ఓ న్యాయమూర్తి అసహనం.. ఓ ముఖ్యమంత్రి మరణం అనుమానాస్పదం.. నివ్వరెపోతోన్న జనసామాన్యం..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి ఎన్నో అనుమానాలున్నాయి. అందులో ఏ ఒక్కదానికీ నివృత్తి లేదు. జయలలిత చనిపోయారన్నది నిజం. కానీ, ఆమె ఎలా చనిపోయారన్నది సస్పెన్స్. అదే జయలలిత డెత్ మిస్టరీ. ఆ మిస్టరీ వీడేదెలా.? జయలలిత ఆసుపత్రిలో వుండగానే, తమ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ప్రజానీకం ఆందోళన చెందారు, కోర్టులను ఆశ్రయించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
జయలలిత కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారని అంతా నమ్మారు. కానీ, జయలలిత విగత జీవిగా ఆసుపత్రి నుంచి బయటకొచ్చారు. ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు.. పది రోజులు కాదు, పాతిక రోజులు కాదు.. ఏకంగా 75 రోజులు జయలలిత చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రికి పరిమితమైపోయారు. అసలు జయలలితకు ఏమయ్యింది.? ఎలాంటి వైద్య చికిత్స ఆమెకు అందింది.? ఓ ముఖ్యమంత్రికి వైద్య సహాయం అందించే క్రమంలో ఆమెను ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌కి ఎందుకు తరలించలేకపోయారన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఈ సందేహాల నడుమ, జయలలిత మరణంపై నమోదైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి వైద్యనాథన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. 'వ్యక్తిగతంగా నాకూ జయలలిత మరణంపై అనుమానాలున్నాయి. నేనే గనుక పూర్తి బాధ్యత తీసుకుంటే, పరిస్థితులు ఇంకోలా వుంటాయి..' అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జయలలిత చికిత్స విషయమై నోటీసులు కూడా జారీ చేశారు. స్పందించని పక్షంలో, జయలలిత మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టమ్ చేయాల్సి వస్తుందనీ స్పష్టం చేశారు న్యాయమూర్తి.
ఇంతలా ఓ న్యాయమూర్తి, అదీ హైకోర్టు న్యాయమూర్తి అల్టిమేటం జారీ చేశారంటే.. చిన్న విషయమేమీ కాదు. చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి అయ్యిందన్న ఆనందంలో వున్న ఆ పార్టీ శ్రేణులకు ఇది సూపర్ షాక్. అన్నాడీఎంకే కార్యకర్తల్లో చాలామందికి జయలలిత మరణంపై అనుమానాలున్నాయి. కానీ, పార్టీ ఆ అనుమానాల్ని తొక్కిపెట్టేసింది. ఇది ఇంకా ఆశ్చర్యకరం. న్యాయస్థానం జోక్యంతో జయలలిత డెత్ మిస్టరీ వీడుతుందన్న భావన అందరిలోనూ నెలకొంది.
ఓ ముఖ్యమంత్రికి రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు జరుగుతాయి.. అలాంటిది, ఆసుపత్రిలో చేరి కోలుకోలేనంత తీవ్రస్థాయి అనారోగ్యానికి జయలలిత గురవడం ఎలా సాధ్యం.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. డెత్ మిస్టరీలో కీలక కోణం ఇదే. రీ-పోస్ట్‌మార్టమే జరుగుతుందో, లేదంటే అపోలో ఆసుపత్రి సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో న్యాయస్థానానికి వివరిస్తాయోగానీ.. నిజాలు నిగ్గు తేలే అవకాశాలైతే కన్పిస్తున్నాయిప్పుడు.