కేసీఆర్, చంద్రబాబు ప్లాన్‌కు మోడీ అడ్డుకట్ట

కడుపు నిండిన తర్వాత కూడా కక్కుర్తి పడితే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల్లో ఇప్పటికే తెలుగుదేశం, తెలంగాణ రాష్ర్ట సమితిలకు అవసరమైన దానికంటే ఎక్కువ మెజారిటీ ఉంది. అయిదేళ్లు సాఫీగా, హాయిగా పరిపాలన సాగించుకోవచ్చు. కాని పరిపాలనపై దష్టి కేంద్రీకరించకుండా అవతలి పార్టీని నాశనం చేయాలని, వాటిని విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నడం ఈ రెండు పార్టీల ప్రతిష్టను దెబ్బతీసింది. పెద్ద ఎత్తున అవతలి పార్టీలనుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. భారీ ఎత్తున వలసలకు ఆస్కారం కలిగించాయి. గులాబీ కండువ కానీ, పచ్చ కండువా కానీ కప్పించుకునే నేతలు లేని రోజులు కనపడడం లేదు. అయితే తమ పార్టీల్లో వచ్చిన వారికి ఈ రెండు పార్టీలు ఏ తాయిలం చూపిస్తున్నాయి? ఎలాగూ అసెంబ్లీ సీట్లు పెంచాలని పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పింది కనుక కొత్తగా చేరిన వారందరికీ సీట్లు ఇచ్చేస్తామని చంద్రబాబు, కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. ఈ హామీలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీ చుట్టూ, ప్రధాని, హోంమంత్రుల చుట్టూ తిరిగారు. 

కాని వారి కుట్రలను బీజేపీ నేతలు గమనించారు. సీట్లు పెంచితే అది కేసిఆర్, చంద్రబాబులేక ఉపయోగపడుతుందని, ఫిరాయింపు దారులను మరింత ప్రోత్సహిస్తుందని వారు గమనించారు. స్థానిక మీజేపీ నేత లక్ష్మణ్ పలుసార్లు ఈ విషయం కేంద్రం దష్టికి తీసుకువచ్చారు. దీనితో ఈ కేసీఆర్, చంద్రబాబు ప్లాన్‌లకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. 

పూర్వాపరాలలోకి వెళితే  తెలంగాణ అసెంబ్లీ బలాన్ని 119 నుంచి 153కు, ఆంధ్రా అసెంబ్లీ బలాన్ని 175 నుంచి 225కు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 వీలు కల్పించింది. సీట్లు పెంచడం అవసరమని 2013 నవంబర్ 26న అప్పటి శాసన సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు బిల్లును రూపొందించేందుకు ఏర్పర్చిన మంత్రుల బృందం (జీఓఎం)కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. చిన్న అసెంబ్లీలు ఉంటే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, ముఖ్యంగా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా  పోటీపడినప్పుడు ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందని మర్రి వాదించారు. 

ఆయన వాదనను అప్పట్లో కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సహా పలువురు జీవోఎం సభ్యులు సమర్థించారు. జార్కండ్‌లో కూడా అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నదని, వాటి సీట్లు పెంచాలని అప్పటికే వాదనలు వినిపిస్తున్నాయి. మర్రి శశిధర్ రెడ్డి ప్రతిపాదనపై జీఓఎం కూలంకషంగా చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన సూచనను అంగీకరిస్తూనే జీఓఎం ఒక షరతును కూడా జోడించింది. కనీసం 2031-32 వరకు అసెంబ్లీల సైజును స్తంభింపచేసిన రాజ్యాంగంలోని 170వ అధికరణకు అనుగుణంగా ఈ నిర్ణయం అమలు అవుతుందని తెలిపింది.  Readmore!

కాని అప్పటివరకూ వేచి చూడనక్కర్లేదని, రాజ్యాంగంలోని 3వ అధికరణ క్రింద ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేస్తే సరిపోతుందని, కేసీఆర్, చంద్రబాబు వాదనలు మొదలు పెట్టారు. వారి హడావిడికి కారణాలను కేంద్రం నిశితంగా పరిశీలించింది. కేవలం ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో అవలంబించిన రాజకీయ అవకాశవాదంగా బీజేపీ నేతలు గమనించారు.. అందుకే అడ్డుకట్ట వేశారు. జులై 27న పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ ఈ విషయం వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని, అలాంటి ప్రతిపాదన ఏమీ తమ ముందు లేదని ఆయన రాజ్యసభలో తెలుగుదేశం నేత దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. అయితే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయశాఖ సలహా కోరిన మాట నిజమేననని, న్యాయశాఖ అటార్నీ జనరల్‌ను సలహా కోరిందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా నియోజకవర్గాల పెంపు సాధ్యంకాదని అటార్నీ జనరల్ సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. దీనితో తెలుగుదేశం, టీఆర్‌ఎస్ వర్గాలు నీరుకారుపోయాయి. ఫిరాయింపు దారులు పునరాలోచనలో పడే పరిస్థితి ఏర్పడింది. ఇది రెండు పార్టీల్లో ముసలానికి దారితీయవచ్చు. 

నిజానికి రాజు తలిస్తే దెబ్బలకు కొదవరా అన్నట్లు గతంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసినప్పుడు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరం లేకుండా చర్యలు తీసుకున్న కేంద్రం ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తోంది? విద్యాసంస్థలకు సంబంధించి ఆర్టికల్ 371(డి)ని సవరించాల్సిందేనని అప్పుడు కూడా అటార్నీ జనరల్ సలహా ఇస్తే ఆర్టికల్ 3 క్రింద అలాంటి చర్య అవసరం లేదని అప్పటి కేంద్రమంత్రి చిదంబరం త్రోసిపుచ్చారు. దీనికి బీజేపీ కూడా అప్పుడు అంగీకరించింది. కాని ఇప్పుడేమి అడ్డువచ్చింది. 

నియోజకవర్గాల సంఖ్య పెంచితే రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది టీఆర్‌ఎస్, తెలుగుదేశంలేక ప్రయోజనం కలిగిస్తుందని బీజేపీ గ్రహించింది. నియోజకవర్గాల సంఖ్యను పెంచే విషయంలో ఆర్టికల్ 170 నుంచి మినహాయింపునిస్తున్నాం.. అని ఒక్క వాక్యాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేరిస్తే సరిపోతుంది. కాని మోడీకే ఆసక్తి లేనప్పుడు ఎవరేమన్నా ఏం లాభం? దీనితో ఫిరాయింపు దారులందరూ దాదాపు 18 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకూ వాళ్లు బతికి ఉంటారా? ఆ పార్టీలు బతికి ఉంటాయా? రాజెవరో, రెడ్డెవరో.. 

Show comments