ఎమ్బీయస్‌: నోట్ల దరిద్రానికి భూటాన్‌ నోట్ల ఉపాయం

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని సామెత. ఉత్తర బెంగాల్‌లో నేపాల్‌, భూటాన్‌ సరిహద్దు జిల్లాలలో నోట్ల దరిద్రానికి ఓ ఉపాయం కనిపెట్టారు. నోట్ల రద్దు దరిద్రం అంటే అరుణ్‌ జేట్లే గారు ఒప్పుకోరు. రద్దు తర్వాత పరిస్థితి బ్రహ్మాండంగా వుందని ఆయనంటాడు. పన్ను వసూళ్లలో 14% వృద్ధే దానికి నిదర్శనం అని వాదిస్తున్నాడు. కానీ ఆయన లెక్కలు ఆయనవే తక్కినవారి లెక్కలు తక్కినవారివే. అఖిల భారత తయారీదార్ల సంఘం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆదాయం మొదటి నెల రోజుల్లో 50% పడిపోయిందని, రాబోయే రెండు నెలల్లో 55% తగ్గబోతోందని చెప్తోంది. దానివలన మొదటి 34 రోజుల్లో 35% మంది ఉద్యోగాలు పోయాయని అంటోంది. ఎగుమతి ఆధారిత కార్యకలాపాల్లో వున్న విదేశీ కంపెనీలతో సహా మధ్య, భారీ పరిశ్రమల్లో యిప్పటికే 30% మంది ఉద్యోగాలు పోయాయనీ, మార్చి నాటికి మరో 35% ఉద్యోగాలు పోయాయనీ చెప్తోంది. ఆదాయం 45% వరకు దెబ్బ తిందట. 

భారీ పెట్టుబడుల ఇన్‌ఫ్రా కంపెనీల్లో కూడా అదే పరిస్థితి అంటున్నారు. అనేక చిన్న వ్యాపారాల్లో 40-50% ఆదాయం తగ్గిందని చెప్తున్నారు. రైతుల పరిస్థితి మరీ ఘోరం. తక్కినవాళ్లు అమ్మకాలు లేకపోతే తమ ఉత్పాదనలను దాచుకోగలరు. కూరగాయలు దాచిపెడితే కుళ్లిపోతాయి. అందుకని తక్కువ ధరలకు అమ్మి నష్టపోతున్నారు. వ్యవసాయరంగం నుంచి మరింతమంది తప్పుకోవచ్చు. ఇంతమంది ఉద్యోగాలు పోతే యిక వస్తువులు ఎవరు కొంటున్నారు? వాటి అమ్మకాలపై ప్రభుత్వానికి పన్ను ఎలా వస్తుంది? జేట్లే గారే చెప్పాలి. 


రైతు కూలీలే కాదు, అనేక రంగాల్లో కూలీలు డబ్బు లావాదేవీలకే అలవాటు పడ్డారు. వాళ్లకి బ్యాంకు ఖాతాల గోల తెలియదు. మూలికలు, ఔషధపు ఆకులు, వేర్లు, దుంపలు అడవుల నుంచి ఏరి ఆయుర్వేద కంపెనీలకు తెచ్చియిచ్చే కూలీలకు డబ్బు చేతి కందకపోవడంతో తేవడం మానేశారు. వాటి సరఫరా లేకపోవడంతో మూడు ఆయుర్వేద కంపెనీ తాత్కాలికంగా ఉత్పాదన నిలిపివేశాయట. ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్‌, జల్పాయ్‌గుడి, అలీపూర్‌ద్వార్‌ జిల్లాలలో కూడా యిలాటి పరిస్థితే. దినసరి కూలీలపై ఆధారపడే టీ ఎస్టేట్లలో పని స్తంభించింది. రోజువారీ కూలీ నోట్లతో చెల్లించడానికి వీల్లేదు, మీ మీ ఖాతాల నెంబర్లు చెప్పండి, వేస్తాం అన్నారు టీ యజమానులు. అలా కుదరదు, డబ్బే కావాలని కూలీలు ఆందోళన చేశారు. దాంతో ఎస్టేట్లు మూసేశారు. కూలీలను వెళ్లిపోమన్నారు. కాపలాకు సెక్యూరిటీ మనిషిని ఒక్కణ్ని పెట్టారు. నాకు చెక్కిస్తానంటే కుదరదు, డబ్బే కావాలని అతను పట్టుబడితే అతనికి మాత్రం సరేనన్నారు. 


మనదేశంలోనే కాదు, చిన్న తరహా వ్యాపారాలలో నగదు లావాదేవీలు ఎక్కువ అని యిటీవలే ఒక వ్యాసం చదివాను. తమ దేశంలో 20 మంది కంటె తక్కువమంది ఉద్యోగులున్న వ్యాపార సంస్థలు ఎలాటి చెల్లింపులను స్వీకరిస్తున్నాయో తెలుసుకోవాలని బ్రిటన్‌ ప్రభుత్వం 2014లో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. 48% లావాదేవీలను నగదుతోనే చేస్తున్నారని తేలింది. ఎందుకు అంటే అది చాలా చౌక, ఎలాటి ఫీజు కట్టనక్కరలేదు. ఒక నోటు ఎన్ని చేతులు మారినా దాని విలువ తరగదు. 10 పౌండ్ల కంటె ఎక్కువ వుంటే కార్డులు ఉపయోగిస్తున్నారు కానీ తక్కువ వుంటే నగదే. కార్డు మీద కొనేటప్పుడు బజెట్‌పై నియంత్రణ వుండటం లేదనీ, అదే నగదు అయితే లెక్క చూసుకుని ఖర్చు పెడుతున్నామనీ వినియోగదారులు అన్నారు.  Readmore!

ఒక ప్రొఫెసర్‌ భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యయాన్ని లెక్క వేశారు. నెలకు రూ.500 విలువైన 10 లావాదేవీలను లేదా రూ. 5000 లను ఎవరైనా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా చెల్లిస్తే ఏడాదికి ఫోన్‌కు రూ. 250 ఖర్చవుతుంది. పేమెంట్‌ పోర్టల్‌ దగ్గర జమ చేసిన డబ్బు మీద రూ.120 ల వడ్డీ పోతుంది. ఈ ట్రాన్సాక్షన్‌లు చేయడానికి అయ్యే టైముకి అయ్యే ఖర్చు ఏడాదికి రూ. 120 అవుతుంది. అన్నీ కలిపితే ఏడాదికి 60 వేల రూ.ల లావాదేవీలపై ఏడాదికి రూ.490 ఖఱ్చు. ఇదే నగదు రూపేణా అయితే అయ్యే ఖఱ్చు 0. లావాదేవీ నగదు రూపేణా జరిపినా, కార్డు ద్వారా జరిపినా ప్రతీ కొనుగోలుకి బిల్లు వుండాలి, దానిపై ప్రభుత్వానికి పన్ను రావాలి. అది జరిగేట్లా చూడాల్సింది ప్రభుత్వం. చూడకపోతే దానికి లాభం లేకపోగా ప్రజలకు అదనపు ఖర్చు రూపేణా నష్టం కూడా. 


నోట్ల రద్దు తర్వాత కొరత ఏర్పడి దేశంలో అనేక ప్రాంతాల్లో బేరసారాలు తగ్గిపోయి వ్యాపారస్తులు గొల్లుమంటున్నారు. అయితే నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల్లో వున్న భారతదేశపు జిల్లాలలో మాత్రం నేపాలీ, భూటానీస్‌ నోట్లు వాడేస్తున్నారు. నిజానికి వినిమయానికి అనేక మార్గాలని ఎకనామిక్స్‌లో చదువుకున్నాం. మొదట్లో వస్తుమార్పిడి (బార్టర్‌) పద్ధతి వుండేది. ఆ తర్వాత వస్తువుకు విలువ కట్టి రాతకోతల ద్వారా ఎవరి కెంత రావాలో నిర్ణయించుకోసాగరు. ఆ విధంగా ఋణపత్రాలు వచ్చాయి. అవే నోట్లగా మారాయి. ఇప్పుడు భూటాన్‌ రూపాయి నోట్లను వాడుకుంటున్నారు. అవి బాగా పోగుపడ్డాక, భూటాన్‌ వెళ్లి మార్చుకుని వస్తున్నారు. నేపాల్‌, భూటాన్‌ నుంచి వచ్చే టూరిస్టులు, వ్యాపారస్తులు ఇప్పుడు వాళ్ల కరెన్సీని ఇండియన్‌ రూపాయల్లో మార్చుకోవడం మానేసారు. ఇక్కడి వ్యాపారస్తులకు అలాగే యిచ్చేస్తున్నారు. వీళ్లు అవి తీసుకుని తర్వాత వచ్చిన వాళ్లతో ఆ నోట్లతోనే లావాదేవీలు చేస్తున్నారు. నిజానికి యిది చట్టవిరుద్ధమే అయినా యిలాటిది జరుగుతోందని బెంగాల్‌ ప్రభుత్వాధికారులు ఒప్పుకున్నారు. ''జరుగుతోంది కానీ, మరీ అంత ఎక్కువగా కాదు'' అని సంజాయిషీ యిచ్చారు. పత్రికా విలేకరులు వెళ్లి అడిగితే వ్యాపారస్తులు 50% వ్యాపారం విదేశీ నోట్లతోనే జరుగుతోందని చెప్తున్నారు. 


'అలా ఎలా చేస్తారు. అవి దొంగనోట్లతో సమానం. మన లెక్కల్లోకి రాదు కాబట్టి బ్లాక్‌ మనీతో సమానం.' అని విలేకరులు అడిగితే 'ఏం చేయమంటారు? రోజుకి 10 వేలుండే నా వ్యాపారం నోట్ల రద్దు తర్వాత రోజుకి 4 వేలకు పడిపోయింది. ఇక అప్పణ్నుంచి నేపాలీ, భూటానీ నోట్లు కలపడం ప్రారంభించాం.' అంటున్నారు వాళ్లు. వేరే మార్గం లేక వీళ్లీ పని చేస్తున్నారు. వీళ్లను అరెస్టు చేయడఎ ఎలా? అంటున్నారు బెంగాల్‌ అధికారులు. నోట్ల రద్దు ప్రభావం నేపాల్‌లో ఎలా వుందా అని చూస్తే అక్కడ కాసినోలన్నీ ఖాళీగా కనబడ్డాయట. స్థానిక నేపాలీలను కాసినోలకు రానీయరు. ఇండియా నుంచి వచ్చి ఆడే ఆటగాళ్లు నోట్ల రద్దు ప్రభావానికి రావడం మానేశారు. ఇక్కడ మన దేశంలో కూడా కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే మద్యం అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. నిత్యావసరాలకే తడుముకోవాల్సి వస్తూంటే యిక విలాసాలకు డబ్బెక్కణ్నుంచి వస్తుంది పాపం!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

Show comments