కేసీఆర్‌.. ఈ అసహనం ఎవరిపైన.?

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ని 'గట్టిగా' ప్రశ్నించే శక్తి విపక్షాలకు లేదు. కాంగ్రెస్‌ పార్టీ గొంతు చించుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ నెత్తీనోరూ బాదుకుంటున్నా, బీజేపీ హడావిడి చేస్తున్నా.. టీఆర్‌ఎస్‌ని ఇబ్బంది పెట్టేంత 'స్ట్రాంగ్‌' పొజిషన్‌లో తెలంగాణలో ఏ పార్టీ లేదన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్‌, టీడీపీలెప్పుడో టీఆర్‌ఎస్‌ దెబ్బకి కుదేలయ్యాయి. ఆయా పార్టీల్లో 'ముఖ్య నేతలు' అనదగ్గవారెవరు.? అంటే, వేళ్ళ మీద లెక్కేసుకోవాలేమో.! 

అసలంటూ పార్టీ ఫిరాయింపుల్ని టీఆర్‌ఎస్‌ ప్రోత్సహించిందే విపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి. 'ప్రశ్నించే గొంతుక వుండకూడదు..' అన్న ఏకైక లక్ష్యంతో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన కేసీఆర్‌, ఆ విషయంలో నూటికి నూరుపాళ్ళూ విజయం సాధించారు. కానీ, ఎక్కడో 'అసహనం, అభద్రతాభావం' ఇంకా అలాగే కేసీఆర్‌ని వెంటాడుతున్నాయి. 

చాలా విషయాల్లో విపక్షాలు, అధికార పార్టీని నిలదీయలేక, న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తుండడం చూస్తూనే వున్నాం. ప్రజాస్వామ్యంలో 'న్యాయస్థానాన్ని ఆశ్రయించడం' అనేది ఓ ప్రాథమిక హక్కుగా చెప్పుకోవచ్చు. న్యాయస్థానానికి వెళ్ళడం న్యాయం కోసమే.! దురదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్‌కి, ఈ వాస్తవం అర్థం కావడంలేదు. చాలా సందర్భాల్లో న్యాయస్థానం దృష్టికి వెళ్ళిన కేసులు వీగిపోతాయి. అలాంటి సందర్భాల్లో పిటిషనర్లు న్యాయస్థానం నుంచి చీవాట్లు తినాల్సి వస్తుంది కూడా. 

న్యాయస్థానం పలు కేసుల్లో ప్రభుత్వాలకు ఝలక్‌ ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. అలా ఝలక్‌ తగిలిన ప్రతిసారీ, కేసీఆర్‌ విపక్షాల మీద విరుచుకుపడిపోతుంటారు. తెలంగాణ స్థానికత విషయంలో మొట్టికాయలు పడ్డాయి.. ఇరు రాష్ట్రాలకు సంబంధించి చాలా విషయాల్లో కేసీఆర్‌ సర్కార్‌ న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఊరట కలిగిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

విపక్షాలు కోర్టును ఆశ్రయించడమంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమట. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అలా ఎలా మాట్లాడలుగుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదాయె. ఎవరైనాసరే, ప్రతి విషయాన్నీ తన కళ్ళతోనే చూడాలని కేసీఆర్‌ అనుకోవడంలోనే వస్తోంది అసలు సమస్య అంతా. తెలంగాణలో ఇప్పటికిప్పుడు కేసీఆర్‌ని ఎదిరించే రాజకీయ పార్టీ ఏదీ లేదు. ఆ విషయం కేసీఆర్‌కీ తెలుసు. మరెందుకు ఈ అసహనం.? అభద్రతాభావం.? ఆయనకే తెలియాలి.

Show comments