మహారాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ టూగా వున్న 63 ఏళ్ల ఏకనాథ్ ఖాడ్సే వ్యవహారం బిజెపికి తలనొప్పిగా తయారైంది. ప్రస్తుతానికి అతని చేత రాజీనామా చేయించి వూరడిల్లారు కానీ యీ శాంతి తాత్కాలికమే అని వాళ్లకూ తెలుసు. తన సీనియారిటీని, ప్రతిపక్షంలో వుండగా కాంగ్రెసు, ఎన్‌సిపిలకు నిద్ర పట్టకుండా చేసిన తన పోరాటపటిమను పక్కకు పెట్టి తన కంటె వయసులో, అనుభవంలో, రాజకీయ పోరాటంలో ఎంతో చిన్నవాడు, అసెంబ్లీలో వెనకబెంచీల్లో వుంటూ వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆరెస్సెస్ పలుకుబడితో ముఖ్యమంత్రిగా చేసినప్పుడే అతను 'బిజెపి బ్రాహ్మణుల పార్టీ, అందుకే బిసినైన నన్ను ముఖ్యమంత్రిగా చేయలేదు' అని అన్నాడు. 'మహారాష్ట్రకు బ్రాహ్మణేతరుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలనుకుంటున్నారు' అని ప్రకటన కూడా చేశాడు. బిజెపికి చెందిన కేంద్రమంత్రులపై, రాష్ట్రమంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తూన్నా వారెవరికీ పడని శిక్ష తనకు పడినందుకు అతను మండిపడుతున్నాడు. 40 ఏళ్లగా పార్టీని నమ్ముకుని వున్నందుకు యిదా ఫలితం అని వాపోతున్నాడు. 2011 జూన్‌లో బిజెపి అగ్రనేత గోపీనాథ్ ముండే తన సహచరులను సమావేశ పరచి ''పార్టీ అధినాయకత్వం నన్ను పట్టించుకోవటం లేదు. కాంగ్రెసులోకి ఫిరాయిద్దా మనుకుంటున్నాను. మీరూ నాతో వస్తే మంచిది.'' అని చెప్పాడు. తక్కినవారందరూ ఏం మాట్లాడాలో తెలియక తికమకపడుతూ వుంటే అప్పట్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన ఏక్‌నాథ్ గోపీనాథ్‌పై విరుచుకు పడ్డాడు - ''నేనే కాదు, మాలో ఎవ్వరూ నీతో రారు, నిన్ను సమర్థించరు.'' అని. గోపీనాథ్ ఏమీ చేయలేక పార్టీలోనే వుండిపోయాడు. అంత విశ్వాసపాత్రంగా వున్న నన్ను యీ రోజు కుట్ర చేసి పంపించేస్తారా అంటూ ఏక్‌నాథ్ కోపంతో రగులుతున్నాడు.
ఏక్‌నాథ్ కున్న ప్రజాబలం తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో అతను మళ్లీ పగ్గాలు పట్టవచ్చనే అంచనాతో అతని పట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు. రాజీనామా ప్రకటించడానికి ప్రెస్ కాన్ఫరెన్సు పెడితే దానికి అతనితో బాటు సీనియర్ మంత్రులైన సుధీర్ ముంగటివార్, వినోద్ తావడే హాజరయ్యారు. ఆ తర్వాత కాస్సేపటికి అతని యింటికి పంకజా ముండే, గిరీశ్ మహాజన్ తప్ప తక్కిన మంత్రులందరూ వచ్చి పలకరించారు... రాష్ట్ర అధ్యక్షుడు కూడా. రాజీనామా చేసిన మూడు గంటల్లో ''నా అనుచరులు నా రాజీనామాను ఆమోదించడం లేదు. నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తామంటున్నారు. అల్లర్లు జరుగుతున్నాయన్న భయంతో నేనే వారించాను.'' అని ఏక్‌నాథ్ చెప్పుకున్నాడు. పార్టీ తమ నాయకుడి పట్ల వ్యవహరించిన తీరుకి నిరసన తెలుపుతూ మర్నాడు అతని సొంత జిల్లా జలగాంవ్‌లోని కార్పోరేషన్‌లో 14 మంది కార్పోరేటర్లు నిరసన తెలుపుతూ రాజీనామా తెలిపారు. నలుగురు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు విదేయులుగా వుంటామని ప్రకటించుకున్నారు.
'అవినీతి పట్ల మాది జీరో టోలరెన్స్' అని చెప్పుకునే బిజెపి పార్టీలోని నాయకులు ఆరోపణలపై రాజీనామా చేసిన నాయకుడి యింటి చుట్టూ యిలా ప్రదక్షిణాలు చేయడం వింతగా తోచవచ్చు. కానీ ఏక్‌నాథ్ తడాఖా అలాటిది. జలగాంవ్, ధూలే, నాసిక్, బుల్‌ధానా జిల్లాలలో అధిక సంఖ్యలో వున్న లేవా పాటిల్ అనే ఒబిసి కులానికి చెందిన ఏక్‌నాథ్ రైతు కుటుంబంలో పుట్టాడు. జలగాంవ్ జిల్లా అతని కార్యక్షేత్రం. అక్కణ్నుంచే 1989లో బిజెపి టిక్కెట్టుపై ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండేళ్లు పోయాక కాంగ్రెసు నాయకులు, పెద్ద వ్యాపారస్తులు స్థానిక మహిళలను సెక్సుపరంగా ఎలా దోపిడీ చేస్తున్నారో బయటపెట్టి మీడియాలో సెన్సేషన్ సృష్టించాడు. రెవెన్యూ, వ్యవసాయం, ఎక్సయిజ్, డైరీ డెవలప్‌మెంట్ వంటి 10 శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం అతనికి వుంది. దేవేంద్ర అధికారులపై ఎక్కువగా ఆధారపడతాడు కానీ ఏక్‌నాథ్‌కు తన సొంత తెలివితేటలమీదే నమ్మకం ఎక్కువ. రెవెన్యూ సెక్రటరీ మనుకుమార్ శ్రీవాస్తవతో పేచీ పెట్టుకోవడం దేవేంద్రకు నచ్చలేదు. అందరు బిజెపి నాయకుల లాగానే యితనూ ఇందిరా గాంధీ వంశపారంపర్యపు రాజకీయాలను నిరసించినవాడే. కానీ తన కోడలు రక్షను 2014లో ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్నాడు. 2014 అక్టోబరులో తను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్నెల్లలోనే భార్య మందాకినిని స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్‌కు చైర్మన్‌ను చేశాడు. కూతురు రోహిణిని జలగాంవ్ జిల్లా బ్యాంకుకి, ముక్‌తాయీ కోఆపరేటివ్ సుగర్ మిల్లుకి చైర్మన్ చేశాడు.
మంత్రిగా ఏక్‌నాథ్‌పై ఆరోపణలు వస్తూనే వున్నా దేవేంద్ర వాటి నుంచి యితన్ని రక్షించటం లేదు. బిజెపి ఎంపీ హేమమాలినికి అతి చవకగా వెర్సోవాలో భూమి ఎలాట్ చేయడాన్ని అందరూ విమర్శించారు. 'హేమమాలిని ఒక ట్రస్టు నడుపుతోందని, ట్రస్టులకు ప్రభుత్వభూమిని నామమాత్రపు ధరలకు కట్టబెట్టే పాలసీ వుందని' ఏక్‌నాథ్ వాదించాడు. కానీ దేవేంద్ర ఆ పాలసీని పునఃపరిశీలించమని ఆదేశించాడు. ఆ రకమైన భూమి కేటాయింపు చేయిస్తానంటూ ఏక్‌నాథ్ సహాయకుడు గజానన్ పాటిల్ ఒకరి దగ్గర రూ. 30 కోట్ల లంచం అడుగుతూండగా పట్టుబడి అరెస్టయ్యాడు. అతనికి ఆ ఆఫర్ యిచ్చినవాడు రమేశ్ జాదవ్ అనే సామాజిక కార్యకర్త. అతన్ని యిరికించడానికే ఆ ఆఫర్ యిచ్చి దాన్ని బయటపెట్టాడు. ''ఆ భూమి విలువ 5 కోట్లుంటుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఎవరైనా 30 కోట్ల లంచం యిస్తారా? ఇదంతా నాన్సెన్స్'' అని ఏక్‌నాథ్ కొట్టేయబోయాడు. కానీ దాని విలువ రూ. 226 కోట్లుంటుందని నిపుణుల అంచనా. అతనిలా వాదిస్తూ వుండగానే గజానన్‌ను ఒక డాక్టరును కోటి రూపాయల లంచం అడుగుతూ ఎసిబి (అవినీతి నిరోధక శాఖ)కు పట్టుబడ్డాడు. అరెస్టు చేశారు. ఇప్పటిదాకా బెయిలు రాలేదు.
ఏక్‌నాథ్ అల్లుడు ప్రాణ్‌జల్ మనీష్ ఖేవల్కార్ ఒక వివాదంలో యిరుక్కున్నాడు. 2001లో అంధేరీ నివాసి ఒకతను హ్యుందాయ్ సొనాటా కారుని కొని రూ. 25 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని లిమోజాన్‌గా మార్చుకున్నాడు. అలా చేయడం చట్టవిరుద్ధం. 20 మీటర్ల పొడుగున్న లిమోజాన్లు ట్రాఫిక్‌కు యిబ్బంది కలిగిస్తున్నాయని 2011లో మహారాష్ట్ర ఆర్‌టిఓ రద్దు చేయగా ఆ కారును హరియాణాకు తీసుకెళ్లి అక్కడ రిజిస్టర్ చేయించారు. 2012 సెప్టెంబరులో జలగాంవ్‌కు తీసుకుని వచ్చి మనీష్ పేర రిజిస్టర్ చేశారు. జలగాంవ్‌లో ఏక్‌నాథ్ రాజ్యమే నడుస్తుంది కాబట్టి అక్కడ దర్జాగా నడుపుతున్నాడని ఫిర్యాదు వస్తే ఆర్‌టిఓ చట్టవిరుద్ధంగా లిమోజాన్ నడుపుతున్నందుకు అతనిపై కేసు పెట్టింది. ఏక్‌నాథ్ నడిగితే ''అది లిమోజాన్ కాదు, సొనాటాయే. పైగా ఏడాదిన్నరగా పని చేయడం లేదు. (తన సెల్‌ఫోన్ గురించి కూడా యిలాగే చెప్పాడు) అయినా మా అమ్మాయితో అతని పెళ్లి 2013లో జరిగింది. దానికి ముందు అతను చేసిన వాటికి నేనెలా బాధ్యుణ్ని?'' అని వాదిస్తున్నాడు. ఇంతలో అంజలీ దమాణియా అనే సామాజిక కార్యకర్త ఏక్‌నాథ్ తన ఆస్తుల వివరాలు సరిగ్గా వెల్లడించలేదని బయటపెట్టింది. జలగాంవ్‌లో వున్న తన 80ఎకరాల భూమిని వ్యవసాయభూమిగా చూపించాడని, కానీ దాన్ని రెసిడెన్షియల్ ప్లాట్లుగా ఎప్పుడో మార్చివేశాడని ఆమె ఆధారాలతో చూపించింది. ఏక్‌నాథ్ రాజీనామా చేయాలంటూ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహారదీక్ష చేయసాగింది.
ఇవన్నీ చాలనట్లు ఇండియా టుడే టీవీ ఛానెల్ మే 21న ఏక్‌నాథ్‌కి వ్యతిరేకంగా ఒక కథనం ప్రసారం చేసింది. వడోదరాకు చెందిన మహేశ్ భంగాలే అనే ఒక ఎథికల్ హ్యాకర్ ఏక్‌నాథ్‌కి దావూద్ ఇబ్రహీంకు గల లింకును బయటపెట్టగా టీవీ దానికి విశేష ప్రచారం కలిగించింది. అతని ప్రకారం కరాచీలోని ఒక లాండ్‌లైన్ ఫోను నుంచి ఏక్‌నాథ్ సెల్‌ఫోన్‌కు 2015 సెప్టెంబరుకు, 2016 ఏప్రిల్‌కు మధ్య ఆరు కాల్స్ వచ్చాయి. ఆ లాండ్‌లైన్ దావూద్ ఇబ్రహీర భార్య పేర రిజిస్టరై వుంది. ఈ ఆరోపణ రాగానే ఏక్‌నాథ్ అదంతా అబద్ధమన్నాడు. ఆ సెల్‌ఫోన్ ఏడాదిగా పనిచేయడం లేదన్నాడు. ఇండియా టుడే వాళ్లు కూపీ లాగి అది ఏప్రిల్ వరకు పనిచేస్తూనే వుందని, ఆ నెంబరుకు కాల్స్ వస్తూ పోతూనే వున్నాయని బయటపెట్టారు. దాంతో ఏక్‌నాథ్ తన సెల్‌ఫోన్‌ను హ్యేక్ చేసారని తన సిమ్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడి వుంటారని చెప్పసాగాడు. మహేశ్‌ను ''కరాచీ సమాచారం ఎక్కణ్నుంచి వచ్చిందో చెప్పమని దబాయించాడు. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ లి. వాళ్ల వెబ్‌సైట్ హ్యేక్ చేసి సేకరించానని, తన సమాచారం ప్రకారం దావూద్ ల్యాండ్ లైన్ నుంచి ఒక యుకె నెంబరుకు, 4 దుబాయి నెంబర్లకు, 5 ఇండియన్ నెంబర్లకు కాల్స్ వెళ్లాయని, అంతకంటె ఎక్కువ వివరాలు చెప్పనని మహేశ్ అన్నాడు.
''ఆ వెబ్‌సైట్ హ్యేక్ చేసినవాడు నా సెల్‌ఫోన్ కూడా హ్యేక్ చేసి వుండవచ్చు. ఈ ఆపరేషన్స్ చేయడానికి అసలు నీకు డబ్బెక్కడిది?'' అని అడిగాడు ఏక్‌నాథ్. ఎందుకంటే ఆప్ మహేశ్‌కు అండగా నిలబడింది. ఇదంతా ఆప్ చేయిస్తున్న అల్లరని ఏక్‌నాథ్‌కు అనుమానం. సిబిఐకు అప్పగిస్తే నిజాలు బయటకు వస్తాయని మహేశ్ వాదన. చివరకు దేవేంద్ర మహారాష్ట్రకే చెందిన ఎటియస్ (ఏంటీ టెర్రరిస్టు స్క్వాడ్)కు విచారణ బాధ్యత అప్పగించాడు. వాళ్లు ఏక్‌నాథ్ సెల్‌కు పాకిస్తాన్ నుంచి ఎలాటి కాల్సూ రాలేదని, వెళ్లలేదనీ తేల్చేశారు. నెలలోపు తమ ఎదుట హాజరై వివరణ యివ్వాలని మహేశ్‌కు నోటీసు పంపారు. అతనిపై కేసు పెట్టే అవకాశం కూడా వుందని అంటున్నారు. ఎటియస్‌పై నమ్మకం లేని మహేశ్ ముంబయికి స్వయంగా రాకుండా తన లాయరును పంపాడు. సిబిఐ విచారణకు ఆదేశించాలని బాంబే హైకోర్టుకు పిటిషన్ పెట్టుకున్నాడు. ఎటియస్ సహాయంతో ఏక్‌నాథ్ యీ గొడవలోంచి ఎలాగోలా బయటపడ్డాడనుకున్నా అవినీతి సెగ మాత్రం అతన్ని చుట్టుముట్టింది.
పుణె వద్ద వున్న భోసారీ ఇండస్ట్రియల్ ఏరియాలో మూడెకరాల భూమి వుంది. ఎంఐడిసి (మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) దాన్ని 1968లో తీసుకుంది కానీ దాని సొంతదారైన అబ్బాస్ ఉకానీకి పరిహారం చెల్లించలేదు. వాళ్లిస్తానన్న నష్టపరిహారానికి అతను ఒప్పుకోక పోవడంతో వ్యవహారం ఎటూ తేలకుండా వుండిపోయింది. తన పేర దఖలు పడకపోయినా ఎంఐడిసి 1971 నుంటి 1985 వరకు ఆ స్థలంలో కొంత భాగాన్ని 15 భాగాలు చేసి 14టిని వివిధ పరిశ్రమలకు 99 ఏళ్ల లీజుకి యిచ్చింది. స్వాధీనం చేసుకున్న 40 ఏళ్లలోపున పరిహారం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోక పోతే చట్టప్రకారం ఆ స్వాధీనం చెల్లదు. దాన్ని ఉదహరిస్తూ, ఆ ఆస్తి తనదేనని, ఎంఐడిసికి హక్కు లేదనీ కలకత్తాలో వుంటున్న అబ్బాస్ 2010లో పుణె పేపర్లలో ప్రకటన యిచ్చాడు. అది చూసి ఎంఐడిసి తహసిల్దార్ రికార్డుల్లో తమ పేరు 'అదర్ రైట్స్'లో చేర్పించింది. అంటే ఎన్‌కమ్‌బరెన్సు సర్టిఫికెట్టులో ఓనరుగా అబ్బాస్ పేరున్నా ఎంఐడిసికి కూడా ఎంతో కొంత మేరకు హక్కు వుంది అని నోటిఫై చేయించింది. అబ్బాస్ అది ఒప్పుకోలేదు. 2013లో లాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చాక నష్టపరిహారం విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ రేటున ఎంఐడిసి తనకు యివ్వాలని బొంబాయి హైకోర్టులో దావా వేశాడు.
రెవెన్యూ మంత్రి హోదాలో వున్న ఏక్‌నాథ్ మార్చి నెలలో అధికారుల దగ్గర్నుంచి యీ సమాచారమంతా సేకరించాడు. ఈ వివాదాస్పద భూమినుండి డబ్బు పిండుదామనుకున్నాడు. ఆ భూమిని తన భార్య మందాకిని, అల్లుడు గిరీశ్ చౌధరీ చేత అబ్బాస్ నుంచి ఏప్రిల్ 27 న రూ.3.74 కోట్లకు కొనిపించాడు. రికార్డుల్లో ఎంఐడిసి పేరున్నా వాళ్లను రంగంలోకి తీసుకుని రాలేదు. ఇప్పుడు ఓనర్లు తనవాళ్లే కాబట్టి రేపు ఎంఐడిసి చేత 2013 చట్టప్రకారం హెచ్చు రేటుకి నష్టపరిహారం యిప్పించగలడు. ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా ఎంత యివ్వాలో నిర్ణయించేది అతనే. ఏక్‌నాథ్ ''నేను మంత్రినైనంత మాత్రాన నా కుటుంబసభ్యులు భూములు కొనుక్కోకూడదా?'' అని వాదిస్తున్నాడు. కొనుక్కోవచ్చు. కానీ యిక్కడ అతని పదవి ప్రమేయం కనబడుతోంది. పోయిపోయి వివాదాల్లో వున్న భూమిని, యిప్పటికే వేరే వాళ్లకు ఎలాట్ చేసేసిన భూమిని ఎవరైనా కొంటారా? ఎంఐడిసి పేరు కూడా రికార్డుల్లో వున్నపుడు వేరే ఎవరైనా ధైర్యం చేస్తారా?
40 ఏళ్లకు పైగా పోరాడుతూ వచ్చిన అబ్బాస్ చట్టప్రకారం రావల్సిన బోల్డంత పరిహారం వదులుకుని మార్కెట్ రేటు ప్రకారం రూ. 23 కోట్లు వున్న 15 ఎకరాల భూమిని కేవలం 3.74 కోట్లకు ఎందుకు అమ్మేసుకున్నాడు? ఏక్‌నాథ్ అతన్ని పిలిచి ''నువ్విలా పోట్లాడుతూ వుంటే యీ లిటిగేషన్‌లో నీ జీవితకాలం గడిచిపోతుంది. ఎంఐడిసి తరఫు నుంచి పైసా రాకుండా చేయగలను. మేం యిచ్చినది తీసుకుని తృప్తి పడు.'' అని బెదిరించి, వైట్‌లో కొంత, బ్లాక్‌లో కొంత యిచ్చి పంపి వుండడానికి అవకాశం వుంది. స్వరాజ్ అభియాన్ కార్యకర్త మారుతి భాప్‌కర్ యిదే తరహా అనుమానం వ్యక్తం చేశారు. ఈ కొనుగోలును మేం ఒప్పుకోం అని ఆ 14 మంది పారిశ్రామికవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తనకు హక్కు వుందంటూ ఎంఐడిసి మాకు 99 ఏళ్ల లీజుకి డబ్బు వసూలు చేసింది. ఇప్పుడు వేరేవాళ్లు వచ్చి యిది మాది అంటే వూరుకుంటామా? అంటున్నారు.
ఏక్‌నాథ్ ఎదుర్కుంటున్న యిబ్బందికర పరిస్థితి శివసేనకు కనులవిందుగా, వీనులవిందుగా వుంది. జలగాంవ్‌లో సేన, ఏక్‌నాథ్ పోటీ పడుతూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో శివసేనతో పొత్తు పెట్టుకోరాదని తన పార్టీ నాయకులతో వాదించి నెగ్గిన ఏక్‌నాథ్ అంటే సేనకు కోపం. ఆ ఎన్నికలలో శివసేన బాగా దెబ్బ తింది. ఇప్పుడు రాజీనామా వార్త బయటకు రాగానే వాళ్లు పండుగ చేసుకున్నారు. అంతే కాదు, ఏక్‌నాథ్‌ను వెక్కిరిస్తూ ''కుర్రాడు (దేవేంద్ర) వెనక్కాల మందు దట్టిస్తున్నాడన్న సంగతి ఏక్‌నాథ్ గ్రహించలేకపోయాడు'' అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంపాదకీయం రాశాడు. 2017లో జరగబోయే బృహత్ బొంబాయి కార్పోరేషన్ ఎన్నికలలో ఏక్‌నాథ్ అవినీతిని ఎన్నికల అంశంగా మలచుకోవడానికి శివసేన ఉవ్విళ్లూరుతోంది. కావడానికి మిత్రపక్షాలే కానీ శివసేన ఏక్‌నాథ్‌పై అవినీతి ఆరోపణలను వెలుగులోకి తేవడంలో మొదటి వరుసలో నిలబడింది. బిజెపితో తెగతెంపులు చేసుకుని సొంతంగా పోటీ చేస్తే లాభమా? కలిసే వుండాలా అన్న విషయంపై శివసేన ఏదీ తేల్చుకోలేక పోతోంది.
ఏక్‌నాథ్‌పై గట్టిగా చర్య తీసుకుంటే అవినీతిపరులైన అగ్రవర్ణ నాయకులను వదిలేసి కేవలం బిసిపైనే చర్య తీసుకున్నారన్న పేరు వస్తుందేమోనని, అది తమకు 2017 యుపి ఎన్నికల్లో యిబ్బందిగా పరిణమిస్తుందని బిజెపి భయం. ఏక్‌నాథ్ విషయంలో ఏం చేయమంటారని అడగడానికి దేవేంద్ర జూన్ 2 న ఢిల్లీలో మోదీని, అమిత్ షాను కలిశాడు. 'మనం డిస్మిస్ చేస్తే బాగుండదు, ఆయన్నే రాజీనామా చేయమను' అని వాళ్లు సలహా యిచ్చారు. కానీ ఆ ముక్క చెప్పే ధైర్యం దేవేంద్రకు లేదు. ఈలోగా మహారాష్ట్రలో మీడియా దుమ్ము రేపేస్తోంది. వాళ్లు ఏక్‌నాథ్ వ్యవహారంపై అడిగే ప్రశ్నలకు దడిసి 'ఇకపై బిజెపి నుంచి ఎవరమూ టీవీ చర్చలకు రాము' అని బిజెపి పార్టీ ప్రతినిథి చెప్పేశాడు. ఇక టీవీ చర్చల నిర్వాహకులు ఎద్దేవా చేయసాగారు.
తనపై ఏకధాటిగా ఆరోపణలు వచ్చి పడుతూండడంతో ఏక్‌నాథ్ మే 30 నుంచి జలగాంవ్‌లో కాపురం పెట్టాడు. కాబినెట్ సమావేశాలకు రావడం మానేశాడు. నితిన్ గడ్కరీ తనకు సాయం చేస్తాడేమోనని చూస్తే అతను 'అమిత్ షాను కలిసి నీ వైపు కథ చెప్పు' అని సలహా యిచ్చాడు. ఆరెస్సెస్ చేత చెప్పిద్దామని అధినేత మోహన్ భగవత్ దగ్గరకు వెళదామంటే ఆయన కలవను పొమ్మన్నాడు. గడ్కరీ అమిత్‌ను స్వయంగా అడిగి చూస్తే 'రాజీనామా చేయమను, లేకపోతే మేమే తీసేయాల్సి వస్తుంది' అని చెప్పాడట. ఇక ఏక్‌నాథ్ జూన్ 4 న తన రాజీనామా పట్టుకెళ్లి దేవేంద్రకు యిచ్చాడు. తక్షణం ఒప్పుకుంటే తన మీద నింద వేస్తాడని భయపడిన దేవేంద్ర 'దీనిపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది' అని చెప్పి తప్పుకున్నాడు.
''2009-2014 మధ్య నేను 137 ల్యాండ్ స్కాములను బయటపెట్టాను. నిందితుల్లో శరద్ పవార్ కుటుంబం కుటుంబం కూడా వుంది. 1989లో ఆయన ముఖ్యమంత్రిగా వుండగా తన కూతురు సుప్రియా, అల్లుడు సదానంద్ సూలే ట్రస్టీలుగా వున్న ముకుంద్ భవన్ ట్రస్టు అనే స్వచ్ఛంద సంస్థకు పుణెలో 3.26 ఎకరాలు ఎలాట్ చేశాడు. 2011లో దాని గురించి లోతుగా పరిశోధిస్తే ఆ ట్రస్టు మధ్యలో చుక్క ఎగరకొట్టేసి 326 ఎకరాలు ఆక్రమించిందని తెలిసింది. 2 జి స్కాములో నిందితులుగా వున్న షహీద్ బల్వా, వినోద్ గోయెంకా కూడా ట్రస్టీల్లో వున్నారు.'' అన్నాడు ఏక్‌నాథ్. అలాటివాడు తనే భూబకాసురుడిగా తేలాడు. భోసారీ కుంభకోణంపై ఒక రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతాడని దేవేంద్ర ప్రకటించాడు. ''ఆర్నెల్లలో దాన్ని ముగించి, దాని చేత క్లీన్ చిట్ యిప్పించి, అప్పుడు మళ్లీ పదవి అప్పగిస్తామని బిజెపి కేంద్ర నాయకులు చెప్పిన మీదటనే ఏక్‌నాథ్ రాజీనామా చేయడానికి ఒప్పుకున్నాడు. అసలు వ్యవహారం యింతదాకా వస్తుందని అతను అనుకోలేదు. తన సీనియారిటీ చూసి, ఒబిసి కార్డు చూసి పార్టీ తన జోలికి రాదని అతివిశ్వాసంతో వున్నాడు. అందుకే దీనికి తెగబడ్డాడు.'' అంటున్నాడు ఒక బిజెపి నాయకుడు. రాజీనామా చేసినంత మాత్రాన ఏక్‌నాథ్ పునీతుడై పోయాడని, బిజెపి అతన్ని ఎప్పటికీ దూరం పెట్టేస్తుందనీ అనుకోకూడదు. చూడబోతే ఏక్‌నాథ్ అవినీతి కాండ యీనాటిది కాదు. ఎప్పణ్నుంచో సాగుతోంది. అతని రాజకీయబలం చూసి బిజెపి అతనితో వైరం పెట్టుకోదని యెడ్యూరప్ప ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. అవినీతిపరుల నిర్మూలనపై లెక్చర్లు దంచడం సులభమే, ఆచరణలో పెట్టడమే కష్టం. దావూద్ ఇబ్రహీంతో లింకు వున్నట్లు ఆధారాలు దొరికితే మాత్రం ఏక్‌నాథ్ పని అయిపోయినట్లే. ఎందుకంటే దేశప్రజలు దాన్ని క్షమించలేరు. కేవలం అవినీతి మాత్రమే అయితే ఆర్నెల్ల తర్వాత అతను మళ్లీ బిజెపిలో ప్రధాన నాయకుడు అయిపోయినా ఆశ్చర్యం లేదు.
- ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2016)