ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులను, మంత్రులను, ఉద్యోగులను మొదలైనవారిని భయపెట్టగలరేమోగాని దోమలను భయపెట్టగలరా? 'తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు' అన్నట్లుగా 'మిమ్మల్ని (దోమలను) రెండేళ్లలోగా సర్వనాశనం చేస్తాను. వంద శాతం దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను' అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన దోమ జాతి గజగజ వణికిపోయి కాళ్ల బేరానికి వస్తుందా? పాలకులు, నాయకులు తమ బుర్రలో ఏ ఆలోచన వస్తే అది మాట్లాడుతుంటారు. పరిస్థితిని అధ్యయనం చేయకుండా హామీలిస్తుంటారు.
వెనకాముందు చూసుకోకుండా తమ దగ్గర ఏదో మంత్రదండం ఉందన్న భావనతో 'ఇచ్చితిని పో' అని వరాలు ఇస్తుంటారు. ఆ తరువాత వాటిని నెరవేర్చలేక నానా తంటాలు పడతారు. నిలదీస్తే సాకులు చెబుతారు. హామీలు నెరవేర్చలేక ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తుంటారు. రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తా, జపాన్‌లా చేస్తా, ఇంకేదో దేశం మాదిరిగా చేస్తా...అంటూ ప్రచారం చేసుకుంటున్న బాబు అదే వాగ్ధాటిలో 'వంద శాతం దోమల్లేని రాష్ట్రంగా చేస్తా' అని గొప్పగా చెప్పారు. కాస్త కామన్‌సెన్స్ ఉన్నవారెవరైనా అది సాధ్యం కాదని చెప్పగలరు. ఇప్పుడు ఇదే మాట శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు చెప్పారని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
ఒకవేళ బాబు ఈ కథనం చదివితే ఇకనైనా పిచ్చి హామీలిచ్చి ప్రజలను మోసం చేయడం మానేయాలి. అసలు ఆంధ్రప్రదేశ్ వాతావరణమే దోమలు బాగా ఉత్పత్తి కావడానికి దోహదపడేదిగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రాష్ట్రం విపరీతమైన ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఉన్న రాష్ట్రం. ఇక్కడి వాతావరణంలో తేమ ఎక్కువ. నీరు, తేమ ఎక్కువ ఉన్న కారణంగా అనేక జాతుల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడెస్, అనాఫిలిస్, క్యూలెక్స్, ఏషియన్ టైగర్, ఎల్లో ఫీవర్....ఇంకా అనేక రకాల దోమలు పుడుతున్నాయి. దీంతో మలేరియా, డెంగ్యూ ఇతరత్రా వ్యాధులు ప్రబలుతున్నాయి.
ఈ దోమ జాతులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, పూర్తిగా నిర్మూలించే రసాయనాలుగాని, బ్యాక్టీరియాగాని ఇప్పటివరకు లేవని నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదు. సాధారణంగా మున్సిపల్, పంచాయతీ సిబ్బంది రొటీన్‌గా మురుగునీటి గుంటల్లో పిచ్‌కారీ చేసే రసాయనం, ఏవో కొన్ని పొడులు చల్లితే ,దోమల మందు ఫాగింగ్ చేస్తే దోమలు తోకముడుస్తాయని అనుకుంటున్నారు. దోమల ఉత్పత్తి స్థానాల్లో రెగ్యులర్‌గా కొన్ని మందులు చల్లి కొంతమేరకు నియంత్రించవచ్చుగాని వందశాతం లేకుండా చేయడం, భవిష్యత్తులో దోమలు ఉత్పత్తి కాకుండా చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా దోమల కారణంగా ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 14 వేల మలేరియా కేసులు, 900 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని సమాచారం. రోగులకు మెరుగైన వైద్యం అందించడం మినహా ఇతర మార్గమేదీ లేదు. చంద్రబాబు ఈమధ్య నాలుగైదు రోజులు 'దోమలపై దండయాత్ర' పేరుతో హడావుడి చేశారు. బడి పిల్లలతో ర్యాలీలు తీయించారు. దోమలపై పోరాడాలని వారితో నినాదాలు చేయించారు. దోమల నిర్మూలనపై అధికారులకు ఆదేశాలిచ్చారు. లక్ష్యాలు నిర్దేశించారు. బాబు స్వయంగా ర్యాలీల్లో పాల్గొని జనాలను ఉత్తేజితులను చేశారు. వారిలో చైతన్యం నింపారు.
ప్రతి ఇంట్లో దోమలపై చర్చ జరగాలని, ఆ జాతిపై అలుపెరుగని సమరం చేయాలని, అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని హితవు చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని, పట్టణాలు, పల్లెల్లో దోమల నివారణకు మందులు చల్లాలని ఆదేశించారు. శ్రీలంక 'దోమలు లేని దేశం' అని బాబుకు ఎవరో చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీలంకను దోమలు లేని దేశంగా ప్రకటించిందట. ఆ దేశంలో సాధ్యమైన పని ఏపీలో ఎందుకు కాదు? అని అనుకొని తాను కూడా ప్రతిజ్ఞ చేశారు.
అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జువాలజీ ప్రొఫెసర్ డి.ఇ.బాబు దీనిపై మాట్లాడుతూ శ్రీలంకలో సాధ్యమైంది కాబట్టి ఏపీలో సాధ్యమవుతుందనకోవడం పొరపాటన్నారు. ఆ దేశం కంటే ఏపీ పెద్దదని, అక్కడి వాతావరణం కంటే భిన్నమైన వాతావరణం ఇక్కడుందని చెప్పారు. విదేశీ మోజు ఎక్కువగా ఉన్న బాబుకు ఎప్పుడూ విదేశీ ఆలోచనలే తప్ప స్వదేశీ అధ్యయనం ఉండదు.