అభిప్రాయాలను మార్చేసే.. గాడ్ ఫాదర్ సిగ్నేచర్ టోన్!

'నిన్ను మనుషుల్లేని గ్రహానికి పంపించేస్తాం.. వెంట ఏయే సినిమాల సీడీలు తీసుకెళ్తావ్‌?' అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను అడిగితే.. ''గాడ్‌ ఫాదరూ.. నాలుగు బ్లూఫిల్మ్‌లు..'' అని చెబుతాడు. నాలుగు బ్లూఫిల్మ్‌లను ఎన్నిసార్లని తిప్పి తిప్పి చూస్తాడో కానీ, గాడ్‌ఫాదర్‌ విషయంలో మాత్రం వర్మ సెలక్షన్‌ని ఆ సినిమాను చూసిన వారెవరూ కాదనలేరు! ''వన్‌ ఆఫ్‌ ది గ్రేటెస్ట్‌ ఫిల్మ్‌ ఇన్‌ ది వరల్డ్‌ సినిమా'', 'సెకెండ్‌ గ్రేటెస్ట్‌ మూవీ ఇన్‌ అమెరికన్‌ సినిమా'' (సిటిజన్‌ కేన్‌ ఫస్ట్‌ గ్రేటెస్ట్‌) వంటి బిరుదులు ''ది గాడ్‌ ఫాదర్‌''కు చాలా చిన్నవి! అంతకు మించి ఏమైనా ఉంటే.. ఈ సినిమాకు కితాబులుగా ఇవ్వాలి. అలాంటి ప్రశంసలతో గాడ్‌ఫాదర్‌కు న్యాయం చేయాలి. లేకపోతే మిగిలిన ప్రశంసలన్నీ చిన్నబోతాయ్‌. 45యేళ్లు గడిచిపోయినా.. గాడ్‌ఫాదర్‌కు తగిన ప్రశంసను తయారు చేయలేకపోయింది.. ఈ ప్రపంచం.

గాడ్‌ఫాదర్‌ గొప్పదనం ఏమిటంటే.. ఆ సినిమా చాలా మందిని అలరించడమో, గొప్ప అనుభూతిని మిగల్చడమే కాదు.. ఆ సినిమా కొంత మందిని 'గొప్ప దర్శకులు'గా నిలబెట్టింది. కొంతమంది చేత 'గొప్ప సినిమాలు' తీయించగలిగింది! 'ది గాడ్‌ఫాదర్‌''ను కాపీ కొట్టిన వాళ్లు, ఆ సినిమా ప్రభావంలోకి పడిపోయి ఇంకో సినిమాను తీసిన వాళ్లు.. ఒక జాతికే ఆరాధ్యులయ్యారు. అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీరి గొప్పదనం మూలాలు.. ''గాడ్‌ఫాదర్‌'' మూవీ దగ్గరే ఉన్నాయి. గాడ్‌ఫాదర్‌ మత్తులోనే ఏదో గమ్మత్తు ఉందంతే!

మణిరత్నం సినిమా 'నాయకుడు' ని టైమ్‌ మ్యాగ్జిన్‌ ప్రపంచంలో వచ్చిన అత్యుత్తమ వంద సినిమాల్లో ఒకటిగా గుర్తించింది. ఇదే జాబితాలో ''ది గాడ్‌ ఫాదర్‌'' కూడా ఉంటుంది. ఏంటిది? ఏమైనా భావ్యమా? ''ది గాడ్‌ ఫాదర్‌'' స్ఫూర్తితో, ఆ సినిమా ప్రభావంతో రూపొందిన ''నాయకుడు''ను 'ది గాడ్‌ ఫాదర్‌''తో సమానంగా ఎలా కూర్చోబెడతారు? మణిరత్నం మనోడే కావొచ్చు.. నాయకుడు మంచి సినిమానే అయ్యుండొచ్చు.. కానీ ఈ సినిమా జీన్స్‌ ''ది గాడ్‌ ఫాదర్‌'' ది కదా! ఆ సినిమా జన్యువులతో పుట్టుకొచ్చిన సినిమాను కదా మణిరత్నం తీసింది! అలాగే  'నాయకుడు' ఆస్కార్‌ అవార్డుల కోసం ఇండియా తరపు నుంచి పోటీ పడింది.. ఎలా ఇస్తారు బాబు ఆస్కార్‌ ని? అంతకు చాలా సంవత్సరాల క్రితమే ''నాయకుడు''కి ఫాదర్‌ లాంటి 'ది గాడ్‌ఫాదర్‌' అవార్డులన్నింటినీ ఊడ్చుకుపోయాడు కదా.. ఇక మళ్లీ ఈ ''నాయకుడు''కు అవార్డు ఎందుకు?

సినీ ప్రపంచం ''ది గాడ్‌ఫాదర్‌''కు క తజ్ఞతలు చెప్పుకోవాలి. ఎన్ని చెప్పుకున్నా తక్కువే.. శాత్వతంగా రుణపడిపోయింది. మారియా ఫ్యూజో, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా.. ''ది గాడ్‌ ఫాదర్‌'' స్క్రిప్ట్‌కు పురుడు పోశారు. అంతకు ముందు నవల రూపంలో ఉండిన అద్భుతానికి తెరపైకి తీసుకొచ్చింది 1972లో. ''ది గాడ్‌ఫాదర్‌''కు కొనసాగింపుగా రెండు సంవత్సరాల తర్వాత 'ది గాడ్‌ఫాదర్‌-2' వచ్చింది. న్యూయార్క్‌ క్రైమ్‌ వరల్డ్‌కు సంబంధించి ఒక ఫిక్షనల్‌ స్టోరీ. ఆ ప్రపంచంలోని వ్యక్తులు.. వారి తీరు.. వారి బంధాలు, అనుబంధాలు, ఆధిపత్య పోరు... సినిమా ఒక ఎపిక్‌. ఇంకేముంది.. ఆ ఎపిక్‌ నుంచి ఎవరికి తోచిన ఎపిసోడ్లను వారు తెచ్చేసుకున్నారు.. కాపీ అనాలా.. స్ఫూర్తి అనాలా.. వీటి రూపకర్తలు గాడ్‌ఫాదర్‌ మత్తులో ఉండగా వాటిని రూపొందించేశారా.. అనేది ఎవరి ఇష్టం వారిది. Readmore!

న్యూయార్క్‌లో సెటిలైన ఇటాలియన్‌ వలస ప్రజల మధ్య అనాథగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీటో కార్లియానో.. డాన్‌గా ఎదిగి.. అక్కడి కాసినోలను, ఇతర చీకటి సామ్రాజ్యాన్ని నియంత్రిస్తూ.. చట్టబద్ధంగా న్యాయం దక్కని అమెరికన్లకు కూడా వారు కోరిన న్యాయం చేస్తూ 'గాడ్‌ఫాదర్‌' అవుతాడు. ఈ వ్యాపారాలను నియంత్రించే తన సహచరులు.. తన సమస్థాయి వాళ్లు డ్రగ్స్‌ వ్యాపారాన్ని కూడా చేపడదాం.. అనే ప్రతిపాదనను తీసుకొస్తే డాన్‌ దానికి నిరాకరిస్తాడు. కొత్త శత్రువులు తయారవుతారు. తన కూతురిని అత్యాచారం చేశారు, ఆమెను జీవచ్ఛవంగా మార్చారు.. కానీ చట్టం దోషులను ఏం చేయలేకపోయింది.. అని ఒక ప్రజాప్రతినిధి వచ్చి చెప్పుకుంటే అతడికీ అతడు కోరుకున్న న్యాయం చేస్తాడు. ఈ గాడ్‌ఫాదర్‌ హీరోయిజాన్నే ''నాయకుడు'' సినిమా దగ్గర  నుంచి నిన్నలా మొన్న వచ్చిన 'జనతా గ్యారేజ్‌'' వరకూ ఎన్నింటిలోనో చూశాం. ఇక రామ్‌ గోపాల్‌ వర్మ అయితే 'గాయం' దగ్గర నుంచి 'సర్కార్‌' 'సర్కార్‌రాజ్‌'ల వరకూ ఎన్నోసార్లు గాడ్‌ఫాదర్‌ ఫార్ములాతో హిట్లు కొట్టాడు. 'సర్కార్‌-3'కు రెడీ అవుతూ ఇంకోసారి 'ది గాడ్‌ఫాదర్‌'ను మరోసారి అనుకరించబోతున్నాడు.

'గాడ్‌ఫాదర్‌'ను అనుకరించిన వారి తీరును గమనిస్తే.. వీళ్లంతా తెలివైన వాళ్లు అనే విషయం కూడా అర్థం అవుతుంది. ఆ సినిమా మూల కథను తీసుకుని.. దానికి అదనంగా ఏదో పాయింట్‌ మీద వీళ్లు కథలను నడిపించుకున్నారు. న్యూయార్క్‌లోని ఇటాలియన్‌ వలస ప్రజల మధ్యన 'గాడ్‌ఫాదర్‌' కథనం నడిస్తే.. మణిరత్నం నాయకుడు ముంబైలోని తమిళ వలస ప్రజల కథ ఆధారంగా నడుస్తుంది. వీటో కార్లియానో తీరును అతడికి ఎంతో ఇష్టమైన తనయుడు మైఖేల్‌ ఏమాత్రం ఇష్టపడడు. ''నాయకుడు''లో తండ్రి తీరును కూతురు ఇష్టపడదు! అతడికి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. అంత సామ్రాజ్యాన్ని ఏలిన గాడ్‌ఫాదర్‌ చాలా సింపుల్‌ చచ్చిపోతాడు. 'నాయకుడు'లో వీరినాయుడినీ ఒక పిచ్చోడు కాల్చి చంపేస్తాడు!

ఇక గాడ్‌ ఫాదర్‌-2లో వీటో కార్లియోన్‌ తనయుడు మైఖేల్‌ మీద అభియోగాలపై కమిషన్‌ రావడం, విచారణ జరిపి.. అతడి నేరాలకు ఎలాంటి రుజువులనూ చూపలేకపోవడం.. ఈ ఎపిసోడ్‌ను 'నాయకుడు' క్లైమాక్స్‌లో యథాతథంగా వాడుకున్నారు. వీరినాయుడిని కోర్టు ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు.. అతడిపై ఏ అభియోగాలనూ రుజువు చేయలేరు. తన మంచితనాన్ని సహించని తన సమస్థాయి వాళ్లు తనయుడిని కాల్చి చంపగా.. ఆ బాధను భరించే గాడ్‌ఫాదర్‌.. నాయకుడులో కొడుకును కోల్పోయి బాధపడే వీరి నాయుడు ఒకరు గాక ఇద్దరా?

తండ్రి 'గాడ్‌ఫాదర్‌'గా చెలామణి కావడాన్ని ఇష్టపడని మైఖేల్‌.. ఈ అసంత ప్తిని తన ప్రియురాలి వద్ద వ్యక్తం చేస్తూ ఉండటం, చివరకు అతడే తండ్రికి సిసలైన వారసుడు కావడం, గాడ్‌ఫాదర్‌గా ఎదగడం.. ఇదంతా వర్మ 'గాయం' సినిమాలో అన్నాదమ్ముల మధ్య కథగా వాడేశాడు. గాడ్‌ఫాదర్‌గా ఎదిన మైఖేల్‌ తీరు నచ్చక భార్య వీడి వెళ్లిపోతుంది. గాయంలో అన్న స్థానంలో ఎదిగిన దుర్గను రేవతి పాత్ర వీడి వెళ్లిపోతుంది! ''నాయకుడి''కి మొదిలియార్‌ జీవిత కథ ఆధారం అని చెప్పవచ్చు, ''సర్కార్‌''కు బాల్‌ఠాక్రే స్ఫూర్తి అని చెప్పుకపోవచ్చు.. ఈ మాటలేవీ ఈ సినిమాలపై ''ది గాడ్‌ఫాదర్‌'' ప్రభావం లేదు అని చెప్పడానికి ఉపయోగపడవు.

ఇండియన్‌ స్క్రీన్‌పై గాడ్‌ఫాదర్‌ స్ఫూర్తితో వచ్చిన సినిమాలను లెక్కపెట్టడం మొదలు పెడితే అవి చాలానే ఉంటాయి. ఇలాంటి వాటిలో ఉత్తమ స్థాయి అనుకరణలు.. ''నాయకుడు'', 'గాయం', 'సర్కార్‌' వంటి సినిమాలని చెప్పవచ్చు. అథమస్థాయి అనుకరణలుగా 'ప్రస్థానం' 'జనతాగ్యారేజ్‌' వంటి బోలెడు సినిమాలను చెప్పుకోవచ్చు. ''ప్రస్థానం'' మూవీలో సాయికుమార్‌ వారసత్వం తనకు దక్కడం లేదని అక్కసు చెందే చిన్నకుమారుడి పాత్రను, ఆ అక్కసుతో అతడు కనబరిచే ఆవేశానికి మూలం మరేమిటో కాదు.. వీటో కార్లియానో వారసత్వం కోసం అతడి రెండో కొడుకు ''గాడ్‌ఫాదర్‌-2'' చేసిన పనులే!

మేం.. మణిరత్నం అభిమానులం, ఆర్జీవీకి హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌.. 'నాయకుడు' సినిమా అద్భుతం, 'గాయం', సూపర్‌.. 'సర్కార్‌'కు ఫిదా అయిపోయాం.. అని చెప్పుకునే వాళ్లు మన దగ్గర చాలా మందే ఉన్నారు. ఆల్రెడీ వీళ్లకు ఫ్యాన్స్‌ అయిపోయి ఉన్నాం దశాబ్దాలుగా. కానీ ఈ అభిప్రాయాలన్నీ మారిపోవాలంటే ఒక్కసారి 'ది గాడ్‌ఫాదర్‌' ''ది గాడ్‌ఫాదర్‌-2', 'ది గాడ్‌ఫాదర్‌-3''లను వరసగా చూడాలి. మూడింటిలోనూ బీజీఎంగా వినిపించే గాడ్‌ఫాదర్‌ సిగ్నేచర్‌ టోన్‌.. సినిమాల విషయంలో కొన్ని అభిప్రాయాలను సమూలంగా మార్చేస్తుంది. మనం గొప్ప అనుకుంటున్నది కేవలం పేరడీ.. అనుకరణ మాత్రమే! అసలు కథ వేరే ఉందనే స్పష్టత వస్తుంది!

-జీవన్‌ రెడ్డి.బి

Show comments