బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ సరోగసీ ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం విదితమే. మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ కూడా అంతే. అయితే, కొత్తగా వీరేమీ సరోగసీ ద్వారా తండ్రులవలేదు. అంతకు ముందే తండ్రులయినా, కొత్తగా ఇంకోసారి సరోగసీ ద్వారా తండ్రులయ్యే అవకాశం పొందారంతే.
సరోగసి.. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న అంశమిది. సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే, అద్దెగర్భం. తల్లిదండ్రులయ్యే అవకాశం లేనివారికి వరప్రదాయని ఈ సరోగసీ. ఎక్కడ అవకాశం వుంటుందో, అక్కడ అనర్థం కూడా వుంటుందని పెద్దలు ఊరకనే అన్లేదు కదా. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నట్లే, పైత్యం కూడా కొత్త పుంతలు తొక్కేస్తోంది. పిల్లలు లేనివారే కాదు, వున్నవారు కూడా సరోగసీని ఆశ్రయిస్తున్నారిప్పుడు. ఎందుకు.? అంటే, 'నొప్పులు' భరించలేక.
అంత కష్టపడి పిల్లల్ని కనడమెందుకు, మన పిల్లల్నే అద్దెగర్భం ద్వారా తెచ్చుకోవచ్చు కదా.. అనే ఆలోచనకొచ్చేశారు చాలామంది. డబ్బులున్నోళ్ళలో చాలామంది ఈ నయా ట్రెండ్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో సెలబ్రిటీలే ఎక్కువ. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుండబద్దలుగొట్టేశారు. 'కొందరు సెలబ్రిటీలకు ఇద్దరు పిల్లలున్నా, ఇంకో బిడ్డ కోసం సరోగసీని ఆశ్రయిస్తున్నారు.. ఎందుకంటే, వారి భార్యలు కష్టపడటం వారికిష్టం లేదు..' అని సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
నిజం ఎప్పుడూ నిష్టూరమే. సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు బహుశా బాలీవుడ్‌లో 'ఖాన్స్' అయిన షారుక్‌ఖాన్, అమీర్‌ఖాన్ గురించే కావొచ్చు.. అన్నది చాలామంది వాదన. ఎందుకంటే, వారిద్దరే ఇద్దరు పిల్లలు వుండీ, మళ్ళీ కొత్తగా సరోగసీ ద్వారా తమ పిల్లల్ని కొనుక్కున్నారు. ఇంకా చాలామంది సెలబ్రిటీలున్నార్లెండి.. అందరికీ సుష్మా, చాలా గట్టిగానే చెంపదెబ్బ కొట్టినట్లయ్యింది.
ఇక, సరోగసీకి సంబంధించి కేంద్రం, తాజాగా కొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చింది. ఇకపై భారతీయులకు మాత్రమే సరోగసీ అందుబాటులో వుంటుంది. అది కూడా ఓ మహిళ ఓ సారి మాత్రమే సరోగసీకి అనుమతి పొందగలదు. 'కమర్షియల్ సరోగసీ'ని కేంద్రం పూర్తిగా నిషేధించింది. నిబంధనల్ని అతిక్రమిస్తే, 10 ఏళ్ళ జైలు శిక్ష, 10 లక్షల జరీమానా తప్పదు.
చివరగా: సరోగసీ పుణ్యమా అని దేశంలో చాలామంది మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయి. కటిక పేదరికంలో మగ్గుతున్నవారిని ఎంపిక చేసి, డబ్బు ఎరచూపి.. విదేశాల నుంచి వచ్చి మరీ, 'సరోగసీ' ద్వారా పిల్లల్ని పొందుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇది, దేశ సంస్కృతీ సంప్రదాయాల్నీ, దేశ ఔన్నత్యాన్నీ దెబ్బతీస్తోంది. సరోగసీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ఆహ్వానించదగ్గదే అయినా, ఇదెంతవరకు సమర్థవంతంగా అమలుచేయబడ్తుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.