సార్వత్రిక ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా- 44 శాతం ఓట్లు తెచ్చుకున్న, రాష్ట్రం నలుచెరగులా అంతో ఇంతో 'స్థిరమైన' ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ... ఆ తర్వాతి ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుంది! తమకు అధికారానికి మధ్య అడ్డుగోడగా మిగిలిపోయిన అత్యల్పశాతం వ్యత్యాసాన్ని పూరిస్తే చాలుననే ఉద్దేశంతో పావులు కదుపు తుంది. ప్రజల మన్నన చూరగొనడానికి ప్రయత్నాలు చేస్తుంది.
అయితే 2014లో అధికారం దక్కించుకోలేక పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అంతకంటె పెద్ద మార్గాన్నే అనుసరిస్తున్నారు. 'కింగ్ మేకర్' రాజకీయ వ్యూహకర్తగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయిలో అసమాన ఖ్యాతి ఉన్న ప్రశాంత్ కిశోర్ సేవలను ఆయన వినియోగించుకోవడానికి నిర్ణయించారు. ఈ మేరకు జగన్మోహనరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ముఖ్యనాయకులతో ఇప్పటికే ఒక సమావేశం కూడా అయింది.
ఇలాంటి సందర్భంలో... వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో జగన్ దోస్తీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు బలం అవుతుందా? పార్టీలో ఆ మేరకు సాగుతున్న పలువురి అంచనాలు నిజ మేనా? ఇలాంటి సాంకేతిక, ఆధునిక వ్యూహాలన్నీ మన తెలుగునాట పనిచేయవని పెదవి విరిచేవారి సందేహాల్లో వాస్తవమెంత?... ఇలా అన్ని కోణాల్లోంచి సమగ్రంగా విశ్లేషించడానికి గ్రేట్‌ఆంధ్ర చేస్తున్న ప్రయత్నం ఇది.
ఎవరీ ప్రశాంత్ కిశోర్?
ప్రశాంత్ కిశోర్ అంటే రాజకీయ వ్యూహకర్త మరియు విధానాలరూపకర్తగా ప్రసిద్ధులు. ఈ నలభై ఏళ్ల యువకుడు తన ప్రజారోగ్య ఉద్యమకారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ రకంగా ఐక్యరాజ్యసమితిని ఆకర్షించి వారితో కలిసి ఎనిమిదేళ్లపాటూ పనిచేశాడు. ఆ తర్వాతే భారత రాజకీయాల మీదకి దృష్టిపెట్టాడు. తొలినాళ్లలో రాహుల్ గాంధీతో కలిసి పనిచేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
తిరిగి ఐక్యరాజ్య సమితికి వెళ్లిపోయిన ప్రశాంత్ కిశోర్ చతురత ఆ తర్వాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి వచ్చింది. సామాజిక రంగంలో విధానాల సలహాదారు డిగా మోడీ ఆయనను నియమించుకున్నారు. క్రమంగా మోడీకి రాజకీయ వ్యూహనిపుణుడిగా ప్రశాంత్ కిశోర్ సేవలు పెరిగాయి. 2012 గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ- దళం తిరుగులేని విజయాన్ని నమోదు చేయడం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ప్రతిభ కూడా ఉన్నదని అంటుంటారు. అనంతరం 2015లో ప్రశాంత్ బృందం బీహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌కు అనుకూలంగా పని చేసింది. అసలే జన్మతః బీహారీ అయిన ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ముందు మోడీ ప్రభంజనం బీహార్ రాష్ట్రంలో ప్రభావం చూపించలేకపోయింది. భాజపా పరాజయం పాలైంది.
ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ యూపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ విజయం పెద్దగా ఆయన ఖాతాలోకి రాలేదు. అయితే యూపీ పరాజయాన్ని మాత్రం ప్రశాంత్‌కు అంటగట్టడానికి అక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. కానీ ప్రశాంత్ సూచించిన చాలా విషయాలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోలేదని, అందుచేతనే ఆశాజనక స్థాయిలోనూ విజయాలు నమోదు చేయలేకపోయిందని ఒక వాదన కూడా ఉంది.
ఏది ఏమైనప్పటికీ.. అంతర్జాతీయ సంస్థలో పనిచేసిన గొప్ప అనుభవం, క్షేత్ర స్థాయిలో జనం నాడి తెలుసుకోగల నైపుణ్యం, అపారమైన రాజకీయ వ్యూహ చతురత... ప్రముఖుల ప్రభుత్వాలను నిలబెట్టిన చాతుర్యం అన్నీ కలగలిసిన సలహాదారుగా ప్రశాంత్ కిశోర్‌కు పేరుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా వినియోగించుకుంటున్నారు. రాబోయే రెండేళ్లపాటూ జగన్- ప్రశాంత్ కిశోర్‌ల దోస్తీ కొనసాగుతుంది.
ప్రశాంత్ మాటలను బట్టి గమనిస్తే ఓట్ల శాతంలో అతి స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వైఎస్ జగన్‌ను ఈసారి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టాలనే దృఢనిశ్చయంతో ఆయన ఉన్నట్లుగా అర్థమవుతుంది!
ఎప్పటిలాగే డివైడ్ టాక్!
ఒక కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సర్వజనామోదం ఉంటుందనుకోవడం భ్రమ. అలాగే ప్రశాంత్ కిశోర్‌తో దోస్తీ విషయంలో కూడా డివైడ్ టాక్ ఉంది. గెలిచే పార్టీలతో జట్టు కట్టినప్పుడే ఆయన ప్రతిభ బయట పడిందని, నిజంగా అంతటి వ్యూహ నిపుణుడే అయితే గనుక.. యూపీలో కాంగ్రెస్‌కు అంత దారుణ పరాభవం ఎందుకు వస్తుందని వాదించే వారున్నారు. సహజంగానే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రత్యర్థి పార్టీలు దెప్పి పొడుస్తుంటాయి. అయితే సొంత పార్టీలో కూడా భిన్నా భిప్రాయాలు ఉండడం విశేషం.
ఇలాంటి సలహాదారుల సూచనలు, వారు చెప్పే ఆధునిక సాంకేతిక విధానాలు.. మన సాంప్రదాయ ఓటర్ల ముందు పనిచేస్తాయా? అని సందేహాలు వెలిబుచ్చే వారు కూడా ఉన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త వచ్చి 'పంట మార్పిడి గురించి భూమి సారాన్ని బంటి పంటల రకాలను సాగుచేయడం గురించి' సలహాలు చెబితే.. 'మా తాతల కాలం నుంచి సేద్యం చేస్తన్నాం.. నువ్వు చెప్పేదేంటి' అంటూ ఈసడించే సగటు రైతుల్లాగానే రాజకీయాల్లో కూడా కొత్తపోకడలను ఆహ్వానించలేని నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనూ తప్పకుండా ఉంటారు.
అలాంటి వారికి ప్రశాంత్ కిశోర్ సలహాదారు కావడం ఇచ్చగించక పోవచ్చు. సాంప్రదాయ రాజకీయాల్లో ఓట్లురాబట్టే మార్గాలు, విజయం సాధించే మార్గాలు అనేకం ఉంటాయని.. వాటినే నమ్ముకోవాలని వారు అనుకుంటూ ఉంటారు. అయితే సాంప్రదాయ ఎన్నికల తీరును పరిశీలిస్తే... వైసీపీకి ఉండే సాంప్రదాయ ఓటు బ్యాంకు ఎప్పటికీ అలాగే స్థిరంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది 44 శాతం దాకా ఉన్నదని గత ఎన్నికలు చాటి చెప్పాయి.
అధికారాన్ని దక్కించుకోవడానికి కొద్ది మేర ఓట్ల శాతాన్ని పెంచుకోవడమూ... అందుకు తగిన రీతిలో తటస్థ ఓటర్లను తమ వైపు మరల్చుకోగల కొన్ని నవీన విధానాల్ని అనుసరించడమూ ప్రశాంత్ కిశోర్ వంటి వారి సూచనల ద్వారానే సాధ్యమవుతుందని నమ్మే వారు కూడా పార్టీలో పుష్కలంగా ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు ప్రశాంత్ మీద ఆధారపడి వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు రూపుదిద్దుకోబోతున్నాయి.
జగన్‌కు ఇలాంటి వారే కరెక్టా?
నాయకుల్లో సాధారణంగా రకరకాల వ్యక్తులుంటారు. వారి వారి అనుభవం, రాజకీయ పరిణతిని బట్టి ఎన్నికలకు సిద్ధం కావడంలో రకరకాల వ్యూహాలను వారు అనుసరిస్తుంటారు. సాధారణంగా అపారమైన అనుభవం, వ్యూహచాతుర్యం, అసమానమైన రీతిలో ప్రత్యర్థులను చిత్తు చేయగల సొంత తెలివితేటలు ఉన్నవారు ఒక రకం. తన పార్టీలో ఎవరి నుంచి, ఎంత కిందిస్థాయి వారి నుంచి ఎలాంటి అభిప్రాయం, సలహా వచ్చినా సరే.. శ్రద్ధగా దాన్ని ఆలకించి.. అందులోని మంచి చెడులను బేరీజు వేసి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వారు ఇంకోరకం.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి పోకడలు కాస్త భిన్నంగా ఉంటాయని పార్టీ వారు అంటుంటారు. ఆయన ఎవరు ఏం చెప్పినా, దాన్ని పరిగణనలోకి తీసుకోరని, ఎవ్వరి మాటకూ పెద్దగా విలువ ఇవ్వరని అంటూ ఉంటారు. ఇందులో కిట్టని వారి ప్రచారం కూడా కొంత ఉండవచ్చు. అయితే ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడు అయినా సరే.. నిజంగా విలువైన సూచన వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉండడం జరగదు.
జగన్‌కు అలాంటి సలహాలు తారసపడి ఉండకపోవచ్చు. కానీ జగన్ తరహాలో... ఆధునిక సరళిలో రాజకీయాలను నడపాలని అనుకుంటున్న వారికి ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తల దోస్తీ బాగానే పనిచేస్తుంది. ఇలా కొత్తగా ఆలోచించగల వారి సలహాలను ఆయన బాగానే పాటించవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది.
పైగా శంఖంలో పోస్తేనే తీర్థం అన్న సామెత ఉండనే ఉంది. సాధారణ వ్యూహాలు, సలహాలే అయినా ప్రశాంత్ నోటమ్మట వస్తే అవి ఆచరణశీలంగా, అనుసరణయోగ్యం గా జగన్ భావించడానికి అవకాశం ఉండొచ్చు. ఏది ఏమైనా కావొచ్చుగానీ.. ఎవరో ఒకరి వ్యూహాలు పనిచేసి పార్టీకి మేలు జరిగితే చాలని నాయకులు అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి అంతా శుభమే
ప్రశాంత్ కిశోర్‌తో జగన్ పార్టీ నాయకులతో ఒక బృహత్ సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ ఆయన గురించి తెలిసినప్పటికీ.. తాను స్వయంగా పరిచయం చేసి.. ఆయన సేవలను పార్టీకి స్వీకరించబోతున్న విషయాన్ని బయటపెట్టారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులకు ఉండే చాలా సందేహాల విషయంలో ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. సలహాదారు అంటే తానేమీ పార్టీ మీద కర్రపెత్తనం చేయడానికి రాలేదని ఆయన సూటిగా చెప్పేశారు.
అలాగే ఇప్పటికే సర్వేలు చేసి... అభ్యర్థుల్ని మార్చడానికి తాము సూచనలు చేశామన్న ప్రచారం అబద్దం అని చెప్పారు. అదే సమయంలో... ప్రతి నియోజకవర్గంలోనూ తమ ప్రతినిధి ఒకరు ఉండి ఎప్పటికప్పుడు.. అక్కడ మారుతున్న పరిస్థితులపై నివేదికలు ఇస్తుంటారని.. అన్యాపదేశంగా హెచ్చరిక కూడా చేశారు. మొత్తానికి ప్రశాంత్ కిశోర్‌తో తొలిభేటీ, సరికొత్త వ్యూహాలకు శ్రీకారంగా శుభప్రదంగానే మొదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర వంటి ఆలోచనను కూడా ప్రశాంత్ జగన్‌కు ఇప్పటికే ప్రతిపాదించినట్లుగా ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా అనేక కొత్త వ్యూహాలమీద కసరత్తు కూడా జరుగుతోంది.
'మంత్ర' పనిచేస్తుందా?
అందరూ సక్సెస్ వెంట పరుగెడుతూ ఉంటారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇది సర్వసాధారణం. అయితే వాస్తవమైన ప్రతిభను గుర్తించగల నైపుణ్యం లేనివారే సక్సెస్ సాధించిన వారి వెంట గుడ్డిగా పరుగెడుతుంటారు. ఫెయిల్యూర్స్ తగిలిన వారితోకూడా జట్టు కట్టాలంటే, తొలుత ఇవతలి వారికి నైపుణ్యాలను గుర్తించే తెలివితేటలు ఉండాలి.
అలాగే... తన మీద తనకు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. 2014లో మోడీకి విజయాన్ని అందించిన తర్వాత, 2015లో బీహార్లో నితీశ్‌ను మళ్లీ గద్దె ఎక్కించిన తర్వాత అనేక మంది నాయకులు ప్రశాంత్ కోసం ఎగబడడంలో ఆశ్చర్యం ఏమీలేదు! అయితే యూపీ ఎన్నికల కాంగ్రెస్ పరాజయం తర్వాత ప్రశాంత్‌ను ఆశ్రయించాలంటే సాధారణ నాయకులు పునరాలోచనలో పడతారు.
మనం పైన చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం.. సక్సెస్‌ను బట్టి కాకుండా, తాను గుర్తించగల ప్రతిభను నమ్మేవారుంటేనే ఫెయిల్యూర్ తర్వాత కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్నప్రయత్నం అదే! ప్రశాంత్ కిశోర్‌ను తన ప్రచార సారథిగా ఆయన నియమించుకుంటున్నారు. ఈ దోస్తీ ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలియడానికి మరో రెండేళ్లు అక్కర్లేదు. ఈలోగానే.. దానికి సంబంధించిన సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి.
-కపిలముని