‘‘జయలలిత మరణంపై సందేహాలు తగవు.. ఒకవేళ న్యాయమూర్తికి ఏవైనా సందేహాలు ఉంటే.. అవి కేవలం ఆయన వ్యక్తిగతం. వాటి గురించి నోటీసు ఇస్తే.. ఆయనకు కేంద్రం సమాధానం ఇస్తుంది…’’ బాధ్యతాయుతమైన ఒక కేంద్రమంత్రిగారు చేసిన ప్రకటన!
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం గురించి.. ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేస్తే.. ఆ సందేహాలు వ్యక్తం చేయడం తగని పని అని కేంద్రమంత్రిగారు చెబుతున్నారు. హైకోర్టు సందేహాలు వ్యక్తం చేస్తే.. అవి ఆ జడ్జి వ్యక్తిగత సందేహాలు.. అంటూ మంత్రిగారు తన భాష్యం చెబుతున్నారు! అంటే.. హైకోర్టు వేరు, జడ్జి వ్యక్తిగతం వేరేనా?
ఈ లెక్కన.. ప్రతి తీర్పులోనూ ప్రశ్నించవచ్చా? ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు కూడా ఈ అవకాశాలు ఉంటాయా? జడ్జికి అంతగా నా మీద డౌటుంటే.. ఆయన వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడొచ్చు.. అని ఎవరైనా దోషి వాదించొచ్చా?
అసలు జయ మరణంపై సందేహాలు తగవు.. అని చెప్పడానికి వెంకయ్య నాయుడు ఎవరు? ఎవరైనా రాజకీయ పార్టీ వాళ్లు జయ మరణం గురించి అనుమానాలు వ్యక్తం చేసి ఉంటే, వెంకయ్య వారికి సమాధానం ఇచ్చుకోవచ్చు. కానీ.. కోర్టు వ్యక్తం చేసిన సందేహం గురించి వెంకయ్య ఈ విధంగా స్పందించడం ఏమిటి? హైకోర్టు సందేహాన్ని, అందులోని జడ్జి సందేహంగా ఎలా వేరు చేస్తారు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? అనే సందేహాలు కలుగుతున్నాయి సగటు మనిషికి.
జయ మరణం గురించి అనుమానాలు వ్యక్తం చేసిన జడ్జి.. చాలా తీక్షణమైన సందేహాలనే ప్రభుత్వం ముందు ఉంచారు. ముఖ్యమంత్రికి రెగ్యులర్ గా జరిగే హెల్త్ చకప్స్ దగ్గర నుంచి ప్రతి అంశాన్నీ కూలంకషంగా ప్రస్తావించి.. ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఆ వివరాలను సమర్పించడం తమిళనాడు ప్రభుత్వం పని. వాటిని పరిశీలించి.. కోర్టు స్పందిస్తుంది.
కానీ వెంకయ్య గారు ఏమంటున్నారంటే.. ‘వైద్యులను అనుమానించడానికి లేదు, వైద్యులతో నేను మాట్లాడాను. ఆమె కోలుకున్నారు.. కానీ అంతలోనే గుండెపోటు వచ్చి మరణించారు..’ అని సెలవిచ్చారు.
ఈ మాట వింటే సామాన్యుడి మదిలో ఒకటే ప్రశ్న … అసలు మీరెవరు? ‘నేను వైద్యులతో మాట్లాడాను..’ అంటే, ఏంటిది? కొంపదీసి ఈ దేశానికి మీరు నియంతనా? మీరు మాట్లాడాక.. ఇంకెరికీ మాట్లాడే హక్కు ఉండదా! అది కోర్టు అయినా మరేం మాట్లాడకూడదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వెంకయ్య ప్రకటన విన్న జనసామాన్యం!