ఏడాదిలో ఎన్నికలు.. గోదావరి జిల్లాల్లో రసవత్తర చర్చ

చూస్తూ ఉండగానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది. మరో ఏడాదిలో ఎన్నికల ఫీవర్‌ ఆవహించే అవకాశాలుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలో దడ మొదలయ్యింది... 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనం అధికారాన్నిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిలచింది. అయితే 2019వ సంవత్సరంలో మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఇటీవల జరుగుతున్న ప్రచారం మేరకు ఆరునెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు స్పష్టమయ్యింది. అదే కనుక జరిగితే అంతకంటే 6నెలల ముందుగానే అంటే 2018 నుండే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్నట్టు స్పష్టం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలక జిల్లాలైన ఉభయ గోదావరిలో ఎన్నికల హడావుడి సమీపించినట్టేనని తేటతెల్లం అవుతోంది.

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల్లో ఓటరు నాడిని కొలమానంగా తీసుకోవడం అనవాయితీగా వస్తోంది. ఆ విధంగా ఉభయగోదావరి జిల్లాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకించి దృష్టి సారించడం, సెంట్‌మెంట్‌ జిల్లాలుగా భావించడం అనవాయితీగా వస్తోంది. ఇదిలావుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు బ్రహ్మరథం పట్టాయి.

తూర్పుగోదావరి జిల్లాల్లో 19 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట వైసీపీ విజయం సాధించగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అన్నిచోట్లా తెలుగుదేశం అభ్యర్ధులే విజయం సాధించడం వైసీపీకి శరాఘాతంగా మారింది. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని రీతిలో టీడీపీకి పశ్చిమ బ్రహ్మరథం పట్టింది.

అయితే ఇదే జిల్లా నుండి ప్రభుత్వ వ్యతిరేకత కూడా తొలిసారిగా ప్రారంభం కావడం గమనార్హం! తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిల్లాలో పట్టిసీమ ఎత్తపోతల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని గోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ఎత్తిపోతలను నిర్మించింది.

గోదావరి మిగులు జలాలను కృష్ణా జలాల్లో విలీనం చేసి, అక్కడి నుండి రాయలసీమకు మళ్ళించడం పట్టిసీమ ముఖ్య ఉద్దేశ్యం! అయితే తెలుగుదేశం పెద్దలు రాయలసీమలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీలకు నీటిని అందించేందుకే పట్టిసీమను నిర్మిస్తున్నారంటూ అప్పట్లో ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెట్టినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయలేదు! పైగా ఆ సమయంలో ఏ విధమైన ఎన్నికలు లేకపోవడం కూడా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వెనుకడుగు వేయకపోవడం మరో కారణం!

పట్టిసీమను కేవలం కమీషన్ల కోసం నిర్మించారంటూ పలువురు చంద్రబాబుపై అప్పట్లో ధ్వజమెత్తారు. మొత్తంమీద ఈ పరిణామంతో అధికార తెలుగుదేశం అపకీర్తిని మూటగట్టుకోగా, ప్రతిపక్ష వెసీపీ రాజకీయంగా మైలేజీ పెంచుకునేందుకు కృషి చేసింది. అయితే మళ్ళీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా 2018కి పూర్తి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలవరంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకుండా, మళ్ళీ మరో ఎత్తిపోతల పథకం ఎందుకు? వృథాఖర్చు తప్ప అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో గత మూడేళ్ళలో అధికార పార్టీ పమ్మెల్యేలు, పంపీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యారు తప్పితే ప్రజా సమస్యలపై కనీస స్థాయిలో స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మట్టి, మైనింగ్‌, ఇసుక, నీరు ఇలా అన్ని రంగాల్లో మాఫియాలుగా మారి, పంచభూతాలను సైతం అమ్మేసుకుంటున్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపట్టింది. అయితే సదరు మాఫియాల్లో వైసీపీకి చెందిన నేతలూ ఉండటంతో ఆ పార్టీకి కొన్నిచోట్ల అవరోధంగానే మారింది. ఇదిలావుంటే జాతీయ పార్టీ బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, తెలుగుదేశంతో పొత్తు ఉండదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోందని ఆ పార్టీ కేడర్‌ చెబుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అనేక ఫిరాయింపులుంటాయని, ఏ పార్టీలో ఎవరుంటారో కూడా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అధికార తెలుగుదేశంలో ఉన్న పలువురు కీలక నేతలు జనసేన లేక వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, మరికొందరు ప్రతిపక్ష నేతలు తెలుగుదేశంలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.

Show comments