వెంకయ్య మాటల ప్రవాహం ఆగిపోయిట్లేనా?

మన దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రాజ్యాంగపరమైన అత్యున్నత పదవులు. ప్రోటోకాల్‌లో ఈ రెండు పదవుల తరువాతే ప్రధాని, ఉప ప్రధాని (ఒకవేళ ఉంటే) వగైరాలు వస్తాయి. మొదటి అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవికి అందరూ ఊహించినట్లే రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు కలిగివుండి బీజేపీ నాయకుడైన కోవింద్‌ ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారనే సంగతి తెలిసిందే.

ఆ పదవికి ఎంపికైనందుకు రామ్‌నాథ్‌ కోవింద్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పదవి వస్తుందని ఆయన కలలో కూడా ఊహించివుండరు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో, బీజేపీలో పాపులర్‌ నాయకుడేమోగాని, దేశవ్యాప్తంగా పేరున్న నేత కాదు. కాకపోతే ఉత్తర భారతంలోని నాయకులకు బాగా తెలిసివుండొచ్చు. అంతగా ప్రాచుర్యం లేని కోవింద్‌ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యూహం కారణంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఊహించని అత్యున్నత పదవి దక్కడంతో కోవింద్‌ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం సహజం.

ఇక ఉపరాష్ట్రపతి పదవికి మోదీ-అమిత్‌ షా ద్వయం ఎంపిక చేసిన వెంకయ్యనాయుడు కూడా ఎన్నిక కావడం పెద్ద కష్టం కాదని రాజకీయ పరిశీలకులు మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా (మోదీ కంటే సీనియర్‌), వ్యూహకర్తగా, ట్రుబుల్‌ షూటర్‌గా (సమస్యల పరిష్కర్త), మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ) అనర్గళంగా నే కాదు, చమత్కారంగా మాట్లాడే వక్తగా... ఇన్ని విధాల వెంకయ్య దేశవ్యాప్తంగా పాపులర్‌.

వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవి ఆయనకు ఆభరణం కాదు. ఆయనే ఆ పదవికి ఆభరణమని చెప్పొచ్చు. మరొకరెవరైనా అయితే ఈ పదవి వచ్చినందుకు ఎగిరి గంతేసేవారు. కాని వెంకయ్య అయిష్టంగానే ఒప్పుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా కలిసి ఒప్పించారు. గతంలో ఎందరో ఉపరాష్ట్రపతులుగా చేశారు. వారి ఎంపిక ఎలా జరిగిందనేది పక్కకు పెడితే ప్రస్తుతం వెంకయ్య ఎంపికలో 'కుట్ర' ఉందనే అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. 

ఒక అత్యున్నత పదవికి ఓ నాయకుడిని ఎంపిక చేయడానికి ప్రత్యేక వ్యూహం పన్నాల్సిన అవసరం ఉందా? కుట్ర చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది. రాజ్యాంగ పదవుల వెనక కూడా కుట్ర వ్యూహాలు ఉంటాయని అర్థమవుతోంది. వెంకయ్య ఎంపికకు మోదీ ఇచ్చిన వివరణ సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వెంకయ్య రాజ్యసభను సజావుగా నడిపించగలుగుతారని, ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతారని మోదీ అన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి  ఎంపిక కావడంతోనే ఆయన బీజేపీకీ రాజీనామా చేశారు. ఇక నుంచి ఆయన అన్ని పార్టీలనూ సమానంగా చూడాలి. రాజ్యసభ ఛైర్మన్‌ సీట్లో కూర్చున్న తరువాత ప్రతిపక్షాలను ఎదుర్కోవడమంటూ ఏముంటుంది? 

సభను సజావుగా నడపడమంటే అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం. వెంకయ్యను ప్రధాని మోదీ 'సైలెన్స్‌ ప్లీజ్‌...ఆప్‌ బైటీయే' ఇలాంటి మాటలతో సభను అదుపు చేసే టీచరు పని అప్పగించారని ఓ విశ్లేషకుడు అన్నారు. నిజానికి వెంకయ్య ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే, వారికి దీటుగా సమాధానాలు చెప్పాలంటే రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ఉండాలి. కొందరు అభిప్రాయపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వెంకయ్యను బలి పెట్టినట్లయితే అంతకంటే అజ్ఞానం మరోటి ఉండదు. వెంకయ్యతో రాజకీయంగా విభేదించేవారు కూడా ఆయన ఉపన్యాసాలకు, ప్రాసలకు, చమత్కారాలకు అభిమానులు.

ఇకనుంచి ఆయన ప్రతిపక్షాలపై వ్యంగ్య బాణాలు వేసే అవకాశం, చమత్కారంగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటూ అలా మాట్లాడటం కుదరదు కదా. హుందాగా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరు కాబట్టి ఎక్కడా ఏమీ మాట్లాడకూడదు. ఎవ్వరి గురించి కామెంట్‌ చేయకూడదు.

ఒక్క మాటలో చెప్పాలంటే నోరు కట్టేసుకొని కూర్చోవాలి. అనర్గళంగా మాట్లాడే వెంకయ్యకు ఈ పరిస్థితి బాధాకరమే. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసిన ఈ నాయకుడి మాటల ప్రవాహం జోరుగా ఉండదు. నిజానికి రాజ్యాంగ పదవులు అత్యున్నతమైనవేగాని స్వేచ్ఛ ఇవ్వలేనివి. రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారికి స్వేచ్ఛ లేకపోవడం బాధాకరమే.

Show comments