1947లో దేశవిభజన జరిగినప్పుడు పశ్చిమ (ప్రస్తుత) పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందూ పంజాబీలు, సింధీలు మన దేశంలోకి శరణార్థులుగా వచ్చారని మనకు తెలుసు. లాహోర్ నగరం నుంచి తరిమివేయబడిన పంజాబీలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూలతో బాటు దేశంలోని అనేక ప్రదేశాలలో స్థిరపడి ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలలో ఆధిక్యత సాధించి వ్యాపారస్తులుగా, నిలదొక్కుకున్నారని తెలుసు. సింధ్ ప్రాంతంలోని మహా నగరాలైన కరాచీ, హైదరాబాదులలో ఆస్తులు వదులుకుని కాందిశీకులుగా వచ్చిన సింధీలు బొంబాయి, గుజరాత్‌లతో బాటు అనేక నగరాలలో అనేక చిన్న వూళ్లల్లో కూడా వ్యాపారస్తులుగా స్థిరపడి శ్రమతో పైకి వచ్చారు. కరాచీ స్వీట్సు, కరాచీ బేకరీలు, కరాచీ స్టోర్సు వంటివి తెలుగు నాట చిన్న వూళ్లల్లో కూడా కనబడతాయి. మరి పాకిస్తాన్‌కు వెళ్లిన భారతీయ ముస్లిముల మాటేమిటి? సరిహద్దు ప్రాంతాల్లో ముస్లిములైతే ప్రాణాలు అరచేత పట్టుకుని పాకిస్తాన్ చేరారు. కానీ యుపి, బిహార్ వంటి దేశమధ్యంలో వున్న రాష్ట్రాల నుంచి పాకిస్తాన్ అంటే ముస్లిముల స్వర్గధామం అనుకుంటూ కొందరు భారతీయ ముస్లిముల వెళ్లారు. వాళ్ల సంగతేమైందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజం. వాళ్లని పాక్‌లో 'ముజాహిర్' (మజాహిర్, మొజాహిర్ అని కూడా అంటారు, వలసదారుడు అని అర్థం) అంటారు. వాళ్లు ఎక్కువగా పాక్ అప్పటి రాజధాని, మహా నగరమూ ఐన కరాచీలో స్థిరపడ్డారు. వారి పక్షాన కొన్నాళ్లకు ఒక పార్టీ వెలిసింది. ఎమ్‌క్యూఎమ్ అని. దాని స్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రస్తుతం చావుబతుకుల్లో వుండి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అతని జీవితాన్ని పరామర్శించే క్రమంలో యీ ముజాహిర్ల కథ కూడా కాస్త తెలుస్తుంది.
కరాచీ ప్రాచీన కాలం నుంచీ, అంటే అలెగ్జాండరు కంటె ముందు నుంచి, గొప్ప నగరం. ఓడరేవు వున్న వ్యాపార, కూడలి. పాక్‌కు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రాజధాని. అభివృద్ధి అంతా దాని చుట్టూనే జరుగుతోందని గమనించి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దంన్నరకు రాజధానిని కరాచీకి దూరంగా ఇస్లామాబాద్‌లో పెట్టారు. ఇక హైదరాబాదు కూడా సింధు నదీతీరాన వుండడం చేత వ్యాపారానికి, పరిశ్రమలకు వాసి కెక్కింది. అలాటి నగరాలకు యీ ముజాహిర్లు ఎక్కువగా చేరారు. స్థానికులు సింధీ మాట్లాడగా వీరు ఉర్దూ మాట్లాడేవారు. వీళ్లంతా జిన్నాకు, లియాకత్ ఆలీ ఖాన్‌కు సన్నిహితులు. స్వతహాగా ఆస్తిపరులు, విద్యావంతులు, ఉన్నత పదవుల్లో పనిచేసి వచ్చినవారు, కాందిశీకుల్లా సర్వం పోగొట్టుకుని వచ్చినవారు కారు. కరాచీ ఆధునిక జీవనం, విద్య, నైపుణ్యం, సంస్కృతికి నిలయంగా వుండడంతో అక్కడ త్వరగా యిమిడిపోగలిగారు. అదే రాజధాని కూడా కావడంతో ప్రభుత్వాన్ని నడిపే ఉద్యోగవర్గాల్లో చొరబడిపోయారు. ప్రయివేటు ఉద్యోగాలలో మేనేజర్లు కూడా వారే. వాటికి తోడు చిన్నా, పెద్దా వ్యాపారాలు కూడా వారి చేతిలోనే! పారిశ్రామికీకరణ పెరుగుతూంటే కార్మిక నాయకులుగా కూడా వారే! జనాభా ప్రకారం చూస్తే వీరి సంఖ్య 8% మాత్రమే అయినా ఎక్కడ చూసినా వీరి అధిక్యతే కనబడడంతో స్థానికులు గోలపెట్టారు. ''పాకిస్తాన్ ఏర్పడడానికి మేం చేసిన త్యాగాలే కారణం. హిందువుల మధ్య వుంటూ, వారితో పోట్లాడుతూ సాధించి పెట్టాం. మీరైతే వున్న చోటే వున్నారు.'' అని వీరు వాదించేవారు. అప్పటి పశ్చిమ పాకిస్తాన్‌లో పంజాబీలు 55% మంది వుండేవారు కానీ వారిలో అధికాంశం గ్రామీణ ప్రాంతాల వారే. ఈ ముజాహిర్ల కున్న నైపుణ్యం వారికి లేదు. వారు వీరిని చూసి అసూయపడేవారు. వారి ప్రాధాన్యత తగ్గించాలని గోల పెట్టేవారు.
మొత్తానికి రాజధానిని కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు 1966 లో తరలించారు. దాదాపు అదే సమయంలో పరిశ్రమలు పెరుగుతున్న కరాచీకి పంజాబీలు, ఫక్తూన్లు తరలి రాసాగారు. ప్రభుత్వం స్థానికంగా వున్న సింధీలకు కాలేజీ ఎడ్మిషన్లలో, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు యివ్వసాగింది. వీటివలన తమ ఆధిక్యానికి గండి పడుతోందని, రిజర్వేషన్ల వలన తాము నష్టపోతున్నామని యిప్పటిదాకా ఆధిక్యంలో వున్న ముజాహిర్లు వ్యథ చెందారు. ఆ వ్యథకు ఒక స్పష్టమైన రూపం యిచ్చి, కార్యాచరణకు ప్రోత్సహించినవాడు అల్తాఫ్ హుస్సేన్. 63 ఏళ్ల క్రితం కరాచీలో పుట్టిన అల్తాఫ్ ఆగ్రా నుంచి తరలి వచ్చిన ముస్లిం కుటుంబానికి చెందినవాడు. కరాచీ యూనివర్శిటీలో చదువుతూండగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ''ఆల్ పాకిస్తాన్ ముజాహిర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్'' అని తన 25వ ఏట 1978లో ఒక సంస్థ పెట్టి ముజాహిర్ల హక్కుల కోసం పోరాడాడు. మరో ఆరేళ్లు పోయేసరికి దాన్ని రాజకీయ పక్షంగా మార్చాడు. ముజాహిర్ క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎమ్) పేర పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేయసాగాడు. 1997 వచ్చేసరికి ముజాహిర్ అంటే బొత్తిగా వాళ్లకోసమే అని తెలిసిపోతుందని ఎంక్యూఎమ్ పేరులో ఎం అంటే ముజాహిర్ కాదు, ముత్తహిదా (ఐక్య) అని ప్రకటించాడు. ఏం పేరు పెట్టుకున్నా ఆ పార్టీ ప్రభావం కరాచీకి, హైదరాబాదుకి పరిమితమైంది. సింధు ప్రాంతంలో స్థానిక సింధీల హక్కుల కోసం భుట్టో 1967లో స్థాపించిన పిపిపి (పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) అతి పెద్దది కాగా, రెండో స్థానం వీళ్లదే. దేశంలో చూసుకుంటే మొన్నటిదాకా దేశంలో మూడో పెద్ద పార్టీ కానీ ప్రస్తుతానికి నాలుగో పెద్ద పార్టీ.
అన్నిటి కంటె పెద్దది, పంజాబ్ కంచుకోటగా గల పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్). వీళ్లది రైటిస్టు, కన్సర్వేటివ్ పార్టీ. పాకిస్తాన్ ముస్లిం లీగ్ 1988లో జియా మరణం తర్వాత ముక్కలు కాగా నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని వర్గం 'పిఎంఎల్-ఎన్' పేరుతో రాజకీయాల్లో కొనసాగుతోంది. పంజాబ్‌తో బాటు బలోచ్‌స్తాన్ వంటి యితర ప్రాంతాల్లోను బలం వుండడం చేత 2013 ఎన్నికలలో దానికి 33% ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో వున్న పిపిపి సోషలిస్టు భావాలు గల పార్టీగా చెప్పుకుంటుంది. కానీ భుట్టో, అతని అల్లుడు జర్దారీ కుటుంబాల కనుసన్నల్లోనే నడుస్తుంది. దక్షిణ సింధులో, ఆక్రమిత కశ్మీరులో అధికారంలో వుంది. 2013లో 15% ఓట్లు తెచ్చుకుంది. మూడో పార్టీ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 1996లో స్థాపించిన పాకిస్తాన్ తెహరీక్-ఎ-ఇన్సాఫ్. ఇది సెంట్రిస్టు, సెక్యులర్ పార్టీ. విద్య, వైద్యం, ఉద్యోగవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అంటాడు. ఈ పార్టీకి 2013 ఎన్నికలలో 10% ఓట్లు వచ్చాయి. ఇక నాలుగో స్థానంలో వున్న ఎంక్యూఎమ్‌కి 5.4% ఓట్లు వచ్చాయి. తన పరిమితబలంతోనే ఎంక్యూఎమ్ 1988-90, 1990-92, 2002-2007, 2008-13 లలో నడిచిన సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామిగా వుంది. ప్రస్తుతం కరాచీ, హైదరాబాదు మేయర్లు యీ పార్టీవారే. ఇతర స్థానిక సంస్థల్లో కూడా వారిదే బలం.
పార్టీ సంగతి యిలా వున్నా పార్టీ వ్యవస్థాపకుడు అల్తాఫ్ మాత్రం పాతికేళ్లగా లండన్‌లో ప్రవాసిగా వుంటున్నాడు. ఎందుంటే అతని హింసా రాజకీయాలు అలా వుంటాయి. కరాచీని గుప్పిట్లో వుంచుకోవడానికై తన అనుచరుల చేత అరాచకాలు చేయించడానికి అతను వెనుకాడడు. 'మా అనుమతి లేనిదే యిక్కడ ఆకు కూడా అల్లాడదు' అని అతను చెప్పుకుంటాడు. లండన్ నుంచి ఒక్క ఫోను కొడితే చాలు అతని అనుచరులు నగరజీవనాన్ని స్తంభింపచేస్తారు. హింసను ప్రేరేపిస్తూ అల్తాఫ్ యిచ్చే ప్రసంగం టేపును అన్ని టీవీ ఛానెళ్లు ప్రదర్శించాల్సిందే, లేకపోతే వాటి ఆఫీసులు ధ్వంసం! అసలైన ఫాసిస్టు సేన అంటే వాళ్లదే. ఎదిరించినవాళ్లను భయకంపితులను చేస్తూన్నా ముజాహిర్ మూలాలున్న కార్మికులు, మధ్యతరగతి వారు, ఉన్నతవర్గాల వారూ ఆ పార్టీకి అండగా నిలిచారు. ఓట్ల వర్షాన్ని కురిపించారు. అది చూసి ప్రభుత్వం అల్తాఫ్‌పై చర్య తీసుకోవడానికి జంకింది. ఆ అలుసు తీసుకుని ప్రత్యర్థులను హత్య చేయడం, బెదిరించి డబ్బు లాగడం వంటివి మరీ తీవ్రం చేశాడతను. ఇక ప్రభుత్వం కేసులు మోపక తప్పలేదు. వాటిని తప్పించుకోవడానికి అతను లండన్ పారిపోయి రాజకీయ ఆశ్రయం కోరితే బ్రిటన్ ప్రభుత్వం 1992లో అనుమతి యిచ్చింది. అక్కడ వుంటూనే పర్వేజ్ ముషారఫ్‌తో పొత్తు పెట్టుకుని 1999-2007 మధ్య ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డాడు.
కానీ కరాచీకి దూరంగా వుండడం చేత, అనారోగ్యం పాలు కావడం చేత అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని ముజాహిర్లను విముఖుల్ని చేసుకున్నాడు. చాలాకాలంగా అపస్మారక స్థితిలో వుంటూ రావడం వలన మతిమాలిన నిర్ణయాలు తీసుకుని పార్టీని నష్టపరచాడని కొందరి అనుమానం. 2007 మేలో చీఫ్ జస్టిస్‌ను మళ్లీ నియమించాలంటూ లాయర్లు ఉద్యమించినపుడు వాళ్లకు కరాచీవాసులు అండగా నిలిచారు. అండగా నిలిచినవారిని అల్తాఫ్ మూకుమ్మడిగా హత్యలు చేయించాడు. దాన్ని ముజాహిర్లు సైతం అసహ్యించుకున్నారు. తన నిర్ణయాలను ప్రశ్నించిన పార్టీ అనుచరులను కూడా చంపించాడు. వాళ్లల్లో చాలామంది ఊళ్లు విడిచి పారిపోయారు. వీటికి తోడు అతనిపై పాకిస్తాన్‌లోను, బ్రిటన్‌లోను చాలా కేసులున్నాయి. తనకు కుడిభుజంగా వున్న ఇమ్రాన్ ఫారూఖ్‌ను చంపించాడన్న అభియోగాన్ని లండన్ పోలీసులు విచారిస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు 2013లో కేసు పెట్టి అరెస్టు చేశారు. అదే సమయంలో అతని యింట్లో మిలియన్ పౌండ్ల అక్రమధనం దొరికింది. 2014లో మనీ లాండరింగు (బ్లాక్ మనీని వైట్‌గా చేసే ప్రయత్నం) కేసూ పెట్టారు. అతని పార్టీకే చెందిన కరాచీ మేయరు, హైదరాబాదు మేయర్లు కూడా టెర్రరిజం కేసుల్లో యిరుక్కున్నారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంక్యూఎం పార్టీ ప్రజాప్రతినిథులు తమ పదవులకు రాజీనామా చేశారు.
కొద్దికాలంగా అల్తాఫ్ చావుబతుకుల్లో వున్నాడని కొందరు, అబ్బే చచ్చిపోయాడని, అతని స్థానంలో అదే పోలికలతో యింకోణ్ని కూర్చోబెట్టి, పాత వీడియో రికార్డులనే కొత్తగా విడుదల చేస్తున్నారని కొందరూ అనడంతో పార్టీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. తమపై కేసుల వలన ఉక్కిరిబిక్కిరైన ప్రథమశ్రేణి పార్టీ నాయకులు తప్పుకున్నారు. ద్వితీయశ్రేణి వారు వారి స్థానాల్లోకి వచ్చారు. మగవాళ్లపై దేశద్రోహం కేసులు వుండడం చేత సంస్థాగత వ్యవహారాలను మహిళలు చక్కబెడుతున్నారు. రాబోయే ఉపయెన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియలేదు. గతంలోలా డబ్బు పుట్టడం లేదు, కార్యకర్తలూ ముందుకు రావటం లేదు. ఈ ఏడాది మే నెలలో పార్టీ ఆవిర్భావోత్సవం జరిగే వేళ అదీ పరిస్థితి. ఆ సమయంలో కరాచీలోని జిన్నా గ్రౌండ్స్‌లో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఎంక్యూఎం డిప్యూటీ కన్వీనరు ఫరూఖ్ సత్తార్ ప్రసంగిస్తూండగా సడన్‌గా దీపాలు ఆరిపోయాయి. వెనక్కాల తెరపై లండన్‌లోని పార్టీ హెడాఫీస్ నుంచి లైవ్ రిలే వచ్చింది. పార్టీ నాయకులందరూ వున్న హాల్లోకి అల్తాఫ్ వచ్చాడు, అందర్నీ కౌగలించుకున్నాడు. కరాచీ అభిమానులను ఉద్దేశించి 'నేను చచ్చిపోయానని పుకార్లు వచ్చాయి. నా ఆరోగ్యం ఫస్ట్‌క్లాస్‌గా వుందని చెప్పలేను కానీ బతికే వున్నాను, మీతో మాట్లాడుతున్నాను.' అని ప్రసంగించాడు. అంతే కార్యకర్తల్లో ఉత్సాహం మిన్ను ముట్టింది. ఉపయెన్నికలలో పార్టీ విజయం సాధించింది.
అయిదు నెలల క్రితం అల్తాఫ్ పై చూపిన ఆ గుడ్‌విల్ యిప్పుడు లుప్తమై పోయింది. ఇటీవలి కాలంలో అల్తాఫ్ ఆరోగ్యం బాగా దెబ్బ తిందని వార్తలు రావడంతో కొందరు ధైర్యం చేసి వెనక్కి వచ్చి అల్తాఫ్‌కు వ్యతిరేకంగా మాట్లాడసాగారు. లండన్‌లోని ఎంక్యూఎం హెడాఫీసు భారతీయ గూఢచారి వ్యవస్థతో కలిసి పని చేస్తోందని పాక్ సైన్యం నమ్మి, ప్రచారం చేయడంతో అల్తాఫ్ 'రా' (ఇండియన్ గూఢచారి సంస్థ) ఏజంటని, హంతకుడని, దేశద్రోహి అని అనసాగారు. దీనికి తోడు ఆగస్టు 22న ప్రసంగిస్తూ అల్తాఫ్ పాక్ ప్రభుత్వ టెర్రరిస్టు అని, ప్రజా వ్యతిరేకి అని నిందించి, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశాడు. కొన్ని టీవీ స్టేషన్లపై దాడి చేయమని అనుచరులకు పిలుపు నిచ్చాడు. వాళ్లు దాడి చేశారు కూడా. ప్రభుత్వం పార్టీ కరాచీ ఆఫీసుపై దాడి చేసి మూసేసింది. నాయకుల యిళ్లు సోదా చేయసాగింది. బాధిత కార్యకర్తలు పాకిస్తాన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అల్తాఫ్‌కు ఎదురు తిరిగారు. 'దేశద్రోహి అల్తాఫ్‌కు మీరంతా ఎదురు తిరిగి, మీ పార్టీ రాజ్యాంగాన్ని సవరించి, అతని వీటో అధికారాన్ని తీసేయాలి' అంటూ జాతీయ స్థాయిలో సాధారణ ప్రజలు ఎంక్యూఎమ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ల పార్టీ జండాలపై అల్తాఫ్ పేరు వున్న భాగాన్ని కత్తిరించేస్తున్నారు. ఫరూఖ్ సత్తార్ తమ పార్టీ పేరు సవరించి చివర్లో పాకిస్తాన్ (ఎంక్యూఎమ్-పి) చేర్చి తమ పాక్‌భక్తిని చాటుకోవాలని చూస్తున్నాడు. ఆ పార్టీకి అల్తాఫ్ ఒక గుదిబండలా తోస్తున్నాడు. తమ పార్టీ వ్యవస్థాపకుడికి, తమకు యికపై సంబంధం లేదని చూపించుకోవడానికి ఫారూఖ్ ప్రయత్నిస్తున్నా అల్తాఫ్ ముద్ర లేని ఎంక్యూఎం మనగలుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
- ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)