వ్యూహకర్త భవిష్యత్తు 'వ్యూహం' ఏమిటి?

'కలకాలం ఒక రీతి గడవదు' అనే మాట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విషయంలో నిజమైంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి దోహదం చేసిన ప్రశాంత్‌, బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమి తరపున వ్యూహకర్తగా పనిచేసి నితీష్‌ కుమార్‌ సీఎం కావడానికి కృషి చేసిన ప్రశాంత్‌ తాజా యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు తరపున వ్యూహకర్తగా పనిచేసి ఓటమి భారంతో, అశాంతితో వెనుదిరిగారు. పార్లమెంటు, బిహార్‌ ఎన్నికల తరువాత 38 ఏళ్ల ప్రశాంత్‌ కిశోర్‌ పేరు దేశమంతా మారుమోగిపోయింది. మరోమాటలో చెప్పాలంటే మోదీ, నితీష్‌లతో సమంగా ఆయన కూడా హీరో అయిపోయారు. ఆయన హీరోయిజాన్ని ఉపయోగించుకొని యూపీలో హీరో కావాలని ఆశించిన కాంగ్రెసుకు తీవ్ర భంగపాటు కలగడమే కాకుండా ప్రశాంత్‌ కిశోర్‌ హీరోయిజం కూడా డ్యామేజ్‌ అయింది. సాధారణ ఎన్నికల్లో, బిహార్‌లో అఖండ విజయాల తరువాత అత్యంత ఘోర పరాజయం యూపీలో సంభవించింది. ఎవరైనా విజేతల గురించే తప్ప పరాజితుల గురించి మాట్లాడుకోరు కదా. అందుకే ప్రశాంత్‌ గురించి ఎవ్వరూ చెప్పుకోవడంలేదు. ప్రస్తుత చరిత్ర కావాలిగాని గత చరిత్ర ఎంతకాలం చెప్పుకుంటారు? 

వాస్తవం చెప్పాలంటే కాంగ్రెసు ఘోర పరాజయానికి ప్రశాంత్‌ ఎంతమాత్రం కారణం కాదు. ఆయన వ్యూహకర్తేగాని కాంగ్రెసు నాయకులు, గాంధీ కుటుంబం ఆయన్ని పనిచేయనిస్తే కదా...! బీజేపీకి, మహాకూటమికి వ్యూహకర్తగా ఉన్నప్పుడు  పనిచేసే అవకాశం దొరికింది కాబట్టి ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. కాంగ్రెసులో పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కాంగ్రెసును ఒంటరిగా గెలిపించాలనేది ప్రశాంత్‌ వ్యూహం. ఒంటరిగా పోటీ చేసి గెలవాలనేదే ఆ పార్టీ ఆలోచన కూడా. కాని తరువాత కాంగ్రెసు నాయకుల, గాంధీ కుటుంబీకుల ఆలోచనలు మారిపోయి సమాజ్‌వాదీతో పొత్తుకు దారితీసింది. ఈ సందర్భంలోనే ప్రశాంత్‌-కాంగ్రెసు నాయకుల మధ్య విభేదాలొచ్చాయి. అసలు ప్రశాంత్‌ను వ్యూహకర్తగా తీసుకోవడం కాంగ్రెసులోని ఓ వర్గానికి ఇష్టం లేదు. కాని సోనియా, రాహుల్‌ తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాకుండా ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, దీంతో పార్టీ దశ తిరిగే అవకాశం ఉంటుందని ప్రశాంత్‌ ప్రతిపాదించారు. కాని అది వర్కవుట్‌ కాలేదు.

ఎస్‌పితో పొత్తు కుదుర్చుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ములాయం సింగ్‌, అఖిలేష్‌ దగ్గరకు రాయబారిగా కాంగ్రెసు నాయకత్వం ప్రశాంత్‌నే పంపింది. అప్పట్లో పొత్తు ప్రతిపాదనకు అఖిలేష్‌  ఒప్పుకోలేదు. ఎస్‌పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించి హార్వర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్లను వ్యూహకర్తలుగా రంగంలోకి దింపే ప్రయత్నాలు చేశారు. అప్పుడు ప్రశాంత్‌ బిహార్‌ తరహా 'మహాఘట్‌ బంధన్‌' (మహా కూటమి) తయారుచేయాలనే ఉద్దేశంతో అజిత్‌ సింగ్‌ పార్టీ ఆర్‌ఎల్‌డీ, ఇతర చిన్నాచితక పార్టీలతో మంతనాలు జరిపారు. ఇంతలోనే ములాయం సింగ్‌-అఖిలేష్‌ మధ్య విభేదాలు రావడం, రచ్చరచ్చ కావడం, దీని మధ్యనే ఎస్‌పీ-కాంగ్రెసు పొత్తు కుదరడం జరిగిపోయాయి. ఈ పొత్తు కుదరక ముందునుంచే ప్రియాంక గాంధీని ప్రధాన ప్రచారకురాలిగా రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయించాలని ప్రశాంత్‌ ప్లాన్‌ చేశారు. చివరకు అదీ కాలేదు. ఎప్‌పీతో పొత్తు కుదిరాక కాంగ్రెసు పోటీ చేసే 150 నియోజకవర్గాల జాబితాను ప్రశాంత్‌ తయారుచేశారు.

కాని అఖిలేష్‌ అతి కష్టమ్మీద 105 సీట్లు కేటాయించారు. మధ్యలో రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు సీట్ల పంపకంపై అఖిలేష్‌తో ప్రియాంక గాంధీ ఒంటరిగా చర్చలు జరిపారు. రాహుల్‌ తిరిగొచ్చాక ఎంత ప్రయత్నించినా సీట్లు పెరగలేదు. 'ది బాయ్‌ వండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌'గా మీడియా ప్రశంసించిన ప్రశాంత్‌ ఫలితాల ముందురోజు వరకు కూడా కాంగ్రెసు-ఎస్పీ కూటమికి 190 సీట్లు, బీజేపీకి 150 కంటే తక్కువగా, బీఎస్పీకి 70 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కాని అంచనా దారుణంగా తప్పింది. పంజాబ్‌లో కాంగ్రెసు విజయం సాధించడంలో ప్రశాంత్‌ కృషి ఉన్నప్పటికీ అదంతా అమరీందర్‌ సింగ్‌ ఖాతాలోకి పోయింది. ఈ వ్యూహకర్త ఇంకా అశాంతిగానే ఉన్నారో, ప్రశాంతత చేకూర్చుకున్నారో తెలియదు. ఇక ఈయన తరువాతి వ్యూహం ఏమిటి? Readmore!

Show comments