స్వదేశీ దోమలు... విదేశీ చట్టాలు...!

టీడీపీ అధినేత కమ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో అధికారానికి రావాలంటే ఏం చేయాలి? ఏవో కొన్ని విజయాలైనా సాధించి వాటిని గురించి ప్రజలకు చెప్పుకోవాలి. ఈ ఐదేళ్లలో ఈ పనులు చేశాను కాబట్టి, మళ్లీ గెలిపిస్తే ఇంకా బోలెడు చేస్తానని ప్రజలను నమ్మించాలి. ఆయన సాధించాలనుకున్న విజయాలు అనేకమున్నప్పటికీ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టువంటి పెద్ద లక్ష్యాలున్నాయి.

వాటి సరసన 'వందశాతం దోమల నిర్మూలన' అనే లక్ష్యమూ ఉంది. దాని పేరు 'మస్కిటో ఫ్రీ స్టేట్‌'. అంటే దోమల రహిత రాష్ట్రమని అర్థం. దోమల బాధ భయంకరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. వాటివల్ల అనేక రకాల విషజ్వరాలు వస్తున్నాయి. ప్రజలను శతాబ్దాలుగా దోమలు కుట్టి  పీడిస్తున్నా ఆ జాతిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పటివరకు సాధ్యపడలేదు.

కాని ఆ పని తాను చేస్తానని బాబు ప్రతిజ్ఞ చేశారు. కాని ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను కుమారుడు కమ్‌ మంత్రి లోకేష్‌ తీసుకున్నారు. దోమల నిర్మూలనపై గతంలో చంద్రబాబు నానా హడావుడి చేశారు. దోమల నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించారు. దోమల నిర్మూలన అనే తన కల  రెండేళ్లలో సాకారమవుతుందన్నారు. అవుతుందేమిటి ... చేయాల్సిందేనన్నారు.  

నాలుగైదు రోజులు 'దోమలపై దండయాత్ర' పేరుతో హడావుడి చేశారు. బడి పిల్లలతో ర్యాలీలు తీయించారు. దోమలపై పోరాడాలని వారితో నినాదాలు చేయించారు. దోమల నిర్మూలనపై అధికారులకు ఆదేశాలిచ్చారు. లక్ష్యాలు నిర్దేశించారు. బాబు స్వయంగా ర్యాలీల్లో పాల్గొని జనాలను ఉత్తేజితులను చేశారు. వారిలో చైతన్యం నింపారు. ప్రతి ఇంట్లో దోమలపై చర్చ జరగాలని, ఆ జాతిపై అలుపెరుగని సమరం చేయాలని, అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని హితవు చెప్పారు.

డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని, పట్టణాలు, పల్లెల్లో దోమల నివారణకు మందులు చల్లాలని ఆదేశించారు. బాబు చెప్పింది థియరీ వరకు బాగానే ఉంది. కాని ప్రాక్టికల్‌గా సాధ్యమా? అంటే మాటలే తప్ప చేతలు ఉండవని అర్థం. హైదరాబాద్‌ మహానగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత చక్కగా ఉందో వానా కాలంలో చూస్తున్నాం.  పాలకుల శ్రద్ధకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? ప్రభుత్వం పనికిమాలిన పనులకు కోట్లు ఖర్చు చేస్తుంది. కాని మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో మురుగు కాల్వల్లో దోమల నివారణ మందులు చల్లేందుకు నిధులు ఇవ్వదు. దోమలు లేని రాష్ట్రంగా చేయాలన్న ఐడియా బాబుకు ఎలా వచ్చింది?

ఆయన ఆలోచనలన్నీ 'విదేశీ దిగుమతులు' కదా. శ్రీలంక 'దోమలు లేని దేశం' అని బాబుకు ఎవరో చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీలంకను దోమలు లేని దేశంగా ప్రకటించిందట. ఆ దేశంలో సాధ్యమైన పని ఏపీలో ఎందుకు కాదు? అని అనుకొని తాను కూడా ప్రతిజ్ఞ చేశారు. వంద శాతం దోమల నిర్మూలన మన దేశంలో సాధ్యం కాదని శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు చెప్పారని  గతంలో ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

అసలు ఆంధ్రప్రదేశ్‌ వాతావరణమే దోమలు బాగా ఉత్పత్తి కావడానికి దోహదపడేదిగా ఉందని శాస్త్రవేత్తలు  చెప్పారు. ఈ రాష్ట్రం విపరీతమైన ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఉన్న రాష్ట్రం. ఇక్కడి వాతావరణంలో తేమ ఎక్కువ. నీరు, తేమ ఎక్కువ ఉన్న కారణంగా అనేక జాతుల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడెస్‌, అనాఫిలిస్‌, క్యూలెక్స్‌, ఏషియన్‌ టైగర్‌, ఎల్లో ఫీవర్‌....ఇంకా అనేక రకాల దోమలు పుడుతున్నాయి. దీంతో మలేరియా, డెంగ్యూ ఇతరత్రా వ్యాధులు ప్రబలుతున్నాయి.

దోమల ఉత్పత్తి స్థానాల్లో రెగ్యులర్‌గా కొన్ని మందులు చల్లి కొంతమేరకు నియంత్రించవచ్చుగాని వందశాతం లేకుండా చేయడం, భవిష్యత్తులో దోమలు ఉత్పత్తి కాకుండా చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. దోమలను నిర్మూలించాలంటే మరో మార్గం చట్టాలను అమలు చేయడం. చట్టాలు దోమలకు అర్థమవుతాయా? వాటిని అర్థం చేసుకునే అధికారులు, ప్రజలు అమలు చేయాలని అర్థం.

శ్రీలంక, మలేషియా, సింగపూర్‌లో అమలవుతున్న దోమల నిర్మూలన చట్టాలను ఏపీలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రులు లోకేష్‌, నారాయణ, కామినేని శ్రీనివాస్‌ సమీక్షించారు. రాబోయే రోజుల్లో దోమల నిర్మూలనపై పెద్దఎత్తున ప్రచారం చేస్తారు. దోమల నిర్మూలనకు సంబంధించి అధికారులు రోజువారీ వివరాలను లోకేష్‌ మెయిల్‌ చేయాల్సివుంటుంది. మరి ఈ విదేశీ చట్టాలు ఏమిటో, వాటిని ఎలా అమలు చేస్తారో చూడాలి.

-మేనా

Show comments