కమ్యూనిటీ ఓకే...అభ్యర్థిని అంగీకరిస్తారా?

'తాంబూలాలిచ్చేశాం...తన్నుకుచావండి' అన్నట్లుగా కేంద్రంలోని పాలక ఎన్‌డీఏ (అంటే బీజేపీ) తన రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించి మీ అభిప్రాయం చెప్పండంటూ బంతిని ప్రతిపక్షాల కోర్టులోకి విసిరింది. ఇక ఇప్పుడు వారు తర్జనభర్జనలు పడుతున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి పేరును ముందు ఎవరు ప్రకటిస్తారు? ప్రతిపక్షాలా? అధికార పక్షమా?... అనే ఉత్కంఠ ఇన్నాళ్లు కొనసాగింది. చివరకు ఈరోజు బీజేపీ తన అభ్యర్థిగా 71 ఏళ్ల బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను (గోవింద్‌ కావచ్చు) ప్రకటించింది. ఏమిటి ఈయన ప్రత్యేకత? ప్రధానంగా ఉన్న ప్రత్యేకత 'దళిత నాయకుడు'.

షెడ్యూల్డు కులానికి (ఎస్‌సి) చెందినవాడు. దళిత కార్డును ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే ఎన్‌డీఏ తన అభ్యర్థిగా రామ్‌నాథ్‌ను ఎంపిక చేసినట్లు కనబడుతోంది.

పక్కా బీజేపీ నాయకుడైన ఈయన ఉత్తర భారతదేశంలో ఎక్కువమందికి తెలుసేమోగాని దక్షిణాదివారికి తెలియకపోవచ్చు. దక్షిణాదిలోనైనా బీజేపీ నాయకుల్లోనూ కొద్దిమందికి తెలిసివుండొచ్చు. మొత్తం మీద దేశమంతా తెలిసిన ప్రాచుర్యమున్న వ్యక్తి కాదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆయనకు ఉన్న అర్హత, గుర్తింపు బీజేపీ నాయకుడిగానే. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీలో ఎస్‌సి విభాగం అధ్యక్షుడిగా చేశారు. ఇదీ ఆయన చరిత్ర. ఈయన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా? పోటీ అభ్యర్థిని నిలబెడతాయా? అనేది త్వరలోనే తేలుతుంది. 

సామాజికవర్గం దృష్ట్యా చూస్తే ప్రతిపక్షాలకు అభ్యంతరం ఉండదు. దళితుడు రాష్ట్రపతి కాకూడదని అనలేరు కదా. ఈయన రాష్ట్రపతి అయితే కేఆర్‌ నారాయణన్‌ తరువాత దళిత రాష్ట్రపతి అయిన ఘనత ఈయనకు దక్కుతుంది.

సామాజికవర్గం పరంగా అభ్యంతరం పెట్టని ప్రతిపక్షాలు ఈయన వద్దనుకుంటే ఏం కారణం చెబుతాయో...! దేశానికి మరోసారి మహిళ రాష్ట్రపతి అవుతుందని నిన్నటివరకు అనుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము మొదలైనవారి పేర్లు హల్‌చల్‌ చేశాయి.

కార్పొరేట్‌ దిగ్గజాలు రతన్‌ టాటా, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి పేర్లూ వినిపించాయి. చివరకు పెద్దగా ఎవ్వరికీ పరిచయంలేని రామ్‌నాథ్‌ గోవింద్‌ను ఎంపిక చేసింది బీజేపీ. యూపీ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ యోగిని ఎంపిక చేసి ఎలా ఆశ్చర్యపరిచారో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రధాని షాక్‌ ఇవ్వబోతున్నారని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మీడియా సంస్థలు ఇదివరకే అంచనా వేశాయి.

ప్రధాని మోదీ రాష్ట్రపతి పదవికి ఓ మహిళను అందులోనూ గిరిజన మహిళను ఎంపిక చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతం జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న  ద్రౌపది ముర్ము పేరు బాగా వినబడింది. ఈమె రాష్ట్రపతి అయ్యుంటే దేశానికి రాష్ట్రపతి అయిన తొలి గిరిజన మహిళగా చరిత్రకెక్కేవారు. కాని ప్రధాని ఆలోచన మారిపోయింది.

దేశంలో గిరిజనులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నా వారికి అవకాశం రాలేదు. గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు కాదనవు. మహిళ మాత్రమే కాకుండా గిరిజనురాలు కాబట్టి ప్రతిపక్షాలు గిరిజన మహిళను వ్యతిరేకిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనుల ఓట్లు ప్రతిపక్షాలకు పడకపోయే ప్రమాదముంది.

ఇప్పుడు బీజేపీ దళిత అభ్యర్థిని ఎంపిక చేసింది కాబట్టి సామాజికవర్గంపరంగా కాదనేందుకు అవకాశం లేదు. ప్రతిపక్షాలు ఈయన్ని అంగీకరించకపోతే పోటీగా దళిత అభ్యర్థినే నిలబెడతాయేమో...! ఏం జరుగుతుందో చూడాలి.

Show comments