దూరమైన కొలదీ పెరుగును అనురాగం- అన్న కవి వాక్కు నిజమో కాదో తెలీదు కానీ, దేశం కాని దేశం వెళ్ళి జీవనం సాగిస్తున్న వారి మీద మమకారం, బెంగా ఎక్కువ వుంటాయి. అందునే ప్రవాస భారతీయులకు ఏం జరిగినా, భారతీయులు ఆందోళన చెందుతుంటారు. కానీ ఈ బెంగలో వివక్ష వుంటుందా? ఉన్నట్టే అనిపిస్తోంది. ఇప్పుడున్న తీరును చూస్తుంటే. ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నది కేవలం అమెరికాలో వున్న ప్రవాస భారతీయుల మీదే. అక్కడ వున్న వారి ఉద్యోగ భద్రతకే కాకుండా, ప్రాణ భద్రతకు కూడా ముప్పు వాటిల్లింది. కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపిన ఘటన దగ్గర నుంచి వరుస కాల్పుల ఘటనలు నిజంగానే భయం కల్పిస్తున్నాయి. ఈఘటనల తర్వాత అమెరికాలో ని ఒక పార్కు దగ్గర వీడియో ను తీసి ఒక అమెరికన్ శ్వేత జాతీయుడు పోస్ట్ పెట్టాడు. 'ఈ పార్కు ముందు కార్లు చూడండి. ఎంత ఖరీదుగా వున్నాయో..! ఇక్కడ ఎంత మంది భారతీయులు ఆట విడుపుకు వస్తున్నారో గమనించండి. ఇది మినీ ఇండియాలా వుంది. ఇలా ఇంతమంది ఇండియన్లు వున్నారంటే, ఎంత మంది అమెరికన్లు తమ ఉపాధి కోల్పోతున్నారో..!' అని కింద రాశాడు. దీన్ని చదివిన సాటి శ్వేత జాతీయుల మనోభావాలు ఎలా వుంటాయన్నది- వేరే చెప్పనవసరం లేదు. అమెరికాలో ఐటీ పరిశ్రమ భారతీయులు, ఇతర విదేశీ ఉద్యోగుల వల్లనే మూడింతలు పెరిగిందన్న వాస్తవాన్ని గుర్తించే ఓపిక వారికి ఉండదు. అలాగే భారతీయులతో పాటు, అమెరికన్ల ఉపాధి అవకాశాలు కూడా గత రెండు మూడు దశాబ్దాలుగా పెరిగాయీ- అని చెప్పినా నమ్మటానికి సిధ్దంగా వుండరు. అమెరికాలో భారతీయులు ఇంత అభద్రతతో జీవిస్తున్నారంటే, సొంత గడ్డ మీద వున్న భారతీయులకు బాధగానూ, కోపంగానూ వుంటుంది.
కానీ అమెరికాలో వున్న వారు మాత్రమే ప్రవాస భారతీయులు కారు. అలాగే ఇతర యూరప్ దేశంలో వున్న వారూ, ఆస్ట్రేలియా వున్న వారు మాత్రమే కూడా ప్రవాస భారతీయులు కారు. వీరికన్నా ఎక్కువ సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో వున్నారు. కేవలం యునైటెడ్ అరబ్ ఎమరిటీస్ (యూఏఈ) దేశాలలో( అబు ధబి, అజ్మాన్, దుబాయ్, ఫజూరియా, రాస్ అల్-ఖయిమా, షార్జా, ఉమ్ అల్ కువైన్‌లలో) నే 35 లక్షల మంది భారతీయులు వున్నట్లు పిఇడబ్ల్యూ తాజానివేదిక చెబుతోంది. వీరు కాక ఇంకా ఇతర గల్ఫ్ దేశాల్లో గణనీయమైన సంఖ్యలో భారతీయులు వున్నారు. ఇక్కడ పలు దేశాల్లో ఉగ్రవాద దాడులు అధికంగా వున్నాయి. పలు సందర్భాల్లో, కిడ్నాపులూ, హత్యలూ జరిగాయి. ఇక్కడున్న సంఖ్యతో పోలిస్తే అమెరికాలో వున్న భారతీయులు తక్కువే. అక్కడ వున్నది 20 లక్షల మందే. ఇంత కన్నా పాకిస్తాన్‌లో వున్న ప్రవాస భారతీయులే ఎక్కువ. ఆమాట కొస్తే ప్రపంచ వ్యాపితంగా పలు దేశాల్లో వున్న భారత వలసదారులు మొత్తం కోటి 56 లక్షలు. అంటే ప్రవాసంలో వున్న వారిలో ఎనిమిదో వంతు మాత్రమే అమెరికాలో వుంటున్నారు. అయినప్పటికీ వీర పట్ల పడుతున్నంత ఇతర దేశాల, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో వున్న వారి మీద ఎందుకు కలగటం లేదు. దేశ ప్రధాని దగ్గర నుంచి ఇతర పాలక పక్ష నేతలు, విపక్ష నేతలూ ఎందుకుంత శ్రధ్ధ చూపటం లేదు.
ఎక్కడున్నా భారతీయులు భారతీయులే కదా! కానీ ఇక్కడే చిన్న తేడా వుంది. బాగా చదువుకున్న మధ్యతరగతి వర్గం అమెరికా, ఇతర యూరప్ దేశాలు వెళ్తుంటే, బీదా బిక్కీ,జనం, అంతంత మాత్రమే చదువులున్న శ్రామిక వర్గాల వారు గల్ఫ్ దేశాలకు తరలి పోతున్నారు. అక్కడ కేవలం కూలీలుగా బతుకుతున్నారు. ఈ విభజనం కేవలం ఆర్థిక వర్గాల వరకే వచ్చి ఆగిపోలేదు. సామాజిక వర్గాల వరకూ వెళ్ళింది. అమెరికాలో,యూరప్ దేశాల్లో వున్న వారు పై సామాజిక వర్గాల భారతీయులే అధికం. కానీ గల్ఫ్ దేశాల్లో వున్న వారిలో అట్టడుగు ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అధికంగా వుంటారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికున్న ఇమ్మిగ్రేషన్ కష్టాలు కూడా తక్కువేమీ కావు. సరయిన వీసాలు కూడా లేకుండా వెళ్ళి అక్కడ జైళ్ళ పాలయిన వారు అనేకులు. వారు అక్కడ చనిపోతే, వారి మృత దేహాలు రాని పరిస్థితి వుంది. అలాగే అమెరికాలో ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లే ఉభయ రాష్ట్రాల తెలుగువారు అధికంగా వున్నట్లుగానే, గల్ఫ్ దేశాల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వుండే తెలుగు వారు ఎక్కువ. అమెరికాలో ఇప్పుడంటే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చారు. దాంతో హెచ్1బీ వీసాల మీదా, అలాగే ఆ వీసాలున్నవారి తమ జీవిత భాగస్వాములను అమెరికాకు తెచ్చుకునే సౌకర్యాల మీదా అమెరికా వేటు వేస్తున్నది. కానీ ఈ గల్ఫ్ దేశాల్లో పలు చోట్ల రాజకీయ వ్యవస్థలు అస్తవ్యస్తంగా వుంటూనే వున్నాయి. పలు చోట్ల మధ్యయుగాల నాటి శిక్షలు (కొరడాలతో కొట్టడాలు) వంటి శిక్షలు కూడా వున్నాయి. అయినా మధ్యతరగతి వారి పట్ల ఒక వైఖరీ, పేద వర్గాల పట్ల మరొక వైఖరీ చూపించటం సరైన పధ్ధతి కాదు. ఇక నైనా దేశభక్తిలో సమతూకాన్ని పాటించాల్సిన అవసరం మనకి వున్నది.