ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. సుఖాల్లో తేలియాడినవారు కష్టాలొచ్చినప్పుడు కుంగిపోతుంటారు. పెద్ద పదవి అనుభవించి అది పోయినప్పుడు బాధపడుతుంటారు. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యాలు దెబ్బ తింటాయి. అందుకే ఏం జరిగినా మంచికేనని అనుకోవాలని అంటారు. ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది కలిగినా మళ్లీ సుఖపడే రోజులు రావొచ్చంటారు. మనసులో ఏ ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఓపిక పడితే ఏదోవిధంగా మంచి జరగొచ్చు. మనసులో ఏ ఫీలింగ్స్ (ఇగో) లేకుండా, ఓపిగ్గా ఉండి, తన పని తాను చేసుకుంటూపోయాడు కాబట్టే తమిళనాడులో అన్నాడీఎంకే మంత్రి, జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె శాఖల బాధ్యత తీసుకున్న ఓ.పన్నీర్ శెల్వం తాజాగా ముఖ్యమంత్రి అయ్యారు.
జయలలిత మరణంతో ఆయనకు ఈ యోగం పట్టింది. ఇతర రాష్ట్రాల్లో కంటే తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అందులోనూ స్వామిభక్తికి, వ్యక్తి పూజకు, అంతులేని వినయవిధేయతలకు ఆలవాలమైన ద్రవిడ పార్టీల్లో విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. పన్నీర్‌శెల్వంది కూడా విచిత్రమైన కథే. ఈయనలాంటి పరిస్థితి మన రాష్ట్రంలోని నాయకుడికైనా ఏర్పడినట్లయితే, ఆ నాయకుడు ఇగో ప్రాబ్లెమ్‌తో అహంకారంగా ఫీలైనట్లయితే అతని రాజకీయ జీవితం అంతమైవుండేది. పన్నీర్‌శెల్వం ఇందుకు భిన్నంగా ఉండబట్టే ఆయనకు పర్మినెంట్ సీఎం కావడానికి అవకాశం వచ్చింది.
ఆయన రాజకీయ జీవితంలో జరిగిన విచిత్రం ఏమిటి? గతంలో జయలలితకు ఏర్పడిన ఇబ్బందుల కారణంగా రెండుసార్లు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయ ఇబ్బందుల నుంచి బయటపడి సీఎం పదవి చేపట్టాక మళ్లీ ఆమె మంత్రివర్గంలోనే మంత్రిగా పనిచేశారు. ఆమె చనిపోయేంతవరకు ఆయన మంత్రిగానే ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రిగా (తాత్కాలికమే కావొచ్చు) పనిచేసిన నాయకుడు మళ్లీ మంత్రిగా పనిచేయడానికి ఇష్టపడడు. అత్యున్నత పదవి నిర్వహించిన తరువాత మంత్రి పదవి నిర్వహించడమంటే స్థాయి దిగజారినట్లే కదా.
మాజీ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇష్టపడతాడు తప్ప మంత్రి పదవి స్వీకరించడు. ఇగో అడ్డు వస్తుంది. 'సీఎంగా చేసిన నేను మంత్రిగా చేయడమా'...అనే ఫీలింగ్ కలుగుతుంది. పన్నీరుశెల్వం అలాంటి భావనతో ఉన్నట్లయితే లేదా జయలలిత మంత్రి పదవి ఇచ్చినప్పుడు సీఎంగా చేసిన తాను మంత్రి పదవి చేయనని అన్నట్లయితే ఆయన రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. అవిధేయతను సహించని జయలలిత పార్టీ నుంచి పంపించివుండేవారు. ముఖ్యమంత్రిగా చేసినా సరే మంత్రిగా చేయమంటే చేయాల్సిందే. అన్నాడీఎంకేలో అదే రూలు. ఆ రూలును పన్నీర్‌శెల్వం కాదనలేదు. ఈయన మొదటిసారి 2001 సెప్టెంబరులో ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పట్లో సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా జయలలిత పదవి నుంచి దిగిపోతూ తనకు అత్యంత విధేయుడైన పన్నీరు శెల్వంను ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆంక్షలు తొలగించడంతో 2002 మార్చిలో జయ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. గత ఏడాది అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా ప్రకటించి జైలు శిక్ష విధించడంతో 2014 సెప్టెంబరు 27న పన్నీరు శెల్వం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మూడు నెలల తరువాత ఉప ఎన్నికలో గెలిచి జయ ముఖ్యమంత్రి అయ్యారు. పన్నీరుశెల్వం మళ్లీ మంత్రిగా చేరారు.
ఆయన తనను తాను ఏనాడూ ముఖ్యమంత్రిగా భావించుకోలేదు కాబట్టి, మంత్రిగా పనిచేయడం చిన్నతనంగా భావించలేదు. సెప్టెంబరు 22న జయలలిత అనారోగ్యం పాలై సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మళ్లీ పన్నీరుశెల్వం తెరమీదికి వచ్చారు. పేరుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా అచేతనంగా ఉంది. 'రోజువారీ పాలనా వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయి' అని మంత్రులు, అధికారులు, పార్టీ నాయకులు మభ్యపెడుతున్నా ముఖ్యమంత్రి లేని లోటు, సర్కారు సక్రమంగా పనిచేయని వైనం స్పష్టంగా కనబడుతోంది. దీంతో ఎవరో ఒకరు పాలనా వ్యవహారాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రినో, తాత్కాలిక ముఖ్యమంత్రినో నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాని పన్నీర్‌శెల్వం సహా ఏ మంత్రి కూడా 'తాత్కాలిక ముఖ్యమంత్రి' అనే ముద్ర వేయించుకొని బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కారణం? జయలలిత భయం లేదా విధేయత. అందుకని తాత్కాలిక ముఖ్యమంత్రిని పెట్టాల్సిన అవసరమే లేదని మంత్రులు స్పష్టంగా చెప్పేశారు.
చివరకు 'తాత్కాలిక ముఖ్యమంత్రి' అనే ట్యాగ్ లేకుండా జయలలిత అధీనంలో ఉన్న శాఖలను ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీరుశెల్వంకు బదలాయించారు. చివరకు అధినేత్రి మరణంతో ఆయనకే పీఠం దక్కింది. ాని చంద్రబాబు అన్ని పనులు తానే మీదేసుకొని చేస్తుంటారు. 'తానొకడైనా తలకొక రూపై'...అన్నట్లుగా అన్ని చోట్లా తానే కనబడాలని, అన్ని పనులూ తానే చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇలాంటప్పుడు మంత్రులకు చేయడానికి పనెక్కడ ఉంటుంది? ఈ కోణంలో కూడా చంద్రబాబు ఆలోచిస్తే బాగుంటుంది.