నిరుద్యోగి అయినా దర్పానికి కొదువలేదు...!

నిరుద్యోగులు తమకు ఉద్యోగం కావాలంటే కావల్సిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. తెలిసినవారెవరైనా ఉంటే వారిని బతిమాలి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. దరఖాస్తు చేసుకున్నా, తెలిసినవారిని బతిమాలుకున్నా వినయవిధేయతలతో అడగాలి తప్ప 'నాకు ఉద్యోగం ఇవ్వడం నీ బాధ్యత' అనరు కదా. అలా అంటే పొగరనుకుంటారు. ఏమిటీ దర్పమని పక్కకు పొమ్మంటారు. కాని రాజకీయ నాయకుల తరీఖా వేరుగా ఉంటుంది.'చింత చచ్చినా పులుపు చావదు' అన్నట్లుగా వారు నిరుద్యోగులైనా (ఏ పార్టీలోనూ లేకపోవడం) దర్పం తగ్గదు. ఇగో చావదు.  

ఏవో కారణాల వల్ల ఉన్న పార్టీ నుంచి బయటకు వస్తే వెంటనే మరో పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాల రుచి మరిగినవారు ఖాళీగా ఉండలేరు కదా. నిరుద్యోగి అయిన రాజకీయ  నాయకుడికి లేదా నాయకురాలికి ఉండే 'పొలిటికల్‌ స్టామినా' బట్టి ఇతర పార్టీలవారు ఆహ్వానిస్తారు. లేదా వీరే ఎవరినో పట్టుకొని ఏదో ఒక పార్టీలో చేరుతారు. ఒకనాటి అందాల నటి జయప్రదకు ప్రస్తుతం అర్జంటుగా ఉద్యోగం కావాలి. ఎందుకు? ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో ఆమెకు, రాజకీయ గురువు అమర్‌ సింగ్‌కూ స్థానం లేకుండాపోయింది కాబట్టి. వీరిద్దరికీ ఇలా కావడం ఇది రెండోసారి. మొదటిసారి ఎస్‌పీ నుంచి బహిష్కరణకు గురైనప్పుడు తన గురువు అమర్‌సింగ్‌ వెంటనే నడిచిన జయప్రద ఈసారి తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు. ఆయనతోనే ఉంటే భవిష్యత్తు ఉండదనుకుంటున్నారేమో.

 'నేను ఏ పార్టీలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ ఆమె బహిరంగంగా చెప్పడాన్నిబట్టి చూస్తుంటే ఉద్యోగం తక్షణం అవసరమనిపిస్తోంది. పార్టీలకు ఆమె అవసరం ఉందో లేదో చెప్పలేంగాని పార్టీలతో ఆమెకు అవసరముంది. అయినప్పటికీ దర్పం ఒలకబోస్తున్నారు ఈ మాజీ హీరోయిన్‌. ఏ పార్టీలోనైనా సిద్ధంగా ఉన్నానని ఓపన్‌గా ఆఫర్‌  ఇచ్చినప్పటికీ 'నన్ను గౌరవంగా ఆహ్వానించాలి' అని మెలిక పెట్టింది. అంటే తనను చేర్చుకునే పార్టీ తనకు సముచితమైన స్థానం ఇవ్వాలని, తగిన పదవి ఇవ్వాలని పరోక్షంగా చెబుతున్నారన్నమాట. ఆమె ఆఫర్‌కు ఏ పార్టీ ముందుకు వస్తుందో చూడాలి. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు కాబట్టి బీజేపీ వైపు చూపు సారించారనే భావన కలుగుతోంది. తప్పనిసరిగా బీజేపీలోనే చేరాలనుకుంటున్నప్పడు ఏ పార్టీలోనైనా చేరతానని ఎందుకన్నారు? ఎవరో నాయకులను పట్టుకొని ప్రయత్నాలు చేసుకునేవారు కదా. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లయితే అందులో చేరేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తారేమో...! 2019 ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు వెళ్లాలనే ఆలోచన ఉండొచ్చు. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం పుట్టకముందు  అఖిలేష్‌ యాదవ్‌ సర్కారులో  జయప్రదకు కేబినెట్‌ హోదా ఉన్న పదవి దక్కింది. ఒకప్పుడు ఇదే పార్టీ నుంచి తన రాజకీయ గురువు అమర్‌సింగ్‌తోపాటు బహిష్కరణకు గురైన  జయప్రద మళ్లీ అదే పార్టీలో గుర్తింపు పొందారు.

యూపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.  జయప్రదకు ఈ పదవి రావడానికి వెనుక గురువు అమర్‌సింగ్‌ ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయప్రద తనకు సన్నిహితురాలని, పార్టీలో ఆమెకు అవమానం జరగుతోందని, దాన్ని సరిదిద్దకపోతే (పదవి ఇవ్వకపోతే అని అర్థం) తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని ఆయన హెచ్చరించారట...! దీంతో అఖిలేష్‌ సర్కారు కేబినెట్‌ హోదా ఉన్న పదవి ఇచ్చి అమర్‌సింగ్‌ను సంతృప్తిపరిచింది. కాని ఇది ఎంతో కాలం నిలవలేదు. చివరకు పార్టీలోనూ స్థానం లేకుండాపోయింది. గతంలో అమర్‌సింగ్‌కు ఎస్‌పీ అధ్యక్షుడు ములాయంసింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనతో పాటు జయప్రదను కూడా 2010లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తరువాత అమర్‌సింగ్‌ సొంత కుంపటి పెట్టుకున్నా అది వెలగలేదు.

తరువాత ఆర్‌ఎల్‌డీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినా జయప్రదకు పరాజయం తప్పలేదు.  మళ్లీ ఏదోవిధంగా రాజీపడి సొంత పార్టీకి చేరుకున్నా బయటకు వెళ్లక తప్పలేదు. ఒకదశలో జయప్రద తెలుగు రాజకీయాల్లోకి (ఉమ్మడి రాష్ట్రంలో) వస్తారనే సంకేతాలు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈవిధమైన వార్తలొచ్చాయి. తనకు సొంత ఊరైన రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుందని కూడా ఒకసారి ఆమె చెప్పారు. మరోసారి టీడీపీలో చేరతారనే పుకార్లు వచ్చాయి. ఆమె టీడీపీ పట్ల సానుకూలంగా మాట్లాడటంతో మళ్లీ ఆ పార్టీలో చేరతారని అనుకున్నారు. కారణాలేవైనా ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలకే అంకితమయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ (రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా) తెలుగు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఇక ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు.

Show comments