చంద్రబాబూ.. సాయమా.? వ్యాపారమా.?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐదు రోజులుగా చైనా పర్యటనలో వున్నారు. ఈ కారణంగా ఆయన సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. అఫ్‌కోర్స్‌, ఆయన గతంలోనే ఓ సారి సచివాలయాన్ని ప్రారంభించేశారనుకోండి.. అది వేరే విషయం. ఇక, చైనా పర్యటనలో బిజీగా వున్న చంద్రబాబు, అమరావతి నిర్మాణానికి సహకరించాలంటూ అక్కడి పారిశ్రామికవేత్తలకి, ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేసేస్తున్నారట. 

అదిగో అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నాం.. ఇదిగో ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నాం.. అక్కడ వేల కోట్లతో ప్రాజెక్టు.. ఇక్కడ వేల కోట్లతో ప్రాజెక్టు.. అంటూ ప్రభుత్వం నుంచి ఎడా పెడా ప్రకటనలు వచ్చేస్తున్నాయి. అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియా సంగతి సరే సరి. బుల్లెట్‌ రైలు నుంచి, పోర్టు ఆధారిత పరిశ్రమల దాకా.. చైనా, ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ని దత్తత తీసుకుంటోందా.? అనే రేంజ్‌లో ప్రచారమైతే జరుగుతోంది. 

కానీ, వాస్తవాలేంటి.? గతంలో చంద్రబాబు సర్కార్‌ కుదుర్చుకున్న ఒప్పందాల మాటేమిటి.? అని విపక్షాలు ప్రశ్నిస్తే, 'అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..' అంటూ ఎదురుదాడి కొనసాగిస్తోంది అధికార పార్టీ. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి ఎవరైనా. భారతదేశానికి, చైనా ఎప్పుడూ మిత్రదేశం కానే కాదు. మొన్నటికి మొన్న ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడ్డ విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అయినా, చైనాతో భారత్‌కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, అమరావతి అభివృద్ధిలో చైనా సహాయ సహకారాలు అందిస్తోందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘంటాపథంగా చెప్పేస్తోంటే నమ్మేదెలా.? 

ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానికి అనుకూల పరిస్థితులు చైనాకి కన్పిస్తే, ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవడానికి చైనా కంపెనీలు ముందుకు రావొచ్చు. ఆ వ్యాపారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి లబ్ది చేకూరుతుందా.? లేదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. ఓ పక్క సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసేసుకుని, ఇంకోపక్క చైనాతో సంప్రదింపులంటే, దానర్థం ఏమిటి.? ఈ ప్రశ్నకు చంద్రబాబే సమాధానం చెప్పాలి. 

చైనా నుంచి సహాయ సహకారాల్ని ఆశించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు. చంద్రబాబు మాత్రం, చంద్రోక్తులు చెబుతూనే వుటారు.. వినాల్సిందే.

Show comments