తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వివాదం తీవ్రస్థాయిలో కుదిపేస్తోంది. ఇప్పటికే ముగ్గురు కీలక పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది.
దీని గురించి రాజకీయ నాయకులు ఎవ్వరూ పెదవి విప్పడం లేదు. పాత ప్రభుత్వాన్ని, ప్రత్యర్థులను ఆడిపోసుకునే ప్రయత్నం చేయడం లేదు. పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు వెల్లడించడం లాంటివి అంతగా లేదు. కానీ.. తమ పని తాము సైలెంట్ గా చేసుకుపోతున్నారు. వ్యవహారం మొత్తం భారాస ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. చుట్టిచుట్టి.. ఈ ట్యాపింగ్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడకు చుట్టుకుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ప్రణీత్ రావు అరెస్టుతో సంచలనం ప్రారంభం అయింది. ఆయనను అరెస్టు చేసి విచారించడం మొదలెట్టిన తర్వాత.. ఇప్పుడు మరో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మునుగోడు, దుబ్బాక, హూజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈ అధికారులే తమ వాహనాల్లోనే ఓటర్లకు పంచడానికి అక్రమంగా డబ్బు తరలించినట్టుగా కూడా పోలీసులు వారినుంచి వివరాలు రాబట్టారు. వీరి నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరో ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ రావు అరువెల లు రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దేశం దాటి వెళ్లిపోయినట్టుగా భావిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి అంతర్జాతీయంగా అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. ఆయన ఇంటికి సమీపంలోనే ప్రణీత్ రావు ఆఫీసు ఏర్పాటు చేసుకుని రేవంత్ తోపాటు, ఆయన తమ్ముళ్ల ఫోన్ కాల్స్ ను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు వారు విచారణలో చెప్పారు. ప్రభాకర్ రావు కూడా పోలీసుల చేజిక్కితే అప్పుడిక ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు.
ప్రభాకర్ రావు దొరికేదాకా మాత్రమే కేసీఆర్ సేఫ్ గా ఉంటారని, విదేశాలకు వెళ్లిపోయిన రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు ఎవరు దొరికినా గానీ.. అప్పుడు కేసీఆర్ పేరు కూడా బయటకు వస్తుందని అంచనాలు సాగుతున్నాయి. ఈ ట్యాపింగ్ వివాదంలో ఇంకా చాలా మలుపులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికి తేలుతుందో.. ఇంకా ఎన్ని పెద్దతలకాయల పాత్ర బయటకు వస్తుందో వేచిచూడాలి.