, మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవ్వరూ చంపరు కదా."
ఇలా ఆర్జీవీపై పంచ్ లు వేశారు నాగబాబు. వర్మను ఓ కమెడియన్ గా తీసిపడేశారు. ఎలాంటి బెంగ లేకుండా నిశ్చితంగా ఓడ్కా వేసి పడుకోవాలని సలహా ఇచ్చారు.
అస్సలు తగ్గని ఆర్జీవీ.. నాగబాబు సెటైర్లకు ఆర్జీవీ అదే స్థాయిలో స్పందించాడు. "సర్, నా కంటే పెద్ద కమెడియన్ ఎవరంటే, నా సినిమాలో మీరు." అంటూ పంచ్ వేశాడు. తను తీసిన వ్యూహం సినిమాలో నాగబాబు పాత్ర ఉందని, అందులో అతడు మంచి కామెడీ చేశాడని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోవాలని నాగబాబుకు ఉచిత సలహా ఇచ్చాడు వర్మ. ఇలా నాగబాబు-ఆర్జీవీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.