మన దేశంలో ఎన్నికల జోస్యాలు తప్పడం విశేషం కాదు. కానీ సాంకేతికంగా విపరీతంగా అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా తప్పింది. కొమ్ములు తిరిగిన పండితులూ ఫలితం వూహించడంలో బోల్తా పడ్డారు. ఎన్నికల రోజున కొంతమంది నిపుణులు కలిసి ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి నెగ్గాక హిల్లరీకి స్వదేశంలో, విదేశీ వ్యవహారాల్లో ఎదురయ్యే యిబ్బందుల గురించి మాట్లాడసాగారు. ట్రంప్ నెగ్గితేనో...? అని ఓ విలేకరి అడిగితే అది ఊహాజనితమైన ప్రశ్న అంటూ కొట్టిపారేశారు. అంత ధీమాగా వున్నారు నిపుణులు! నిజానికి హిల్లరీకి ట్రంప్ కంటె 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినట్లున్నాయి. (తుది ఫలితాలు యింకా రాలేదు) అందువలన హిల్లరీయే ఎక్కువ పాప్యులర్ అనీ, వాళ్ల వూహ కరక్టే అనీ నుకోవచ్చు. కానీ అయినా ఆమె నెగ్గలేదు. ఎందుకంటే ఎలక్టరల్ కాలేజీలో ట్రంప్‌కు హిల్లరీ కంటె దాదాపు 70 ఓట్లు ఎక్కువ వచ్చాయి. గెలవాలంటే మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 వచ్చినవాళ్లు గెలుస్తారు. ఒక్కో రాష్ట్రానికి ఓటు విలువ (వెయిటేజి)లో తేడా వుంటుంది. 4 కోట్ల జనాభా వున్న కాలిఫోర్నియా రాష్ట్రంలో 55 ఓట్లు వున్నాయి. అక్కణ్నుంచి అంతమంది ప్రతినిథులు (ఎలక్టోరల్స్) ఎన్నికవుతారు. 10 లక్షల లోపు జనాభా వున్న అలాస్కా నుంచి 3గ్గురు ఎలక్టోరల్స్ ఎన్నికవుతారు. వీళ్లు అధ్యక్ష ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తామంటే కుదరదు. మన దగ్గరైతే నియోజకవర్గాన్ని యూనిట్‌గా చూసి దానిలో మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు గెలిచారంటాం. అక్కడ రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా చూస్తారు. తమ రాష్ట్రంలో మెజారిటీ సాధించిన పార్టీ తాలూకు అధ్యక్ష అభ్యర్థికి ఆ రాష్ట్రంలో ఎన్నికైన అభ్యర్థులందరూ - పార్టీతో సంబంధం లేకుండా - చచ్చినట్లు వేయాల్సిందే. అభ్యర్థికి అమెరికా ఎన్నికల ప్రక్రియలో వున్న చిత్రమే అది.
విలువ ఎక్కువున్న రాష్ట్రాలలో ఎక్కువ ఓట్లు ట్రంప్‌కు రావడంతో అతనికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2012లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీకి ఒబామా కంటె ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చినా యిలాటి లాజిక్‌తోనే అతను ఓడిపోయాడు. అప్పుడు ట్రంప్ యీ పద్ధతేం బాగా లేదన్నాడు. అదే యిప్పుడతనికి అక్కరకు వచ్చింది. 2014 ఆంధ్ర ఎన్నికలలో తమకు టిడిపి కంటె కేవలం 6 లక్షల ఓట్లే తక్కువ వచ్చాయని జగన్ మాటిమాటికి వాపోతూ వుంటారు. ఆయన గ్రహించనిదేమిటంటే ఆయనకు వచ్చిన ఓట్లలో చాలా భాగం ఒకే ప్రాంతం నుంచి వచ్చాయి. కొన్ని జిల్లాలలో అయితే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అందుకని గెలిచిన వారికి 46.3% ఓట్లతో 102 సీట్లు రాగా వైసిపికి 44.5% ఓట్లతో 67 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువలన ఓట్ల శాతంలోని తేడా ఉన్న 2% తేడా సీట్ల శాతంలో 20%(టిడిపికి 58% సీట్లు వస్తే, వైసిపికి 38% వచ్చాయి) తేడాగా తర్జుమా అయింది. అమెరికాలో యింకో రకం తిరకాసు. ఏ రాష్ట్రంలో ఎవరు నెగ్గుతారో లెక్కలు వేసి అప్పుడు నిపుణులు ఒక నిర్ణయానికి వస్తే బాగుండేది.
అమెరికన్ ఎన్నికల పద్ధతిలో ఏ రాష్ట్రంలోనైనా సరే మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఆ రాష్ట్రానికి చెందిన మొత్తం పాయింట్లను తన జేబులో వేసుకుంటుంది కాబట్టి, చాలా రాష్ట్రాలు పార్టీల వారీగా చీలిపోయాయి కాబట్టి ఎవరు ఎటు వేస్తారో ముందే వూహించేసుకుని కచ్చితంగా యిన్ని ఓట్లు వస్తాయి అని పార్టీలు అనేసుకుంటాయి. అయితే 11 రాష్ట్రాలు మాత్రం లోలకంలా ఊగిసలాట ధోరణిలో వుంటాయి. వాటిని 'స్వింగ్ స్టేట్స్' అంటారు. అవి ఫ్లోరిడా (29 ఓట్లు), పెన్సిల్వేనియా (20), న్యూ హ్యాంప్‌షైర్ (4), మిచిగన్ (16), కొలరాడో (9), నార్త్ కరోలినా (15), నెవాడా (6), విస్కాన్సన్ (10), మైనే(4), నెబ్రాస్కా (5) అరిజోనా (11) రాష్ట్రాలు. వీళ్లు ఎటు వుంటే అటే గెలుపు. తక్కిన చోట్ల ఎంత ఎక్కువ సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నా ప్రయోజనం లేదు. 50 రాష్ట్రాలలో 30 ట్రంప్ పక్షాన నిలిచాయి. 20 మాత్రమే హిల్లరీ పక్షాన వున్నాయి. 25% మార్జిన్ కంటె ఎక్కువ తేడాతో రిపబ్లికన్లు 11 రాష్ట్రాల్లో గెలిస్తే డెమోక్రాట్లు 5 రాష్ట్రాలలో మాత్రమే గెలిచారు. 30 కంటె ఎక్కువ తేడాతో గెలిచినవి రిపబ్లికన్లకు 4 వుండే డెమోక్రాట్లకు 1 మాత్రమే వుంది. అత్యధికమైన మార్జిన్ డెమోక్రాట్ల విషయంలో 32.2 కాగా రిపబ్లికన్ల విషయంలో అది 47.6! ఈ స్వింగ్ స్టేట్స్ ఎలా ప్రవర్తించాయో చూడాలి. ఫైనల్‌గా చెప్పాలంటే వీటిలో 96 ఓట్లున్న 6 రాష్ట్రాలు రిపబ్లికన్లను గెలిపించగా, 33 ఓట్లున్న 5 రాష్ట్రాలు డెమోక్రాట్లను గెలిపించాయి.
ఈ సారి సర్వేలు గట్టిగా జరిపి ఈ స్వింగ్ స్టేట్స్‌ను కూడా అటో యిటో వేసుకుంటూ ఒక జాబితా విడుదల చేశారు కొందరు. దాని ప్రకారం చూస్తే రిపబ్లికన్లకు 19 రాష్ట్రాల నుంచి 157 ఓట్లు వున్న కచ్చితంగా వస్తాయని, 47 ఓట్లున్న 5 రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. ఇక డెమోక్రాట్స్ కైతే 17 రాష్ట్రాల నుంచి 200 ఓట్లు కచ్చితంగా వస్తాయని, 68 ఓట్లున్న 5 రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. హోరాహోరీగా పోటీ వున్న 5 రాష్ట్రాల్లో (66 ఓట్లున్నాయి) మాత్రం ఎటూ తేల్చలేమన్నారు. ఫలితాలు వచ్చాక చూస్తే రిపబ్లికన్లు తప్పకుండా గెలుస్తారని, మొగ్గు వుందని చెప్పిన రాష్ట్రాలన్నిటిలో గెలిచారు. డెమోక్రాట్ల విషయానికి వస్తే తప్పకుండా గెలుస్తారని వూహించిన చోట గెలిచినా మొగ్గు వుందని చెప్పిన 5 రాష్ట్రాలలో కొలరాడో, వర్జీనియాలు మాత్రం వాళ్లకు దక్కి మిచిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లు మాత్రం రిపబ్లికన్ల వశమయ్యాయి. అంటే అక్కడ 46 చేజారాయన్నమాట. ఇక హోరాహోరీ రాష్ట్రాలకు గుర్తించిన వాటిల్లో రిపబ్లికన్లు అరిజోనా, ఫ్లోరిడా, నార్త్ కెరోలినా గెలిచారు. నెవాడా, న్యూహాంప్‌షైర్ మాత్రం డెమోక్రాట్లకు దక్కాయి.
డెమోక్రాట్లకు పట్టున్న మిచిగన్, పెన్సిల్వేనియా, విస్‌కాన్సిన్, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాల్లో యీసారి ట్రంప్‌కు ఎక్కువ ఓట్లు పడడంతో అతను గెలిచాడు. హిల్లరీని బాగా దెబ్బ తీసిన రాష్ట్రాలు మూడున్నాయి - మిచిగన్, పెన్సిల్వేనియా, విస్‌కాన్సిన్! 16 ఎలక్టొరల్ ఓట్లున్న మిచిగన్‌లో ఒబామాకు 2012లో 54.2% ఓట్లు పడితే ఈ సారి హిల్లరీకి 47.3% మాత్రమే పడ్డాయి. అంటే చెప్పాలంటే ట్రంప్ కంటె 0.3% తక్కువ అన్నమాట. 10 ఓట్లున్న విస్కాన్సిన్‌లో గతంలో కంటె 5.9% ఓట్లు తక్కువగా, ట్రంప్ కంటె 1% తక్కువగా 46.9% పడ్డాయి. 20 సీట్లున్న పెన్సిల్వేనియాలో గతంలో కంటె 4.6% తక్కువగా, ట్రంప్ కంటె 1.4% తక్కువగా 47.4% పడ్డాయి. హిల్లరీ కనక యీ మూడిట్లో గెలిచి వుంటే ఆమెకు 274 ఎలక్టొరల్ ఓట్లు పడి గెలిచేది. ఈ రాష్ట్రాలలో ఓటర్లు - చిన్నాచితకా పనులు చేసేవారు, గ్రామీణులు. వలసదారులను ఆపి, ఉద్యోగాలు కల్పిస్తానన్న ట్రంప్ వాగ్దానం వాళ్లను ఆకట్టుకుంది. ప్రైమరీ ఎన్నికలలో బెర్నీ సాండర్స్‌తో పోటీ పడినప్పుడు కింది స్థాయి శ్వేతజాతీయులు సాండర్స్‌కు మద్దతివ్వగా హిల్లరీకి ఆఫ్రికన్-అమెరికన్లు మద్దతిచ్చి గెలిపించారు. తను పార్టీ అభ్యర్థిగా నియమించబడ్డాక కూడా హిల్లరీ శ్వేతజాతీయుల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. రస్ట్ బెల్ట్ రాష్ట్రపు ఓటర్లలో పెద్దగా చదువుకోని శ్వేతజాతీయులు మూడో వంతు మంది వున్నారు. వారికి ఉద్యోగాలు పోయాయి, వేతనాలు తగ్గాయి. అయినా సర్వేలు మాత్రం పెన్సిల్వేనియా (20 ఓట్లు)లో కూడా హిల్లరీ లీడ్‌లో వుందని చెప్పాయి. వాస్తవాలు వేరేలా వున్నాయని ఫలితాలు చెప్పాయి.
సర్వేలు ఎందుకిలా తప్పు ఫలితాలు చూపించాయి అనే చర్చ చాలా రోజులపాటే సాగుతుంది. ఇప్పటిదాకా అందుబాటులో వున్న సమాచారంతో విశ్లేషిస్తే కొంతవరకు బోధపడుతుంది. మొదటిగా మన అర్థం చేసుకోవలసినది - యీ విశ్లేషకులు, జర్నలిస్టులు వీరంతా సాధారణంగా నగరవాసులై, 'భద్రలోక్' వెరయిటీకి చెంది వుంటారు. వారి కంటూ కొన్ని సిద్ధాంతాలు వుంటాయి. వాటి ప్రకారమే లోకం నడవాలని ఆశిస్తూ, నడిచేస్తోందని భ్రమిస్తూ వుంటారు. ఇందిరా గాంధీ నియంత, మాయావతి అవినీతిపరురాలు, జయలలిత అహంభావి వీళ్లెవరూ గెలవకూడదు, చంద్రబాబు మేధావి గెలవాలి... యిలా తను అనేసుకుని, ప్రజలంతా కూడా తనలాగే అనేసుకుంటున్నారని భ్రమిస్తారు. 2004లో చంద్రబాబు స్థానంలో ప్రజలు వైయస్‌ను గెలిపిస్తారని నేను అస్సలు వూహించలేక పోయాను. వైయస్ మైళ్ల తరబడి పాదయాత్ర చేస్తే ఏమిటి? ప్రజలకేం ఒరిగింది? అని తీసిపారేశాను. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిని, అభివృద్ధి అడుగంటి, ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని వైయస్ గుర్తించి ఎన్‌క్యాష్ చేసుకున్నాడని తెలియలేదు. హైదరాబాదులో వెలుస్తున్న హైటెక్‌సిటీ, ఫ్లయిఓవర్లు చూసి జనం మురిసి ముక్కలవుతున్నారని పొరబడ్డాను. కానీ సామాన్యప్రజలు ఆలోచనాధోరణి వేరే వుంటుంది. వాళ్లు ఇందిర, మాయావతి, జయలలిత, వైయస్ అందర్నీ గెలిపిస్తారు. ట్రంప్ వంటి మొరటుమనిషికి అమెరికా అధ్యక్షుడయ్యే అర్హత లేదని పాత్రికేయులు ముందే అనుకుని, పాలిష్‌డ్‌గా కనబడే హిల్లరీనే నెత్తిన పెట్టుకున్నారు. కానీ ప్రజల దృక్పథం వేరేలా వుంది.
హిల్లరీ మహిళలందరూ తనకే ఓటేస్తారనుకుంది కానీ 54% మందే ఆమెకు ఓటేశారు. 'ఇప్పుడు ట్రంప్ బాధితుల దగ్గరకు వచ్చేసరికి ఫెమినిస్టులా బాగానే మాట్లాడుతున్నావు కానీ నీ భర్త పాలబడిన మహిళల విషయంలో ఏం చేశావ్? బాధితుల పక్షాన నిలవలేదేం? భర్త అధికారం, తద్వారా నీ పలుకుబడి పోతుందన్న భయమా?' అని మహిళలు అనుకున్నారు. హిల్లరీ ప్రచారసరళిలోనే పరస్పరవైరుధ్య అంశాలున్నాయి. తొలి మహిళా అధ్యక్షురాలవుతాను కాబట్టి మీరు ఓటేయండి అని మహిళలకు గట్టిగా చెప్దామనుకుంది కానీ ఆ పాయింటు నొక్కి చెపితే మగవాళ్ల ఓట్లు పోతాయని భయపడింది. సామాన్యుడి కోసం శ్రమిస్తానని చెప్పుకుంది కానీ వాల్‌స్ట్రీట్ ఉపన్యాసాలకై లక్షలాది డాలర్లు పెద్ద కంపెనీల నుంచి వసూలు చేసింది. ప్రజలు ప్రస్తుత వ్యవస్థపై, తెగ బలిసిన వాల్‌స్ట్రీట్ కంపెనీలపై కోపంగా వున్నారు. తన ఉపన్యాసాలకై వారి దగ్గర్నుంచి డబ్బు పుచ్చుకున్న హిల్లరీ వారికి వ్యతిరేకంగా వ్యవహరించదని ప్రజల అనుమానం. ట్రంప్ ఐతే విరాళాలు ఎదురు చూడకుండా సొంత డబ్బుతోనే దిగాడు కాబట్టి కంపెనీలతో మొహమాటా లుండవనుకున్నారు.
లాటినోలు, ఆఫ్రో-అమెరికన్లు ఒబామాకు మద్దతిచ్చారు కాబట్టి, తను ఒబామా వారసత్వాన్ని కొనసాగిస్తానంటోంది కాబట్టి వాళ్లు తనకూ మద్దతిస్తారని హిల్లరీ అంచనా వేసింది. వాళ్లనే దువ్వింది. కానీ వాళ్లు గత స్థాయిలో మద్దతివ్వలేదు. తమ వాడైన ఒబామా అధ్యక్షుడిగా వున్నా నల్లవారిపై దాడులు జరుగుతున్నాయని వారు నిస్పృహ చెందారు. పైగా వాళ్లెక్కడ హిల్లరీని గెలిపిస్తారోనన్న భయంతో కింది స్థాయి శ్వేతజాతీయులు పెద్ద సంఖ్యలో పోలింగు బూతులకు తరలి వచ్చారు. ట్రంప్‌ను సమర్థించేవాళ్లు డిప్లోరబుల్స్ అని హిల్లరీ అనడం వాళ్లను మండించినట్లుంది. వీటన్నిటితో బాటు శ్వేతజాతీయత ప్రధానపాత్ర వహించింది. 1960ల్లో లిండన్ జాన్సన్ యితర దేశస్తులను అమెరికాకు ఆహ్వానించడం మొదలుపెట్టాక పరదేశీయులు తమ దేశానికి వచ్చి పడిపోతూ, బాగు పడిపోతూంటే తమ స్థితి నానాటికి తీసికట్టవడం శ్వేతజాతీయుణ్ని బాధించింది. పోయిన తమ ప్రతిష్ఠ తిరిగి రావాలంటే తమ దేశం యితర దేశాల్లో ఖర్చు పెట్టడం మానేసి, తన దేశంలోనే ఖర్చు పెట్టి పరిశ్రమలు తిరిగి రావాలని కోరుకోసాగారు. తమ ఉద్యోగాలు లాక్కుంటూ వున్న పరదేశస్తులపై నియంత్రణ వుండాలని భావించారు వారు. రాజకీయ అవసరాల కోసం అందరితో మెత్తగా వ్యవహరించే హిల్లరీ కంటె లౌక్యం లేకుండా ఉన్నదున్నట్టు చెప్పే ట్రంప్ వాళ్లకు నచ్చాడు. వ్యాపారవేత్తగా పనివారితో మసలినప్పుడు ట్రంప్ వారి మనోభావాలను బాగా గ్రహించి, వారి కోసమే నిలబడ్డానంటూ ప్రచారం చేసుకున్నాడు.
ఇవన్నీ సర్వే నిర్వాహకుల దృష్టికి వచ్చి వుండాలి. కానీ రాలేదు. ఎందుకంటే సర్వే నిర్వహణలో కూడా లోపాలున్నాయి. గతంలో అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని ర్యాండమ్ శాంపుల్స్ తీసుకుని లాండ్‌లైన్‌కు ఫోన్ చేసి కంప్యూటరు ద్వారా ప్రశ్నావళిని చదువుతూ అభిప్రాయాలు సేకరించేవారు. ఈ రోజుల్లో జనాలు లాండ్‌లైన్‌లు పెట్టుకోవడం మానేశారు. పెట్టుకున్నా ఫోను ఎత్తడం మానేశారు. అందువలన సెల్‌ఫోన్ల నుంచే చేయాలి. కంప్యూటర్ ద్వారా సెల్‌ఫోన్‌లు చేయడం చట్టవిరుద్ధం. ఎవరైనా వ్యక్తి యిదే పని మీద వుండి ఫోన్లు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకని సులభమైన మార్గంగా ఇంటర్‌నెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించసాగారు. అలా ఒక తరహా ఓటర్లనే చేరగలిగారు. పైగా వారందరూ ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందినవారేమో కూడా! పాత పద్ధతుల్లో అయితే ఫలానా ఆదాయపరిమితిలో వున్న గ్రామీణ రైతు, యింతకంటె ఎక్కువ సంపాదిస్తున్న నగరమహిళ.. యిలా వివిధ వర్గాల నుంచి శాంపుల్స్ ఏరుకునేవారు. ఈ సారి గ్రామీణ ఓటర్లను పట్టించుకోకపోవడంతో సర్వే ఫలితాలు తప్పాయి. ''పాతాళభైరవి'' సినిమాను పంపిణీదారులకు ప్రివ్యూ చూపిస్తే వాళ్లు పెదవి విరిచారు. ఆ విషయం నిర్మాతలు చెపితే దర్శకుడు కెవి రెడ్డి గారికి నిర్మాతలపై కోపం వచ్చింది. 'నా ప్రేక్షకులు నిశానీగాళ్లు. వాళ్లకు నచ్చితే చాలు, మధ్యలో యీ మేధావుల అభిప్రాయాలు నాకు అనవసరం' అని. సినిమా విడుదలయ్యాక విజయదుందుభి మోగించింది. అలా మిడిల్‌క్లాస్ మోరల్స్ వున్న ఓటర్లు ట్రంప్‌ను ఎంత యీసడిస్తూ పారేసినా అతని ఓటు బ్యాంకు అతన్నే అంటిపెట్టుకుని వుంది.
వీళ్లిద్దరికి వచ్చిన ఓట్లే కాక వీళ్లతో పాటు నిలబడిన లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి గారీ జాన్సన్ (3.3% ఓట్లు పడ్డాయి), గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ (1% ఓట్లు పడ్డాయి) కూడా వున్నారు. వాళ్లు పట్టుకుపోయే ఓట్ల వలన ఎవరు దెబ్బ తింటారో సర్వేలు వూహించలేక పోయాయి. 5 రాష్ట్రాలలో ట్రంప్ గెలుపు మార్జిన్ వీళ్లిద్దరికీ వచ్చిన వచ్చిన మొత్తం ఓట్ల కంటె తక్కువ వుంది. వీళ్ల ఓట్లు హిల్లరీకి కలిపి చూస్తే మిచిగన్, విస్కాన్సిన్‌లలో ఫలితాలు తారుమారయ్యేవి. పెన్సిల్వేనియాలో అయితే జాన్సన్ బరిలో లేకపోతే హిల్లరీ నెగ్గేది. అప్పుడు హిల్లరీకి మొత్తం మీద 278 ఓట్లు వచ్చి వుండేవి. కానీ అలా లెక్క వేయలేం. జాన్సన్ గోదాలో లేకపోతే అతని సమర్థకులు ఇంట్లో కూర్చునేవారేమో. నిజానికి చాలాసార్లుగా డెమోక్రాట్స్‌ను గెలిపిస్తూ వచ్చినవారు యీ సారి హిల్లరీ రాజకీయ కుటిలత తేటతెల్లమై, విసుగు చెంది, యింట్లో కూర్చున్నారు. ఇతర అభ్యర్థులకు 2012లో 1.25% ఓట్లు పడ్డాయి. ఈ సారి మూడున్నర రెట్లు ఎక్కువ పడ్డాయి. ఇది సర్వేలు లెక్కలకి తీసుకోలేక పోయాయి. ట్రంప్ మహిళా వ్యతిరేకి అని విపరీతంగా ప్రచారం జరగడంతో అతనికి ఓటేద్దామనుకున్న మహిళలు ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేదు. ఎటూ తేల్చుకోలేదని చెప్పారు. మహిళలే కాదు, మగవారు కూడా తాము ట్రంప్‌కే ఓటేస్తామని ధైర్యంగా చెప్పలేదు. ఎందుకంటే అలా అయితే నువ్వు మైనారిటీ వ్యతిరేకి, శ్వేతజాతి అహంకారి అంటారేమోనని భయం. చేసేదేదో ఎవరికీ చెప్పకుండా చేద్దామనుకున్నారు. అక్టోబరు నెలాఖరు వరకు 11% మంది ఎటూ తేల్చుకోలేదని చెప్పడంలోని మర్మాన్ని సర్వే నిర్వాహకులు గ్రహించలేకపోయారు. అందువలన కూడా వాళ్ల అంచనాలు తప్పాయి.
వలస వచ్చినవారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ట్రంప్‌కు వాళ్లెవరూ ఓటెయ్యరు అనుకోవడం సర్వేకారులు చేసిన పెద్ద పొరపాటు. వలస వచ్చినవారిలో రెండు గ్రూపులున్నాయి. అక్రమంగా వచ్చినవారు కొందరుంటే, చాలాకాలంగా వుంటూ ఉద్యోగాలు, నివాసాలు ఏర్పరచుకున్నవారు కొందరు. అక్రమంగా వచ్చినవారిని ఎవరూ సమర్థించలేరు. వాళ్లు సరైన పత్రాలు లేకుండా దేశంలో వుంటూ ఏ ప్రత్యక్ష పన్నూ కట్టకుండా ప్రభుత్వం తన ప్రజలకు సమకూర్చే సౌకర్యాలన్నీ - రోడ్లు, విద్యుత్, యిత్యాదివి - అనుభవించేస్తున్నారు. గతంలో అక్రమంగా వచ్చి పత్రాలు సంపాదించుకున్నవారు కూడా తమ తర్వాత వచ్చే అక్రమదారులను ప్రోత్సహించరు. సినిమా టిక్కెట్ల క్యూలో నిలబడినప్పుడు చూడండి, నా దాకా టిక్కెట్టు వస్తే చాలు, నా తర్వాతవాళ్లకి రాకపోయినా ఫర్వాలేదు అనుకుంటాం. ఒకసారి వలస సక్రమమై పోయి, అమెరికన్ పౌరుడైపోయాక అతనూ అమెరికన్‌లాగానే ఆలోచిస్తాడు - వీళ్లందరినీ ఎందుకు రానివ్వాలి? అని. ఒబామా హయాంలో అక్రమ వలసదారులు 2008 నుంచి ఐదేళ్లలో వలసదారులు 40% మంది పెరిగితే, 24 లక్షల మందిని వెనక్కి పంపేశాట్ట. 2014లో అమెరికాలోని అక్రమ, సక్రమ వలదారుల సంఖ్య 16 లక్షలు. వీరికి 3 లక్షల మంది పిల్లలు పుట్టారట. వీళ్ల జనాభా యిలా పెరిగిపోతూ వుంటే పౌరులకు బాధగా వుండదా?
వీసాల నియంత్రణ విషయానికి వస్తే 21వ శతాబ్దం వచ్చాక ఐటీ వాళ్లు వెళ్లడం ఉధృతమైంది కానీ అంతకు మూడు దశాబ్దాల నుంచి విద్యావంతులైన, వ్యాపారస్తులైన మన భారతీయులు అక్కడకు వెళ్లి బాగా సంపాదించుకుని స్థిరపడ్డారు. పౌరసత్వం సంపాదించుకుని, ఆస్తులు కూడగట్టి, ఓహో అనుకునే స్థాయిలో వున్నారు. ఎచ్1బి వీసాలు తగ్గించడం వలన వాళ్లు నష్టపోయేది ఏమీ లేదు, యిబ్బందీ లేదు - కొత్తగా వెళదామనుకున్నవారికి తప్ప! మన వూరి నుంచి ఇంకా బోల్డు మంది యిక్కడకు వచ్చేసి, దండిగా సంపాదించేసుకుని, నాతో సమానస్థాయిని చేరుకోవాలి అని ఎవరూ అనుకోరు. ఒక టిపికల్ అమెరికన్ లాగానే వాళ్లూ 'వీళ్లందరూ ఊహూ వచ్చి పడాల్సిన అవసరం ఏముంది?' అని ఆలోచిస్తారు. గతంలో నేను చెప్పిన రైల్వే కంపార్ట్‌మెంటాలిటీ థియరీని కొందరు ఆమోదించలేదు. కానీ అది యిక్కడ వర్తిస్తుందని నా గట్టి నమ్మకం. ఆసియన్లు కూడా ట్రంప్‌కు బాగానే ఓటేశారని ఫలితాలు చెప్తున్నాయి. హిల్లరీ కుడిభుజమైన హ్యూమా అబెదిన్ పాకిస్తానీ కావడంతో ఇండియన్లు కొందరు హిల్లరీకి దూరంగా జరిగారనే వాదన కూడా నిజం కావచ్చు. హ్యూమా తండ్రి భారత ముస్లిం అని కొందరంటున్నారు కానీ అతను అవిభక్త భారతదేశంలోని ముస్లిము. అలా లెక్కేస్తే భుట్టో కూడా భారత ముస్లిం అవుతాడు. హిల్లరీ పాక్ పక్షపాతి అని ముందే తెలుసు. ట్రంప్ ముస్లిం వ్యతిరేకిగా కనబడ్డాడు కాబట్టి పాక్‌ను పక్కన పడేసి మనను చంకెక్కించుకుంటాడని కొందరు భావించారేమో కూడా తెలియదు.
హిల్లరీ ఓటమికి ముఖ్యమైన మరో కారణం - ఒబామా కేర్ ! ఒబామా హయాంలో పెట్టిన ఎఫోర్డబుల్ కేర్ యాక్ట్, 2010 ద్వారా పెట్టిన ఒబామాకేర్ ద్వారా ఉద్యోగం ద్వారా హెల్త్ ఇన్సూరెన్సు పొందలేని రెండు కోట్ల మందికి ఆరోగ్య బీమా కలిగిస్తుంది. అయితే దీని ప్రీమియం నానాటికీ పెరుగుతూ పోతూ వుందని ట్రంప్ ప్రచారం ప్రారంభించిన దగ్గర్నుంచి వాదిస్తున్నాడు. హిల్లరీ దీన్ని ప్రవేశ పెట్టడంలో తన పాత్ర వుందని చెప్పుకుంటూ, దీనివలన ఆఫ్రో-అమెరికన్, లాటినో పనివారికి ఎంతో మేలు కలుగుతోందని, వలన చాలామంది మైనారిటీలు లాభపడ్డారని చెపుతూ సమర్థిస్తూ వస్తోంది. రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రాలు కూడా కొంత భారాన్ని వహించాలని ప్రతిపాదించింది. ట్రంప్ దీన్ని తీసేసి, దీని స్థానంలో జాతీయ స్థాయిలో పోటీదార్లను ప్రవేశపెట్టి రేట్లు తగ్గించేట్లా చూస్తానంటున్నాడు. ఈ చర్చ సాగుతూండగానే 2017 సంవత్సరానికై బెంచ్‌మార్క్ ప్రీమియాన్ని 22% పెంచింది ఒబామా ప్రభుత్వం. దీని వలన ఆదాయ పరిమితి దాటడం చేత ప్రభుత్వ సబ్సిడీ పొందలేని 70 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. వీళ్లందరికీ ఒబామా కేర్ వలన లాభం కంటె నష్టమని తోచింది. స్కీము తీసేస్తానన్న ట్రంప్‌ను సమర్థించారు. (గెలిచాక ట్రంప్ తనను కలిసినప్పుడు ఒబామా యీ స్కీము కొనసాగించమని ట్రంప్‌ను కోరాడట. అందువలన సాంతం ఎత్తివేయకుండా మార్పులు చేసే ఉద్దేశంలో వున్నాడట ట్రంప్. అప్పటికే వున్న వ్యాధిని కవర్ చేయడం, పిల్లలకు 26 ఏళ్లు వచ్చేవరకు తలితండ్రుల పాలసీపై కవర్ కావడం అనేవి కొనసాగించవచ్చు) ప్రీమియం పెంపు హిల్లరీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని కూడా పాత్రికేయులు వూహించలేకపోవడం విడ్డూరం. ఇలా ఎన్నో విషయాలు ముందే వూహించలేకపోవడం అమెరికన్ మీడియా లోపం. అందుకే హిల్లరీతో బాటు సర్వేకారులు కూడా ఓడారని చెప్పాలి.
- ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2016)