ఇప్పుడీ 'రామాయణం' ఎందుకు?

రాజకీయ నాయకుల్లో కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. చిచ్చు పెట్టేలా మాట్లాడటం, మానిపోయిన గాయాలను గెలకడం, అందరూ మర్చిపోయిన విషయాలను బయటకు తీసి రాజకీయ రంగు పులమడం... ఇలాంటి పనులంటే ఇష్టం. ఇలాంటి నాయకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒకరు. ఏపీలో టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనా ఈయన శత్రువులా వ్యవహరిస్తుంటారు.

బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకవర్గంలో సోము వీర్రాజు ప్రముఖుడు. బీజేపీ-టీడీపీ బంధం తెగిపోవాలని కోరుకునేవారిలో ఈయనా ఉన్నారు. తరచుగా టీడీపీపై విమర్శలు చేసే వీర్రాజు తాజాగా తెలంగాణలోని భద్రాచలం రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మానిపోయిన గాయాన్ని మరోసారి గెలికారు. ఈయన గెలికింది ఏమిటి? 'భద్రాచలం రామాలయం ఏపీ ప్రజలది. ఏపీకి చెందిన ఆలయం.

దాన్ని కాంగ్రెసు పార్టీ తెలివితక్కువగా తెలంగాణకు కట్టబెట్టింది. ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెసు పార్టీ భద్రాచలం రామాలయాన్ని ఆంధ్రాకు తిరిగి ఇవ్వాలని ఎందుకు డిమాండ్‌ చేయడంలేదు' అని  ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రాకు అన్యాయం చేశారని  నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు ఘోషించిన తరువాత అదే బాటలో వీర్రాజు భద్రాచలం విషయం ప్రస్తావించారు.

ఇప్పుడీ 'రామాయణం' అవసరమా? అయినప్పటికీ 'అసలు కథ' ఏమిటో చూద్దాం. తెలంగాణలో యాదగిరి గుట్ట తరువాత భద్రాచలమే పెద్ద దేవ స్థానం. తిరుమల బ్రంహోస్తావాలు ఎంత ప్రసిద్ధమై నవో భద్రాచలంలో రాముడి కళ్యాణం కూడా అంత ప్రాముఖ్యం ఉన్న ఉత్సవం. భద్రాచలం తెలంగాణ జిల్లా అయిన ఖమ్మంలోనే  (ఇప్పుడు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా అయింది) ఉండాలని, కాదు ఆంధ్రాలో కలపాలని  తెలంగాణ ఉద్యమంలో ఆందోళనలు సాగాయి.

1956లో హైదరాబాద్‌ రాష్ట్రం- ఆంధ్ర రాష్ట్రం విలీనమైనప్పుడు అప్పటివరకూ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను పరిపాలన సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారు. పూర్తి గిరిజన ప్రాంతమైన భద్రాచలం డివిజన్‌లోని ప్రజలు తూర్పు గోదావరిలో ఉన్నప్పుడు సుదూరంగా ఉన్న జిల్లా కేంద్రం కాకినాడకు వెళ్లాలంటే నానా తిప్పలు పడేవారు.

అప్పట్లో రవాణా సౌకర్యాలు చాలా తక్కువగా ఉండటం ఇబ్బందులకు కారణం. దీంతో దగ్గర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో (ఖమ్మం 105 కిలోమీటర్లు) కలిపితే రాకపోకలకు అనువుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ జిల్లాలో విలీనం చేశారు. ఆలయం మాత్రం మొదటి నుంచీ  తెలంగాణలోనే (ఖమ్మం జిల్లా ఏర్పడక ముందు ఇదంతా వరంగల్‌ జిల్లాగా ఉండేది. ఆ జిల్లాను విడదీసి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు) ఉంది.

ఖమ్మంకు సమీపంలోని నేలకొండపల్లికి చెందిన కంచర్ల గోపన్న (రామదాసు) తానీషా పరిపాలనలో పాల్వంచ తహశీల్దారుగా పనిచేస్తున్నప్పుడు భద్రా చలంలో ప్రభుత్వ నిధులతో రామాలయం కట్టించడం, ఆ నేరానికిగాను జైలు పాలు (గోల్కొండ కోటలో) కావడం, రామలక్ష్మణులు తానీషా కలలో ఆ డబ్బు ఇచ్చి రామదాసును విడిపించమని ఆదేశించడం... ఇదంతా అందరికీ తెలుసు.

దీన్నిబట్టి చూస్తే ఆలయం తెలంగాణ ప్రాంతంలోదే. కొన్ని మండలాలు మాత్రం తూర్పు గోదావరిలోవి. విభజన తరువాత భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలు పోలవరం ముంపు మండలాల పేరుతో ఆంధ్రాలో కలిపారు. ఉద్యమ సమయంలో  సీమాంధ్రులు భద్రాచలం మొత్తం తమదే అన్నారు.

భద్రాచలం మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ వారు హెచ్చరించారు. ఉద్యమ సమయంలో  రాష్ట్ర ప్రభుత్వం జీవోఎం (మంత్రుల బృందం)కు  పంపిన నివేదికలో భద్రాచలం సీమాంధ్రకు చెందాలని పేర్కొంది. జీవోఎంలో సభ్యుడైన మంత్రి జైరాం రమేష్‌ కూడా ఇదే చెప్పారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1956కు ముందున్న తెలంగాణ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు కాబట్టి అప్పటికి భద్రాచలం తూర్పు గోదావరిలో ఉందని, కాబట్టి అది ఆంధ్రాకు చెందుతుందని నివేదికలో ప్రభుత్వం తెలియచేసింది. కాని ఆ సమయానికి భద్రాచలం ఆలయం తెలంగాణలోనే ఉందని అక్కడివారు వాదించారు.

అప్పట్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని  కోరుకున్న సీపీిఎం కూడా భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని ఆందోళనలు చేసింది. ఎట్టకేలకు భద్రాచలం పట్టణం, ఆలయం తెలంగాణ పరిధిలోనే ఉంచారు. ముంపు మండలాలు మాత్రం ఆంధ్రాకు వెళ్లాయి.

తమను ఆంధ్రాలో కలపడాన్ని ఆ మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు వారి ఎమ్మెల్యే సున్నం రాజయ్య (సీపీఎం) తెలంగాణ లో ఉండగా ఓట్లేసినవారు ఆంధ్రాలో చేరిపోయారు. సున్నం రాజయ్య స్వగ్రామం కూడా ఆంధ్రాలో కలిసిపోయింది. రామాలయం కథ ముగిసిపోయింది. మళ్లీ వివాదం లేవనెత్తడం మంచిది కాదు.

-నాగ్‌ మేడేపల్లి

Show comments