ఒక పక్క స్మార్ట్ ఫోన్ లు బటానీల్లా అమ్ముతున్నారు మార్కెట్లలో. ప్రీగా జియో సిమ్ లు ఇస్తామంటుంటే జనం క్యూలో గంటలు గంటలు బారులు తీరుతున్నారు. మూడు వేల నుంచి ముఫై వేల వరకు వున్న స్మార్ట్ ఫోన్ల ను జనం, జస్ట్ ఏమీ కానట్లు కొంటున్నారు. ఇఎమ్ఐ ఫ్రీ అంటూ కూడా అమ్మేస్తున్నారు.
కుర్రాళ్ల దగ్గర నుంచి మధ్యతరగతి మహిళల వరకు ఒక్కొక్కరి దగ్గర బేసిక్ ఫోన్ లకు బదులు స్మార్ట్ ఫోన్ లే కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలా వుంటే, ఆంధ్ర ప్రభుత్వం ఓ మహత్తరమైన, గొప్ప నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, స్టూడెంట్లలో డిజిటల్ లిట్రసీ పెంచడం కోసం వారికి ఫ్రీగా స్మార్ట్ ఫోన్ లు ఇస్తుందట.
నవ్వాలో, బాధపడాలో తెలియడం లేదు. ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకున్న మన మంత్రి మండలి సభ్యులు వారికి నచ్చిన ఏదైనా పల్లెటూరికి వెళ్లమనండి. ఊళ్లో కుర్రాళ్లను అందరినీ సమావేశ పర్చి త్రీజీ అంటే ఏమిటి? ఏప్స్ అంటే ఏమిటి? వాళ్లు ఫోన్ లలో ఏమేం చేస్తున్నారు. అసలు గ్రామంలో ఎన్ని స్మార్ట్ ఫోన్ లు వున్నాయి? అన్నది సర్వే చేయమనండి. ద్రిగ్భాంతి చెందే నిజాలు బయటకు వస్తాయి. ఇవ్వాళ పల్లెల్లో త్రీజీ డేటాను ఏమీ కానట్లు వాడేస్తున్నారు. కుర్రాళ్ల దగ్గర చేటల్లాంటి స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తున్నాయన్న నిజాలు తెలుస్తాయి.
నిజాలు ఇలా వుంటే, మరి ప్రభుత్వం డిజిటల్ లిట్రసీ అంటూ స్మార్ట్ ఫోన్ లు ఫ్రీగా పంచాలని నిర్ణయించడం అంటే, ఎంత దుబారా అన్నది జనాలే అర్థం చేసుకోవచ్చు. అసలే దారుణంగా విభజించబఢిన రాష్ట్రం. నిధులు ఇవ్వమని పదేపదే కేంద్రాన్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి. అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వ్యవహారం. ఇలాంటి నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ లు ఫ్రీగా పంపిణీ చేయడం అంటే ఏమనుకోవాలి. ఇప్పుడు అస్మదీయులు ఎవరో ఈ కాంట్రాక్టు చేజిక్కుంచుకుంటారు.
మూడు వేల ఫోన్ అయిదువేలవుతుంది. లక్షలాది ఫోన్ ల ఆర్డరుతో అస్మదీయులు బాగుపడతారు. అప్పనంగా వచ్చిన ఫోన్ లను అందుకున్న జనం బాగానే వుంటారు. ఫోన్ లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ప్రభుత్వం నడిపే తెలుగుదేశానికి ఓట్లు రావచ్చు. కానీ రాష్ట్ర ఖజానపై మాత్రం మరి కన్ని కోట్ల భారాన్ని మోపి, మరింత అప్పు భారాన్ని పెంచుతాయి. అది మాత్రం ఖాయం.
మరోపక్క ఫ్రీ ఫోన్ లు అందుకుని, కుర్రాళ్లు అక్కరలేని డౌన్ లోడ్ లు, చెత్త విడియోలు, పసలేని వాట్సప్ మెసేజ్ లు చేసుకుంటూ, అదే డిజిటల్ లిట్రసీ అంటూ మురిసిపోతారు.