దర్శకుడు వంశీ: ఈ సారి ‘మంచు పల్లకి’ కబుర్లు

22 సంవత్సరాల వయసుకే ఆయన తన తొలి సినిమాకు దర్శకత్వం వహించారు! తొమ్మిదేళ్ల వయసుకే కథలు రాసి పత్రికల నుంచి బహుమతులు పొందిన మేధావే అయినా.. ఆ తరంలో ఆ వయసుకే దర్శకత్వం అంటే.. ఈ తరానికి కూడా వింతే! ఒక తమిళ సినిమాకు రీమేక్ గా తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా “మంచుపల్లకి’ విశేషాలను వివరించారు దర్శకుడు వంశీ. చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాటల చిత్రీకరణలో అప్పటికే వంశీ మార్క్ స్పష్టం అవుతుంది. ఈ సినిమాలోని “మనసే.. మణిదీపం..’ యూట్యూబ్ మోస్ట్ వ్యూస్ లో ఒకటిగా ఉంటుంది. ఇవన్నీ పరిశీలకులు చెప్పే మాటలు.. మరి ‘మంచు పల్లకి’  విశేషాలు ఆ లెజెండ్ చెబితే… తన ఫేస్ బుక్ ఫేజ్ ద్వారా దర్శకులు వంశీ ఈ సారి “మంచుపల్లకి’ విశేషాలు వివరించారు.

నేను అసిస్టెంట్ గా పనిచేసే సినిమా ఆఫీసు, లేకపోతే జ్యోతి మంత్లీ ఆఫీసు, అదీ గాకపోతే ఏడిద నాగేశ్వరరావు గారిల్లు, ఒకోసారి జ్యోతి ఎడిటర్ వేమూరి సత్యనారాయణ గారిల్లు... ఇవీ ఆనాడు మద్రాసులో నేను కలతిరిగిన ప్రదేశాలు.
సీతాకోకచిలుక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాకా చాన్నాళ్ళు పనిలేకండా పోయింది నాకు. సరిగ్గా ఆ టైములోనే జ్యోతిలో మానేసి ఇంట్లో ఉంటున్న వేమూరి సత్యంగార్ని రెగ్యులర్ గా కలుస్తుండే వాడ్ని. సరిగ్గా అదే టైములో రాజమండ్రి నించి వచ్చిన ఎం ఆర్ ప్రసాదరావు గారు సినిమా తీస్తానంటే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుదిరారు సత్యం గారు.
కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు ఒక కథకి స్క్రీన్ ప్లే రాస్తే, వాళ్ళ దగ్గర మేనేజర్ గా పనిచేసిన వడివేల్ అనే ఆతను సుహాసిన్ని హీరొయిన్ గా పెట్టి సినిమా తీశాడు.పేరు ‘’పాలయ వన్న సోలై’’. హిట్ అయింది.
ఆ సినిమాని తెలుగులో తియ్యడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు, ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చెయ్యడానికి ఇల్లు కోసం తిరుగుతున్నారు.
ట్రస్ట్ పురంలో నేను ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఏడిద నాగేశ్వరరావు గారుండే వారు. శంకరాభరణం తర్వాత కామదార్ నగర్లో బాలసుబ్రహ్మణ్యం గారింటి అవతల ఇల్లు కొనుక్కుని అక్కడికి షిప్ట్ అవడంతో ఈ ఇల్లు ఖాళీ గావుంది .
కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న ఈ బాచ్ తో తిరుగుతున్న నేను ఖాళీ అయిన ఈ పుష్పాల సుందరబాబు గారి ఇంటి గురించి చెప్పేటప్పటికి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఇందులోకి దిగిపోయేరు.
డైరెక్టర్ బాపూ గారయితే బాగుంటుందని వెళ్లి వార్ని కలిశారు.కానీ, వేమూరి సత్యనారయణ గారన్న ఒక మాటకి హర్ట్ అయిన బాపుగారు ఆ సినిమా చెయ్యనన్నారు.తర్వాత జంధ్యాల దగ్గర కెళ్ళారు. “మీరు కొత్తవాళ్ళు డబ్బుసంచి పట్టుకుని నా వెనకాల తిరిగితే చాలు సినిమా తీసి పెడతాను” లాగేదో జంధ్యాలగారు అనేటప్పటికి ,సినిమా మేకింగ్ లో మా ఇన్వాల్వ్ మెంటు కూడా ఉంటుంది. అనుకున్న వీళ్ళు ఆయన్నొద్దను కున్నారు. వేజెళ్ళ సత్యన్నారాయాణని కలిస్తే లక్ష రుపాయిలడిగేరు. వీళ్ళు వేసుకున్న బడ్జెట్ కి చాలా ఎక్కువ ఎమౌంట్ అది. దాంతో ఆయన్నీ వద్దనుకున్నారు.
‘’డైరెక్ట్ చేసే ఆయనెవరా’’ అని తెగ ఆపసోపాలు పడిపోతుంటే ‘’నాలాగ ఎందరో’’.....కుక్క కాటుకి చెప్పుదెబ్బ ‘’చూసేను.బాగున్నాయి నాకు వాటి డైరెక్టర్ ఈరంకి శర్మ. మనకాయన బాగుంటారు అనిపిస్తుంది.అన్నాను .
భళే చెప్పేడే అని నన్ను తెగ మెచ్చుకుని, తెల్లరేకా మైలాపూర్ లో ఉన్న ఆ శర్మ గారింటికెళ్ళి పరిచయం చేసుకున్నాకా, వచ్చిన పనేంటో చెప్పారు.
విన్న శర్మ గారు ‘’నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ....ఇవ్వాళ మంగళవారం ....రేపు మాటాడుకుందాము’’ అని ఆఫీస్ అడ్రస్ అడిగితే చెప్పి బయల్దేరేరీళ్ళు.
వీళ్ళకి శ్రేయోభిలాషి అయిన ఒక ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళా ఈరంకి శర్మ గారి ఇంటికెళ్ళిన విషయం తెలిసి పోయింది. అర్జెంటుగా కారేసుకుని ఆఫీసు కొచ్చేసినాయన’’ అసలా శర్మ గారిని పెట్టమని సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు ‘’అంటా చాలా అల్లరి చేసేటప్పటికి ,చాలా డల్లయిపోయిన నిర్మాతలు, మర్నాడు ఆ శర్మ గారింటి కెళ్ళలేదు. సరిగదా, ఆఫీసు తాళాలేసుకుని బయటికెళ్ళి పోయేరు.
వస్తానన్న వీళ్ళకోసం ఎదురు చూసి చూసిన ఆ ఈరంకి శర్మ గారు, ఆటో వేసుకుని ట్రస్ట్ పురంలో ఉన్న ఆఫీసు కొచ్చేసి ,తాళం కప్ప వేసి ఉండటంతో చాలా సేపు వెయిట్ చేసి ,చేసి వెళ్లిపోయేరు.
డైరెక్టర్ ఫైనలైజవ్వడం లేదని తెగ ఇదయ్యిపోతున్న ప్రసాదరావుగారు ప్రోబ్లం ని ,నాతోకూడా పాలుపంచు కుంటా “ఎవరన్నా డైరెక్టర్ పేరు చెప్పవయ్యా” అన్నారు. మొన్న అనుభవానికి చాలా ఇన్సల్ట్ అయిపోయిన నేను ఇంక చెప్పనన్నాను.
ఒక రోజు పొద్దుటి పూట మేం అద్దె కుంటున్న ఒకే గది కటకటాలింటి కొచ్చిన సత్యం గారు ‘’డైరెక్టర్ ఫైనలైజయి పోయేడు వంశీ’’అన్నారు .
‘’అనుకున్నాను ...ఈ చిరాకులో ఎవడో ఒకడ్ని చేసి పారేసుంటారని ఎవరు ?’’అన్నాను.
నవ్వేసిన సత్యంగారు ‘’నువ్వే’’అన్నారు.
‘’భళే వోరే .... ముప్పై ఏళ్ళు వచ్చేదాకా నేను డైరెక్టరవ్వను.’’అన్నాను .
‘’ఇప్పుడు ....నీ వయసెంత ?’’ అడిగేరు సత్యం గారు .
‘’ఇరవై రెండు ‘’చెప్పేను.
‘’ముప్పై ఏళ్ల దాకా ఎందుకు?’’
‘’ నా దృష్టిలో సినిమా డైరెక్టర్ అంటే మాటలు గాదండి .....చాలా నేర్చు కోవాలి ,చాలా సబ్జెక్ట్స్ మీద చాలా అవగాహన కావాలి .......వరల్డ్ ఫిల్మ్ గురించి ........’’
‘’నేర్చుకున్నది చాల్లే గానీ ఆఫీసుకి పద చెప్తాను’’అంటా లాక్కెళ్ళి పోయేరు నన్ను.
మూడు రోజుల పాటు రాత్రి పగలు ఆలోచించిన నేను ‘’సరేనండి .... ఒక రోజు షూటింగ్ కి కావలసినవన్నీ ఎరేంజ్ చెయ్యండి....అది నాకు రిహార్సలు ‘’అన్నాను.
నేను చెప్పినవన్నీ ఎరేంజ్ చేసిన సత్యం గారు, నాకు అసిస్ట్ చెయ్యడానికి ఒక సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ ని కూడా పెట్టారు.
ఆఫీసు లోనే షూట్ .
హాఫ్ డే పాటు షూట్ చేశాక పాజిటివ్ ప్రింట్ చేయించి ,కోడంబాక్కంలో లిబర్టీ దియేటర్ ఎదురుగావున్న అఫ్సర లాడ్జిలో చిన్న ప్రివ్యూ దియేటర్ ఉంటే అందులో చూసుకున్నాను.
మర్నాడు ఆఫీసు కెళ్ళిన నేను ‘’సరే మీ సినిమా డైరెక్ట్ చేస్తాను గానీ ,ఆ సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ని పనిలోంచి తీసెయ్యండి ముందు ‘’అని మొన్న సీతాకోకచిలుక సినిమాకి నాతోపాటు అసిస్టెంట్ గా చేసిన ముడుచూరి దొరసామి రెడ్డిని ,వైజాగ్ మిత్రుడు (ఇప్పుడు హీరోలకి ట్రైనింగ్ ఇస్తున్న ) ఎల్ .సత్యానంద్ నీ అసిస్టెంట్స్ గా పెట్టుకుని సిన్మా డైరెక్ట్ చెయ్యడం మొదలెట్టిన నాకు నెల జీతం 6.50 రూపాయిలు.
మాటల రచయితగా పనిచేస్తున్న యండమూరి వీరేంద్రనాథ్ గారూ,నేనూ ఆ సాయంత్రం మా ఆఫీసు ఎదురుగుండా ఉన్న వీధిలో ఉన్న స్వర్గీయ కొడవటిగంటి కుటుంబరావు గారింటి ముందు నుంచి వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ‘’ఈ సినిమాకి నీ మొదటి నవల టైటిలే పెడితే బాగుంటుంది గదా ?’’ అన్నారు.
ఈ ఐడియా అందరికీ నచ్చడం తో అదే పెట్టాం ‘’మంచుపల్లకీ’’.
ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్ గా చేసిన సుహాసిన్నే దీంట్లో కూడా పెట్టాం.అప్పటికే హీరోగా బిజీగా ఉన్న చిరంజీవి గారి డేట్లు 13 రోజులు మాత్రం ఖాళీగా ఉన్నాయి .తక్కినవి ఎలాగోలా సర్దొచ్చులే సిన్మా చేద్దాం’’ అన్నారు అరవింద్ గారు.
హైదరాబాద్ వచ్చేం.
సంజీవరెడ్డి నగర్లో (ఎస్.ఆర్ .నగర్ ) పిట్ట గోడల మీద షూటింగ్. యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకి నా మీద నమ్మకం చాలా తక్కువగా ఉంది.వాళ్ళలా ఫీలవ్వడంలో తప్పులేదు.ఎందుకంటే ,సిన్మా డైరెక్ట్ చెయ్యడానికి నాకున్న అనుభవం ఏమాత్రం చాలదు.
ఫస్ట్ షెడ్యూల్ల్లో చేసింది ఎడిట్ చేసి సారధి స్టూడియోలో డబ్ చేస్తుంటే 
స్కీన్మీద చూసిన నటీ నటులు నమ్మడం వల్ల,మిగతాది షూట్ చేస్తున్నప్పుడు అసలు మాటాడలేదు. ఫైనల్ ప్రోడక్ట్ చూసిన చారుహాసన్ సిగరెట్ కాలుస్తా దియేటర్లోనుంచి బయటి కొచ్చి ఎవరితోనూ మాటాడకుండా కారెక్కి వెళ్లి పోయేరు.
ఈ రీమేక్ సినిమాలతో ప్రోబ్లం ఏమిటంటే ఎవరికైనా సరే ఒరిజినల్ వెర్షనే బాగుంటుంది. తర్వాత ఎన్ని భాషల్లో ఎన్ని వెర్షన్స్ ఎంత బాగా తీసినా ఒప్పించలే౦. ఒరిజినల్ అంత బాగా లేదనేస్తారు. చారుహాసన్ గారి విషయానికొస్తే.......... సినిమాల మీద చాలా అవగాహన ఉన్న మేధావి ,పైగా ఒరిజినల్ వెర్షన్ స్కీన్ ప్లే రైటర్ .ఈ తెలుగు వెర్షన్ ఆయనకి నచ్చదు ఎందుకంటే నేనిందులో చాలా మార్చేసేను..
కానీ,
ఇక్కడ కొంచెం రివర్స్ అయ్యింది.మర్నాడు పొద్దుట నిర్మాతలకి ఫోన్ చేసిన చారుహాసన్ ‘’మీ సినిమా నెల్లూరు జిల్లా చారుహాసన్ ఎంటర్ ప్రైజెస్ అన్న పేరు మీద నేను కొనుక్కుంటున్నాను’’ అని రేటు మాటాడి ఫైనలైజ్ చేసుకున్నారు.
మద్రాసు లక్ష్మి కాలనీలో ఈ సినిమా షో వేస్తే సుహాసినితో పాటు వచ్చిన వాణి గణపతి (కమలహాసన్ మొదటి భార్య )లాస్ట్ లో సుహాసిని మీద పడి ఏడుస్తా ‘’నువ్వూ, ఆ హీరో చిరంజీవీ చివర్లో పెళ్లి చేసుకునే ఇంకొక సినిమా చూసేదాకా నా మనసు శాంతిoచదు’’అంటా కారెక్కి వెళ్లి పోయింది.
సురేష్ మహల్లో ప్రివ్యూ చూసిన మా గురువు శ్రీ కె . విశ్వనాద్ గారు నన్ను ఆశీర్వదించిన క్షణాలు మర్చిపోలేను.
అందరికంటే ,అన్నింటికంటే మా గొప్పగా గుర్తుంచు కోవాల్సిన వ్యక్తి లక్ష్మి ఫిలిమ్స్ లింగమూర్తిగారు. కె.ఎస్.రామారావు గారు చెపితే వచ్చి ఈ సినిమా చూసినాయన చాలా ఇష్టపడతా రిలీజ్ చేసారు .
కానీ ,
పేరయితే వచ్చింది గానీ ,తమిళ్లో అంత బాగా తెలుగులో ఆడలేదు.ఇక్కడ సక్సెస్ ప్రధానం అని తెలిసిన నాకు ,ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా బాగా తెలిసింది .
దాంతో ,
నిద్ర పట్టేది కాదు.తెలుగులో నా గురువుల్తో పాటు బిమల్ రాయ్,రిత్విక్ ఘటక్ ,అకిరాకురసోవా, జోల్టన్ ఫాబ్రి లాంటి గొప్పగొప్ప దర్శకులు గుర్తుకొచ్చేవారు.అసలు ఫిల్మ్ డైరెక్టర్ అంటే మాటలా ........అసలెందుకు దిగేను?,ఎంత తప్పు చేసేను?.... 
మళ్ళి అసిస్టెంటుగా చేసి ,చాలా చూసి,చాలా చదివి ,చాలా టెక్నాలజీని ఔపోసన పట్టి ,తోక్కేసిన అందమైన వాకిట్లో పండగ ముగ్గుని సరిదిద్దే వాడినేమో కానీ ,
నేను రాసిన ‘’మహల్లో కోకిల ‘’నవలని ‘’సితార’’ సినిమాగా తియ్యడానికి. ఏడిద నాగేశ్వరరావు గారి దగ్గర్నుంచి కబురొచ్చింది.

Show comments