తెలంగాణలో 'పచ్చ పార్టీ'కి శూన్యమేనా?

తెలంగాణలో ఎందుకో అప్పుడే ఎన్నికల ముచ్చట్లు షురూ అయినయ్‌. మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, ఏడాది ముందే అంటే 2019కి ముందే టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు పోయే అవకాశాలున్నాయని కాంగ్రెసు నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొత్త విషయం కాదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నట్లు గతంలోనూ వార్తలొచ్చాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు ఎదురులేదు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా అధికార పార్టీని ఆవగింజంత కదలించలేకపోయారు. ఎన్నికల్లో విజయాలకు తోడు పెద్ద సంఖ్యలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ప్రధానంగా టీడీపీ కనుమరుగైంది. 

అధికార పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగా అంటే పదవుల రూపంలో  (తుమ్మల, తలసానిని మినహాయిస్తే) ఏమీ మేలు జరగలేదు. లోపాయికారీగా ఎంతమేరకు జరిగిందో తెలియదు. పార్టీ మారిన కాంగ్రెసు నాయకులదీ ఇదే పరిస్థితి. కొంతకాలంగా కాంగ్రెసు పార్టీలో హడావుడి ఎక్కువైంది. కొంతమేరకు బీజేపీలోనూ కనబడుతోంది. ఈ రెండు పార్టీలూ టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి. ఏం చూసుకొని ఇంత ధీమా ప్రదర్శిస్తున్నాయో తెలియదు. అప్పుడప్పుడూ టీడీపీ కూడా 'మేమూ ఉన్నాం' అని గుర్తు చేస్తోంది. 

గత రెండున్నరేళ్లలో కేసీఆర్‌ ఏం సాధించారు? అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానం లేదు. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని, అన్ని విజయాలే సాధించామని, హామీలు చాలావరకు నెరవేర్చామని అధికార పార్టీ చెప్పుకోవడం సహజం. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత చాప కింద నీరులా ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాని వ్యతిరేకత ఆందోళనల రూపం సంతరించుకోవడంలేదు. ఇక తెలంగాణలో మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. తమిళనాడులో అధికార పార్టీకి భయపడినట్లుగా ఇక్కడా మీడియా అధికార పార్టీకి భయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెగించి రాసినట్లు ఇప్పుడు రాసే పరిస్థితి లేదు. 

కాబట్టి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఏం స్థాయిలో ఉందనేది మీడియా ద్వారా తెలియడంలేదు. ప్రతిపక్షాలే ప్రచారం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు పోవాలని టీఆర్‌ఎస్‌ ఎందుకు భావిస్తున్నదనే ప్రశ్నకు ఓటమి భయమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదుగాని ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం మాత్రం జరుగుతోంది. 2017 చివరి నాటికి మిషన్‌ భగీరథ, మరో రెండు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు కొందరు నాయకులు చెబుతున్నారు.  Readmore!

ప్రధానంగా మిషన్‌ భగీరథను ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేయాలని కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. ఇది పూర్తి చేసి నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనని చెప్పారు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆధ్యాత్మిక సెంటిమెంటుతో ఓట్లు కొల్లగొట్టేందుకు యాదాద్రిని గట్టిగా పట్టుకున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా? అనే విషయం పక్కనపెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని ఓ సర్వే తెలియచేసింది. టీఆర్‌ఎస్‌కు ఇప్పుడున్న ఆదరణ ప్రకారం చూస్తే ఇది విచిత్రం కాదు. కాని గులాబీ పార్టీకి తాము ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న టీడీపీ ఊసు ఈ సర్వేలో శూన్యం. దీన్ని గురించి అసలు ప్రస్తావించలేదంటే ఒక్క సీటు కూడా రాదని అర్థం కదా...! 

'సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌' అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 119 సీట్లలో అధికార పార్టీకి 109 సీట్లు వస్తాయని తేలింది. ఎంఐఎంకు ఏడు స్థానాలు దక్కుతాయట. అవి: బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, నాంపల్లి, కార్వాన్‌, మలక్‌పేట, యాకత్‌పురా. కాంగ్రెసుకు రెండు స్థానాలు (అలంపూర్‌, మెదక్‌), బీజేపీకి ఒక్క స్థానం (గోషామహల్‌) దక్కుతాయని సర్వే తెలిపింది. టీడీపీ గురించి ఏమీ చెప్పలేదు. కమ్యూనిస్టు పార్టీల ఊసు లేదు. కేసీఆర్‌ పాలనలో 79.2 శాతం ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారట....! 14.3 శాతం ఓటర్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. 6.5 శాతం మంది ఏ అభిప్రాయమూ చెప్పలేదు. 

రంగారెడ్డి జిల్లాలో 86 శాతం మంది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో 83.6 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కాని మెదక్‌ సీటు కాంగ్రెసుకు దక్కుతుందని సర్వే అంచనా వేసింది. ఇదెలా సాధ్యమో....! ఈ సర్వే కొత్త జిల్లాలు ఏర్పడకముందు (సెప్టెంబరు 21-29 మధ్య) జరిగింది. కాబట్టి పది జిల్లాలను తీసుకున్నారు. పది జిల్లాల్లో ఏడింటిలో అధికార పార్టీ వంద శాతం సీట్లు గెల్చుకుంటుందని సర్వే తెలిపింది. ప్రతిపక్షాల ప్రభావం కొంతమేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే ఉంటుంది.

Show comments