చట్టాలు..వాళ్లకు చుట్టాలు

ఈ దేశంలో చట్టాలు చేసేవాళ్ల కోసం మాత్రం కాదు. ప్రతి విషయానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా రాజకీయ నాయకులకు, పార్టీలకు అన్నీ భిన్నంగా వుంటాయి. ఉద్యోగుల జీత భత్యాలు పెంచాలంటే సవాలక్ష వ్యవహారాలు. కానీ అదే ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు వాళ్లకు వాళ్లే పెంచుకుంటారు. జనాలు తోలు వలిచేలా టోల్ వసూళ్లు వుంటాయి. రాజకీయ ప్రతినిధులకు ఫ్రీ..ఫ్రీ. ఇలా ఒకటి అని కాదు, సవాలక్ష వ్యవహారాలు. 

ఒకపక్క దేశంలో ఇన్ కమ్ టాక్స్ ఎక్కడ లేని బంధనాలు తెచ్చి, జనాల్ని కట్టడి చేస్తోంది. దేశం కోసం, దేశం ఆదాయం పెంచడం కోసం, జనాలు ఆ మాత్రం త్యాగాలు చేయాలి తప్పదు అని భరిస్తున్నారంతా. కానీ కొన్ని విషయాలు గమనిస్తుంటే మాత్రం ఏమిటీ అన్యాయం అనిపిస్తుంది.

ఆదాయపన్ను చట్టంలోని 13ఎ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీల సొమ్ముకు ఆదాయ పన్ను వర్తించదట. పైగా ఇంకో కీలకమైన వెసులు బాటు ఏమిటంటే, రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల్లో 20 వేల లోపు వాటికి వివరాలు చెప్పాల్సిన పని లేనే లేదట.  

ఒక ఉద్యోగి కనుక తన బ్యాంకు ఖాతాలో అయిదు వేల పైన నగదు డిపాజిట్ చేస్తే, దాన్ని కూడా ఆదాయంగా పరిగణించి పన్ను విధించే వెసులుబాటు ఆదాయపన్ను శాఖకు వుంది. కానీ రాజకీయ పార్టీల వైనం ఇలా వుంది. ఎవరైనా కాంట్రాక్టరో, రాజకీయ పార్టీ కారణంగా లాభం పొందిన వారో లక్షరూపాయిలు విరాళం ఇస్తే, దాన్ని ఆరు ముక్కలు చేసి, ఏవో పేర్లు రాసి, రశీదు కట్ చేస్తే సరి. ఇక ఆ రాజకీయ పార్టీ లెక్క చెప్పనక్కర లేదు. పైగా పార్టీలు సమర్పించే నివేదికలను తీసుకోవడమే తప్ప, వాటిని విచారించే అధికారం ఎన్నికల సంఘానికి లేదట. పైగా ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయంపై పరిమితి వుంది కానీ, రాజకీయ పార్టీల వ్యయంపై పరిమితి లేనే లేదట. ఎంత చిత్రం..ఎంతటి వెసులుబాటు. 

2005-2013 మధ్యలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి 6000 కోట్లు ఆదాయం వచ్చిందట. అందులో 73 శాతానికి లెక్కలే చెప్పనవసరం లేదట. ఘనత వహించిన మాయావతి పార్టీ అయితే, ఒక్క విరాళం కూడా 20 వేలు దాటినది తీసుకోనేలేదట. అన్నీ ఆన్ లైన్ చెల్లింపులు అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు నగదు చెల్లింపులే ఎక్కువ చూపిస్తాయట. అభ్యర్థులు ఎన్నికల వ్యయం పరిమితి దాటకుండా వుండేదుకు అన్నీ నగదు చెల్లింపులే చేసి, సగానికే బిల్లులు తీసుకుంటాయట. అంటే వీళ్లకు బ్లాక్ మనీ ఖర్చు. తీసుకున్న వాళ్లకి ఆదాయ పన్ను కట్టక్కర్లేదు.  కార్పొరేట్ కంపెనీలు వాళ్ల మూడేళ్ల ఆదాయంలో ఏడున్నర శాతం వరకు రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇవ్వొచ్చు. రాజకీయ-కార్పొరేట్ చెట్టపట్టాలకు ఇంతకన్నా ఏం కావాలి? నేరుగా తీసుకోకుండా పార్టీ కోసం తీసుకోవడం. లెక్కలు చెప్పకనక్కరలేదు. ఎలా కావాలిస్తే అలా వాడుకోవడం. 

సమాచార హక్కుపై దేశం గర్వంగా చెప్పకుంటుంది. ఏ సమాచారం అందివ్వకపోయినా, సంబంధిత అధికారిని నిలదీస్తారు. కానీ చిత్రంగా రాజకీయ పార్టీలు మాత్రం సమాచార హక్కు పరిథిలోకి లేవు. తెద్దామన్నా ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. అక్కడ అన్ని బేధాలు పక్కన పెట్టి అంతా ఒక్కటైపోతారు. మరింక ఈ దేశంలో చట్టాలు ఎవరి కోసం? కేవలం సామాన్య జనం కోసం. ఎవరో అన్నట్లు? ఏ ఎఎటీఎమ్ క్యూల్లో అయినా ప్రజా ప్రతినిధులు కనిపిస్తారా? చట్టాలు..సమస్యలు అన్నీ జనం కోసమే. జనాలందు రాజకీయ జనాలు వేరు.

Show comments