టీడీపీ 100 ప్రశ్నలు.. సిగ్గు సిగ్గు.!

ప్రతిపక్షం ప్రశ్నించాలి.. అధికార పక్షం సమాధానమివ్వాలి. సమాధానమివ్వడం చేతకాని దయనీయ స్థితిలో వున్నప్పుడే అధికార పక్షం ఎదురుదాడికి దిగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే చేస్తోంది. గడప గడపకూ వైఎస్సార్సీపీ.. అంటూ వంద ప్రశ్నల్ని ప్రజల ముందుకు తీసుకెళుతోంటే, దానికి కౌంటర్‌గా టీడీపీ కూడా వంద ప్రశ్నల్ని రెడీ చేసింది కామెడీగా. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 70 శాతం నెరవేర్చామని చెబుతూ టీడీపీ ఈ ప్రశ్నల్ని తయారు చేసిందట. ధైర్యముంటే ఈ అంశాలపై తమతో బహిరంగ చర్చకు రావాలని టీడీపీ సవాల్‌ విసరుతోందిప్పుడు. చట్ట సభల సాక్షిగా ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానమివ్వలేని దుస్థితి అధికార తెలుగుదేశం పార్టీది. సమాధానం చెప్పలేక, ప్రతిపక్షాన్ని సభ నుంచి గెంటేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. గడచిన రెండేళ్ళలో ప్రతి అసెంబ్లీ సమావేశాల సెషన్‌లోనూ ఇదే పరిస్థితి. 

వంద ప్రశ్నలెందుకు.. టీడీపీకి మూడే మూడు ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చిందా.? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రైల్వే జోన్‌ వచ్చిందా.? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా.? వీటికి సమాధానం చెప్పగలిగితే, చంద్రబాబు సర్కార్‌.. ప్రతిపక్షం సంధించిన 100 ప్రశ్నలకు కౌంటర్‌ ఇచ్చుకోవచ్చుగాక.! 

ప్రభుత్వంపై ప్రజలకు వున్న వ్యతిరేకత నేపథ్యంలో, ఆ వ్యతిరేకతను చాటిచెప్పడానికి ప్రతిపక్షం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించనుంది. ప్రభుత్వానికి చెప్పుకోడానికి అవకాశాలు చాలానే వున్నాయి. నిత్యం మీడియాలో ప్రకటనలే ఇందుకు నిదర్శనం. 'ఎవడబ్బ సొమ్మనీ..' అన్న చందాన, ప్రజల డబ్బుతో తమకు తాము పబ్లిసిటీ చేసుకుంటూ, మళ్ళీ ఇదిగో.. ఇలా 100 ప్రశ్నలంటూ గలాటా సృష్టించడమేంటో చంద్రబాబుకే తెలియాలి. 

ఔను మరి, చంద్రబాబుకి బోల్డంత అనుభవం వుంది. కానీ, ఆ అనుభవం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పనికిరావట్లేదు. అదే అసలు సమస్య. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, రాజధాని నిర్మాణం, ఇంటికో ఉద్యోగం.. ఈ హామీలు ఏమయ్యాయి.? ప్రజలు ఈఈ విభాగాల్లో ఎలాంటి ఆవేదనతో వున్నారు.? చంద్రబాబు ఒక్కసారి జనంలోకి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే మంచిదేమో.!

Show comments