ఎమ్బీయస్‌ : ఢిల్లీని పాలించేదెవరు?

అరవింద్‌ కేజ్రీవాల్‌ సోషల్‌ మీడియాలో హీరోగా వెలిగే రోజుల్లో అతని ప్రతి మాట వేదవాక్కులా భాసించేది నెటిజన్లకు. అతను కాంగ్రెసును తిట్టినంతకాలం బాగానే వుంది కానీ బిజెపిని, మరీ ముఖ్యంగా మోదీని తిట్టనారంభించేసరికి నెటిజన్లకు అతనిపై మోజు విరిగింది. సగటు రాజకీయాలను తూర్పారబడుతూ పైకి వచ్చే నాయకులందరిలాగానే అరవింద్‌ కూడా సగటు రాజకీయనాయకుడిగానే తేలేసరికి గ్లామర్‌ మరింత తగ్గింది. చాలాసార్లు అతను బరితెగించి ఆరోపణలు చేయడంతో ఆ మాటలకు విలువ తగ్గింది. ఢిల్లీని పాలించమని తనను ప్రజలు ఎన్నుకున్నా మోదీ పగబట్టి తనను పాలించనీయటం లేదని, ఎల్‌జి (లెఫ్టినెంట్‌ గవర్నరు) ద్వారా తన పాలనే ఢిల్లీపై రుద్దుతున్నాడని, తప్పులకు మాత్రం తనను బాధ్యుణ్ని చేస్తున్నాడని అతను చేస్తున్న ఆరోపణలను ఏ మేరకు నమ్మాలి? పెన్షన్‌ గొడవలో జవాను ఆత్మహత్య విషయంలో రాహుల్‌ తదితరులపై కంటె అరవింద్‌నేే ఢిల్లీ పోలీసులు  ఎక్కువగా హింసించారని గమనిస్తే ఢిల్లీ పోలీసులను ఎవరు శాసిస్తున్నారో ఒక అంచనాకు రావచ్చు.

'ఢిల్లీపై అధికారం ఎవరిది? - ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిథులతో ఏర్పడిన ప్రభుత్వానిదా? కేంద్రం నియమించే ఎల్‌జిదా?' అనే సమస్యపై ఢిల్లీ హైకోర్టుకి వెళితే జస్టిస్‌ జి.రోహిణి, జస్టిస్‌ జయంత్‌ నాథ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆగస్టు 4 న తీర్పు యిస్తూ ఎల్‌జియే ఎడ్మినిస్ట్రేటివ్‌ హెడ్‌ అని తీర్పు యిచ్చింది. మరి ముఖ్యమంత్రి ఎందుకయ్యా అంటే స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారం మాత్రం అతనిదేట. తక్కిన విషయాల్లో ఎల్‌జీయే బాస్‌ట. ఈ తీర్పు వచ్చాక ఎల్‌జి యిక చెలరేగిపోయాడు. తన ఆమోదం లేకుండా అప్పటిదాకా ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లన్నిటినీ మూడు రోజుల్లోగా తన ఆఫీసుకి తెప్పించుకున్నాడు. అలా చేరిన 400 ఫైళ్లు ఎల్‌జిగారి ఆఫీసులో పడి వున్నాయి. పంపిన ఫైళ్లు వెనక్కి పంపమని మంత్రులు రిమైండర్లు పంపినా ఎల్‌జి ఆఫీసు పలకటం లేదు. ఎక్సయిజ్‌ శాఖ వసూళ్లు దెబ్బ తిన్నాయి. 

వాటి సంగతి చూడడానికి టైము లేదు కానీ పంపని శాఖలు పని పడదామనుకున్నాడు. ఆగస్టు 29న మోస్ట్‌ అర్జంట్‌ రిమైండర్‌ పంపిస్తూ 'ఇప్పటికైనా ఫైళ్లు పంపకపోతే ఆయా శాఖాధిపతులను బాధ్యులను చేయడం జరుగుతుంది' అని తెలియపరిచాడు. అదే రోజు ఐయేయస్‌, యితర ఆలిండియా సర్వీసెస్‌ ఉద్యోగుల పోస్టింగు, బదిలీ వ్యవహారాలన్నిటిపై ఎల్‌జిదే అంతిమ నిర్ణయం అని ఒక ఆదేశం విడుదల చేశాడు. మరి అంతకంటె తక్కువ స్థాయి ఉద్యోగులంటారా, వారి సంగతి చీఫ్‌ సెక్రటరీ లేదా సర్వీసెస్‌ సెక్రటరీ చూస్తారు. మరి ముఖ్యమంత్రి ఏం చేయాలిట? ఎల్‌జి కోరితే, తన అభిప్రాయం ఆయనకు చెప్పవచ్చు కానీ అది వినవలసిన అగత్యం ఎల్‌జికి లేదు. ఇది కూడా ఆ ఆదేశంలో స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రికే పని లేనప్పుడు యిక మంత్రుల కేముంటుంది? వాళ్ల మాట చెల్లదని తెలిశాక అధికారులు వారికి రిపోర్టు చేయడం మానేశారు. ఎల్‌జిని కలిసి ఆదేశాలు తీసుకుంటున్నారు. ఆయన యిలా చెప్పారు, మేం యిలా చేస్తున్నాం అని కూడా మంత్రులకు చెప్పడం మానేశారు. అందువలన సెక్రటేరియట్‌ బావురుమంటోంది. వాళ్లను కోర్టులు బిజీగా వుంచుతున్నాయి. ఢిల్లీ పాలనలో లోపం కనబడ్డప్పుడల్లా వాళ్లను పిలిచి తిడుతున్నాయి. ఎల్‌జి ఆగస్టు 30 న త్రిసభ్య కమిటీ ఒకటి వేసి తను తెప్పించుకున్న ఫైళ్లలో ఎల్‌జిని అడగకుండా చేసిన నిర్ణయాలేమిటో కనిపెట్టి సవరించడంతో బాటు, ఆ నిర్ణయాలు తీసుకున్నవారిపై ఎలాటి చర్యలు తీసుకోవాలో తేల్చమని కోరాడు. 

ఆప్‌ ప్రభుత్వానికి పేరు తెచ్చిన ప్రతి ప్రాజెక్టుపై ఎల్‌జి కన్ను పడింది. వాటిని చెడగొట్టడానికే కంకణం కట్టుకున్నాడు. ఆప్‌కు బాగా పేరు వచ్చిన పథకం - మొహల్లా క్లినిక్‌. మన ప్రైమరీ హెల్త్‌ సెంటర్లన్నీ పాడుపెట్టి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పోరేట్లకు నిధులు కట్టబెడుతున్నారు కానీ ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల పేర వాటిని బలోపేతం చేస్తున్నారు. ఆ పథకాన్ని పర్యవేక్షించే డా|| తరుణ్‌ సీమ్‌ అనే హెల్త్‌ సర్వీసెస్‌ డైరక్టరు జనరల్‌ను ఎల్‌జి మహాశయుడు హఠాత్తుగా తీసిపారేశాడు. ఆప్‌కు పేరు తెచ్చిన మరో పథకం విద్యుత్‌ చార్జీలను నియంత్రించడం. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా కృష్ణా సైనీని నియమించి అతని ద్వారా నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేట్లు చూడడానికి, విద్యుత్‌ వినియోగదారుల హక్కులు కాపాడడానికి ఆప్‌ ప్రభుత్వం మూడు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను నియమాలు పాటించాలని హెచ్చరించింది. వాటిలో రెండిటిలో అనిల్‌ అంబానీ భాగస్వామ్యం వుండడంతో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎల్‌జి ద్వారా సైనీ నియామకాన్ని రద్దు చేయించింది. రద్దు నిర్ణయంపై ఆప్‌ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్లింది. ఇవే కాదు, ఢిల్లీ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఎమ్‌డి, పిడబ్ల్యుడి సెక్రటరీ, ఇండస్ట్రీ సెక్రటరీ వంటి అనేక ముఖ్యమైన పదవులలో ఆప్‌ నియమించిన అధికారులందరినీ ఎల్‌జి మార్చిపారేస్తున్నారు. Readmore!

ఎల్‌జి అండ చూసుకుని అతను నియమించిన అధికారులు చెలరేగిపోతున్నారు. యాంటీ కరప్షన్‌ బ్రాంచ్‌ (ఎసిబి)కు అధినేతగా వేసిన ఎంకె మీనా వారిలో ఒకరు. మీనా దర్శకత్వంలో ఎసిబి రూ.400 కోట్ల వాటర్‌ ట్యాంకర్‌ స్కాములో షీలా దీక్షిత్‌ను తప్పుపడుతూ ఒక నివేదిక సమర్పించింది. ఆ రిపోర్టును ఆప్‌ ప్రభుత్వం 11 నెలలు ఆలస్యంగా కేంద్రానికి పంపింది. ఆలస్యానికి కారణమేమిటో తెలియరాలేదు కానీ అదో పెద్ద నేరంగా తోచింది బిజెపి నాయకులకు. ఢిల్లీ బిజెపి నాయకుడు వ్రజేంద్ర గుప్తా ఎల్‌జికి ఒక పిటిషన్‌ పెట్టాడు - నివేదికను తొక్కిపెట్టినందుకు అరవింద్‌పై కూడా చర్య తీసుకోవాలని. ఆ మాత్రం సూచన చాలు, మీనాకు. వెంటనే షీలా దీక్షిత్‌తో బాటు అరవింద్‌ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేశాడు.  షీలా దీక్షిత్‌ ప్రభుత్వంలో మంత్రి కాదు కదా అరవింద్‌ పేరు ఎందుకు అంటే నివేదిక పై త్వరగా చర్య తీసుకోనందుకట! ఎన్నో కేసుల్లో ప్రభుత్వాలు నివేదికలే బయటపెట్టవు. చర్యలు కూడా ఆలస్యంగా తీసుకుంటాయి. ఆ కారణానికి ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఎక్కించేస్తే ముఖ్యమంత్రుల పేర్లే కాదు, ప్రధానుల పేర్లూ కనబడాలి. ఏది ఏమైనా అరవింద్‌ను కేంద్రం ప్రత్యేక దృష్టితో చూస్తూ ఎల్‌జి ద్వారా అతన్ని యిక్కట్లపాలు చేస్తోందన్నది స్పష్టంగా కనబడుతోంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

mbsprasad@gmail.com

Show comments