రిపీట్ టైటిళ్లు.. టాలీవుడ్‌కు కలిసొస్తున్నాయ్!

సినిమా టైటిల్.. మిగతా చోట్ల అయితే దాని రూపకర్తల క్రియేటివిటికీ పెద్ద పరీక్ష! సినిమా కథకు తగిన టైటిల్ పెట్టడం అనేది దాని సజించిన వాడి సామర్థ్యానికి పరీక్ష. తాము రాసుకున్న, తీసిన సినిమాకు కచ్చితంగా సూటయ్యే  టైటిల్‌ను పెట్టలేని వాళ్లు ఏం క్రియేటర్లు? అనేది అంతర్జాతీయ సినీ విశ్లేషకులు నుంచి వినిపించే ప్రశ్న! అయితే క్యాచీ టైటిళ్లు, సెంటిమెంట్ కలిగిన అక్షరాలతో సినిమాకు పెట్టుకోవడాలు.. అనేవి మనోళ్లకు మామూలే. ప్రత్యేకించి తెలుగు చిత్రపరిశ్రమలో కథతో సంబంధం ఉన్న  టైటిల్ పెట్టాలనే నియమం ఏమీలేదు! ఈ విషయంలో మనోళ్లకు ఎలాంటి పరిమితులూ లేవు. 

ఇష్టం వచ్చిన టైటిల్‌ను, కథకు ఏ మాత్రం సంబంధం లేని టైటిల్‌ను.. పెట్టేసుకోవచ్చు. ఆఖరికి బాషా పరమైన అడ్డంకులు కూడా లేవు మనదగ్గర. తెలుగు సినిమాకు తెలుగులో తోచిన టైటిల్ పెట్టొచ్చు.. ఇంగ్లిష్, హిందీ ఇలా ఏ భాషలోని పదాలతో అయినా నామకరణం చేసుకోవచ్చు. ఇలాంటి పరిమితులు లేకపోవడంతో ఈ మధ్య కొన్ని సినిమాలకు తమిళ పదాలను కూడా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. మరి కథకు సంబంధించిన టైటిళూ పెట్టనక్కర్లేదు, భాషాపరమైన పరిమితులూ లేవు. అయినప్పటికీ టైటిళ్ల విషయంలో మనోళ్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు!

ఈ మధ్య పాత సినిమాల పల్లవులను, చరణాలనూ సినిమాలకు టైటిల్‌గా పెట్టడాన్ని అలవాటు చేసేసుకున్నారు! ఇంకేముంది.. దీనికి అంతేలేదు! హిట్టైన ప్రతి సినిమా పాట పేరులోంచి ఐదారు టైటిల్స్‌ను వెతుక్కోవచ్చు. కథతో సంబంధం లేకపోయినా పర్వాలేదు.. హిట్టైన పాట మదిలోకొస్తే చాలు టైటిల్ దొరికేసినట్టే. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’’, ‘కల్యాణ వైభోగమే’, ‘‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’’, ‘వెన్నెల్లో హాయ్..హాయ్..’’,  ‘‘శ్రీరస్తు శుభమస్తు’’, ‘సాహసం శ్వాసగా సాగిపో’’ వంటి  ఇలాంటి పాటల టైటిళ్లు బోలెడన్ని వినిపిస్తున్నాయి. ఒక్క గబ్బర్ సింగ్ సినిమాలోని పాటల నుంచే అరడజను సినిమాల టైటిళ్లు వెళ్లువెత్తాయంటే మనోళ్ల ట్రెండేమిటో అర్థం చేసుకోవచ్చు.

టైటిళ్ల విషయంలో ఇలాంటి ట్రెండ్ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు పాత సినిమాల పేర్ల దండకాన్ని అందుకున్నారు మరికొందరు. ఎప్పుడో దశాబ్దాల కిందటి సినిమా పేర్లను రిపీట్ చేయడమే వీళ్లు చేస్తున్న పని. ఒకటీ రెండు కాదు.. వరసగా ఈమధ్య కాలంలో పాత సినిమాల పేర్లు రిపీటయిపోతున్నాయి! పెద్దహీరోలు చిన్న హీరోలు తేడా లేకుండా.. అందరూ పాత టైటిళ్లనే నమ్ముకుంటున్నారు. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఇలాంటి రిపీటెడ్ టైటిళ్లతో వస్తున్న సినిమాలకు విజయాలు దక్కుతుండటం!

ఈ ఏడాది ఇప్పటి వరకూ విడుదలైన కొన్ని ప్రముఖ సినిమాల్లో అంతం, జెంటిల్మన్, పోలీస్, చిత్రంభళారే విచిత్రం, రన్ ఈ సినిమాల పేర్లన్నీ ఇది వరకూ వాడేసిన టైటిల్సే! వీటిల్లో కొన్ని ప్రముఖ దర్శకులు తీసిన సినిమాలున్నాయి. సూపర్ హిట్టైన సినిమాలున్నాయి. వర్మ వాడేసిన టైటిల్ ‘అంతం’ ఇది ఆయన మార్కు టైటిల్ అని కూడా చెప్పాలి. ఇది మాత్రమే కాదు.. వర్మ వాడి పాడేసిన టైటిల్స్‌లో మరికొన్నింటిని కూడా వాడేశారు. ‘గాయం’ అని అప్పుడెప్పుడో వర్మ ఒక సినిమా తీస్తే.. ఆ తర్వాత అదే పేరుతో ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. ఇక శంకర్ తమిళ అనువాదాలకు పెట్టిన పేర్లు కూడా తెలుగులో వరసగా రిపీటవుతున్నాయి. శంకర్ సినిమా ‘జెంటిల్మన్’ ‘ప్రేమికుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల టైటిళ్లు  ఇప్పటికే రిపీటయ్యాయి. వీటిటో నాని జెంటిల్మన్ హిట్టయ్యింది కూడా. ఇక శ్రీహరి సినిమా ‘పోలిస్’ పేరును ఈ ఏడాదిలో వాడేశారు. చిత్రంభళారే విచిత్రం, లింగుస్వామి తీసిన ‘రన్’ సినిమాలు కూడా ఈ ఏడాదిలో రిపీటైన టైటిల్సే.

గత ఏడాది విషయానికి వస్తే..  మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ టైటిల్ కూడా ఒక పాత సినిమా పేరుకు రిపిటేషనే. ‘టైగర్’, ‘శంకరాభరణం’, ‘దొంగాట’, ‘బందిపోటు’’, మోసగాళ్లకు మోసగాడు, లవకుశ తదితర సినిమాలన్ని రెండోసారి వాడిన టైటిల్స్‌తో వచ్చినవే. ‘శంకరాభరణం’, ‘లవకుశ’ వంటి క్లాసిక్ సినిమాల పేర్లను కూడా నిర్భయంగా వాడేశారంటే టాలీవుడ్ తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ ఈ టైటిళ్లు ఎందుకు రిపీటవుతున్నాయి.. అనే విషయం గురించి విశ్లేషిస్తే.. దీంట్లో ముఖ్యంగా కనిపించేది ఒకకరమైన భావ దారిద్య్రం. తమ సినిమాలు ప్రేక్షకుల్లో టక్కున రిజిస్టర్ కావాలంటే అప్పటికే హిట్టైన సినిమా టైటిల్‌ను వాడేస్తే ఓ పనైపోతుంది.. అని మన దర్శకులు భావిస్తున్నారు. లేకపోతే శంకరాభరణం, గీతాంజలి, లవకుశ వంటి టైటిళ్లను కూడా ఒరిజినల్స్ కాలిబోటి దుమ్ముకు కూడా సరితూగని సినిమాలకు పెట్టారంటే.. ప్రేక్షకుల ఆటెన్షన్‌ను డ్రా చేయడానికి తప్ప ఒరిజినల్ టైటిల్స్‌కు ఏదో న్యాయం చేసేస్తామని కాదు కదా!

ఐడెంటిటీ క్రైసిస్‌తో ఉన్న దర్శక నిర్మాతలు ఇలా పాత సినిమాల టైటిళ్లను వాడుకోవడం ద్వారా తమ ఉనికిని చాటుకునే యత్నం చేస్తూ.. చివరకు ఆ ఉనికిని నిలెట్టుకోలేకపోతున్నారు. వారి సంగతలా ఉంటే.. మరికొందరిలో తగినంత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల టైటిల్స్ రిపీటవుతున్నాయని అనుకోవాల్సి వస్తోంది. ఏ ‘శ్రీమంతుడు’ వంటి సందరా్భల్లో మాత్రమే అరుదుగా  ఈ టైటిల్ రిపీటేషన్‌కు న్యాయం జరుగుతోంది.

అలాగే టైటిల్స్ రిపీటవ్వడం అంటే.. అది కొత్తగా జరుగుతున్న పనేమీ కాదని కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఇతిహాసాలను, పురాణాలను సినిమాలుగా తెరెకక్కించుకుంటున్న రోజుల నుంచే ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం జరుగుతూనే ఉంది. అదే కొనసాగుతూ వచ్చింది. ఈ విషయంలో స్టార్ హీరోల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ లేకపోవడాన్ని కూడా గమనింవవచ్చు. ఎన్టీఆర్ చేసిన టైటిల్‌తోనే ఏఏన్నార్ సినిమాచేశాడు.. అదే టైటిల్‌ను చిరంజీవి కూడా వాడాడు. ‘ఆరాధన’ పేరుతో ఏఎన్నార్ ఒక సినిమా, ఎన్టీఆర్ మరో సినిమా, చిరంజీవి ఇంకో సినిమా చేశారు. ఒకదానికి మరోదానికి పది పదహేనేళ్ల తేడాతో ఈ సినిమాలు వచ్చినట్టున్నాయి. మరి సరి స్థాయి అయినా.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య పేరు విషయంలో పట్టింపులు ఏమీ లేకపోయినట్టున్నాయి.

అలాగే ఎన్టీఆర్ చేసిన ‘దేవాంతకుడు’ పేరుతో చిరంజీవి ఒక సినిమా చేశాడు. ఇక ఇతర స్టార్ హీరోలు కూడా టైటిళ్లను రిపీట్ చేయడానికి ఏమీ మొహమాట పడలేదు. నాగార్జున, బాలకష్ణ, వెంకటేష్ హీరోల సినిమాల జాబితాను పరిశీలిస్తే.. పాత సినిమాల టైటిల్స్ బోలెడన్ని రిపీటయిన సందరా్భలున్నాయి. అలాగే  క్లాసిక్ సినిమాల టైటిళ్లను వాడుకోవడానికి నీలకంఠ, ఇంద్రగంటి మోహనకష్ణ వంటి వాళ్లు ప్రయత్నించారు. వీరిలో నీలకంఠ ‘మిస్సమ్మ’ టైటిల్‌కు కొంత వరకూ న్యాయం చేశాడు. ఇంద్రగంటి మోహనకష్ణ ‘మాయబజార్’ టైటిల్‌ను వాడి ఏ మాత్రమూ అలరించలేకపోయాడు.

మరి కొత్తా కాదు, ఆది నుంచి కొనసాగనిదీ ఏమీకాదు.. ఇకపై ఆగేదిలా కూడా కనిపించడం లేదు. టైటిల్ రోల్స్ అయినట్టుగానే సినిమాల టైటిళ్ల రోల్ కూడా కొనసాగేలా ఉంది. త్వరలో రానున్న ‘చుట్టాలబ్బాయి’, ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ వంటి పాత పేర్ల రిపిటేషనే దీనికి రుజువు. ఏ సినిమా విషయంలో అయినా దాని నిర్మాతకు ‘టైటిల్’పై పది సంవత్సరాల వరకూ హక్కులు ఉంటాయి. పదేళ్ల తర్వాత ఎవరైనా ఆ టైటిల్‌ను వాడుకోవచ్చు. టైటిళ్ల రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాకా.. ఈ నియమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది టైటిల్ రిపిటేషన్‌కు అనుకూలమైన నియమంగానే ఉంది. 

Show comments