బీజేపీ ఓటమి చారిత్రక అవసరమా?

ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రత్యర్థులైన భారతీయ జనతాపార్టీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీజేపీ శక్తియుక్తులన్నీ ఒడ్డి ఏ విధంగానైనా అధికారంలోకి వచ్చేందుకు విశ్వయత్నాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగిస్తున్న సమావేశాలకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మరోవైపు ఎస్‌పి- కాంగ్రెస్‌ కూటమి అన్ని వర్గాలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నాయి. రాహుల్‌గాంధీ, అఖిలేష్‌యాదవ్‌లు సుడిగాలిగా తిరుగుతున్నారు. ఈ ఎన్నికల ప్రచార హోరులో మాయావతి ఆధ్వర్యంలోని బహుజన సమాజ్‌పార్టీ వెనుకబడి ఉన్నది. ఆమె కూడా తనవంతు ప్రయత్నాలు విస్తతంగా చేస్తున్నది.

సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్‌ కూటమి అత్యధికంగా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అఖిలేష్‌ పట్ల యువతకున్న ఆదరణకు తోడుగా రాహుల్‌- ప్రియాంకలు రంగంలోకి దిగడం వారికి కలిసి వస్తోంది.  ముస్లింలకు మాయావతి ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ వారు అధికంగా ఎస్‌పీ-కాంగ్రెస్‌ కూటమివైపే ఆకర్షితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోడీ పూర్తిగా హిందువులు, బీసీల్లో నిమ్నకులాలు, జాట్లు, బ్రాహ్మణుల ఓట్లపై ఆధారపడి ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సర్వేలు నిర్వహించి మరీ అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేశారు.

పెద్దనోట్ల రద్దు, ఉపన్యాస ధోరణే తప్ప ఆచరణలో కనిపించని ఫలితాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి వ్యతిరేకంగా పరిణమిస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల బీజేపీ తన పూర్తిస్థాయి యంత్రాంగాన్ని ఉత్తరప్రదేశ్‌లో మోహరించింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాలు మాత్రమే పెద్దఎత్తున ప్రచారంలోకి దిగారు. కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. యువకులను ఆకర్షించేందుకు బీజేపీ ఐటీ విభాగం తీవ్రస్థాయిలో పనిచేస్తోంది. ఈ రీత్యా బీజేపీ పోటీలో ముందుండగలుగుతోంది.

నిజానికి అఖిలేష్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, మాఫియా రాజ్యం, కులతత్వం, నేర సామ్రాజ్యం వల్ల సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల్లో దెబ్బతినాలి. కాని తండ్రిపై తిరుగుబాటు చేయడం ద్వారా అఖిలేష్‌ వీటన్నిటి ప్రభావం నుంచి తప్పించుకున్నారు. అఖిలేష్‌ తండ్రినీడలోనే ఇంతకాలం సరైన నిర్ణయాలు తీసుకోలేదని, ఆయనకు అధికారం ఇస్తే మార్పు తీసుకురాగలరని యువత భావిస్తోంది. ముఖ్యంగా యాదవ యువత అఖిలేష్‌ అంటే ఊగిపోతోంది. దీనివల్ల సాధారణ ప్రభుత్వ వ్యతిరేకతనుంచి అఖిలేష్‌ తప్పించుకోగలిగారు. దీనికి తోడు కాంగ్రెస్‌ చేరడంతో ఆపార్టీ వైపు బ్రాహ్మణులు, దళితులు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి

సాధారణ పరిస్థితుల్లోనైతే బీజేపీ యూపీలో సులభంగా గెలిచేదే. కాని అఖిలేశ్‌ ప్రభుత్వ వ్యతిరేకతనుంచి తప్పించుకోవడం వల్ల సమాన స్థాయిలో మాత్రమే పోటీ ఇవ్వగలుగుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తారని అంటున్నారు. కాని నరేంద్రమోడీ పట్ల పార్టీలో ఉన్న అంతర్గత వ్యతిరేకత ఆయనకు ప్రతికూలంగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది. చాలా కాలంగా అమిత్‌ షా- మోడీ ఏకఛత్రాధిపత్యం, అహంకారం, ఎవర్నీ పట్టించుకోకపోవడం పట్ల పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చాలా మంది నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తమను సంప్రదించకపోవడం, కనీసం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంపీలు విమర్శిస్తున్నారు. సర్వేల పేరుతో అమిత్‌ షా తమను అవమానించారని వారు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో కూడా ఎంపీలకు మోడీ సమయం ఇవ్వడం లేదు. మంత్రులతో కూడా చర్చించడం లేదు. పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాల విషయంలో తమకు ప్రాధాన్యత లేదని మంత్రులు వాపోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే మోడీకి పట్టపగ్గాలుండవని, ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కంటే మించి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటారని, చాలా మంది సీనియర్లను శంకరగిరి మాన్యాలకు పట్టిస్తారని బీజేపీ నేతలే అంటున్నారు. మోడీ అహంకారం తగ్గి నేలపై నడవాలంటే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం జరగాలని వారే కోరుకుంటున్నారు. అందువల్ల వారు అన్యమనస్కంగానే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొద్దిచోట్ల వ్యతిరేక వర్గాలను రెచ్చగొడుతున్నారు. బీజేపీ యూపీలో ఓడిపోవడం ఒక చారిత్రక అవసరం. యూపీలో ఓడిపోతే బీజేపీ నేతలు నరేంద్రమోడీని బహిరంగంగా తప్పుపట్టేందుకు అవకాశాలుంటాయి. కేంద్రమంత్రులు కూడా స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఆస్కారం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తలను మోడీ బలి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అమిత్‌ షాను గుజరాత్‌కు పంపి పార్టీ అధ్యక్షుడుగా పాత అద్వానీ గ్రూప్‌లో ఒకరిని మోడీ నియమించి, సంధి చేసుకునే అవకాశాలుంటాయి. ఈ పరిణామాలకోసం బీజేపీ నేతలే ఎదురు చూస్తున్నారు.

Show comments