జయలలిత అనారోగ్యం....కాంగ్రెసు రాజకీయం...!

'కాదేదీ కవితకనర్హం'...అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా 'కాదేదీ రాజకీయాలకనర్హం' అని కూడా చెప్పుకోవచ్చు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల...ఇవన్నీ కూడా కవిత్వానికి వస్తువులే అయినట్లుగా దేశంలో జరిగే ప్రతి ఘటన, రాజకీయ నాయకుల జీవితాల్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌ రాజకీయ ప్రయోజనాలకు దోహదం చేస్తుంది. సాధ్యమైనంతవరకు ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతారు. 

'అక్కరకు రాని చుట్టము' టైపులో ఎంతటివారినైనా వదిలేయడానికి వెనకాడరు. ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెసు రాజకీయం ఇలాగే ఉంది. ఓ పక్క ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండగానే మరో పక్క కాంగ్రెసు హైకమాండ్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం మొదలుపెట్టింది. అంటే ఇప్పటివరకు డీఎంకేతో అంటకాగిన హస్తం పార్టీ భవిష్యత్తులో అన్నాడీఎంతో స్నేహం చేయాలని కోరుకుంటోంది. అందుకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెన్నయ్‌ పర్యటన సంకేతం పంపింది. 

జయలలితను పరామర్శించడానికి రాహుల్‌ ఈమధ్య ఆగమేఘాల మీద చెన్నయ్‌ వచ్చారు. కాని షరా మామూలుగానే ఆయనకు జయ దర్శనం లభించలేదనుకోండి. డాక్టర్లు చెప్పింది విని వెళ్లిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇంత దూరం వచ్చిన యువరాజు మిత్రపక్షమైన డీఎంకే అధినేత కరుణానిధిని కలుసుకోకుండా వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోవడంలోనే 'రాజకీయం' ఉందని తెలుస్తోంది. ఈ రాజకీయం ఏమిటి? సింపుల్‌. డీఎంకేను వదిలేసి అన్నాడీఎంకేతో దోస్తీ చేయడం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలై దీర్ఘకాలం ఆస్పత్రిలో ఉంటే సామాన్యులు బాధపడతారు. కాని నాయకులు దాన్నుంచి రాజకీయ ప్రయోజనాలు పిండుకోవడానికి ఆలోచిస్తారు. 

ఆస్పత్రిలో ఉన్న జయకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో చూస్తూనే ఉన్నాం. అనారోగ్యం ఆమె ఇమేజ్‌ను మరింత పెంచింది. ఆమె ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక జనం ఆమెకు బ్రహ్మరథం పడతారు. ఈ నేపథ్యంలో ఆమెతో స్నేహం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెసు ఆలోచన. ఒకప్పుడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే-కాంగ్రెసు మధ్య సంబంధాల క్షీణత ఎప్పుడో మొదలైంది. 2013 నుంచి రెండు పార్టీల మధ్య దూరం పెరిగుతూ వచ్చింది. కరుణానిధిని రాహుల్‌ గాంధీ కలుసుకోకపోవడంపై డీఎంకే నాయకులు మండిపడుతున్నారు. 'రాహుల్‌ మర్యాదపూర్వక పర్యటన వెనుక రాజకీయ లెక్కలు దాగున్నాయి' అని ఓ డీఎంకే నాయకుడు వ్యాఖ్యానించారు. 

ఆయన కామెంటుకు తగ్గట్లే పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు (ఈయన ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకుడు) 'జయలలితతో మాకు ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి' అని వ్యాఖ్యానించారు. అంటే పుండు మీద కారం చల్లారన్నమాట. ఈ సందర్భంగా ఆయన గతాన్ని కూడా గుర్తు చేశారు. 1984లో ఎంజీఆర్‌ అనారోగ్యం పాలైనప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయన్ని పరామర్శించి చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు వైద్య సౌకర్యాలతో కూడిన విమానం ఏర్పాటు చేశారు. ఇందిర ఎంజీఆర్‌కు సహాయం చేయగా, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ ఎంజీఆర్‌ మరణం తరువాత రాజకీయంగా జయలలితకు మద్దతు ఇచ్చారు. 

ఎంజీఆర్‌ మరణం తరువాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే కాంగ్రెసు నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఇక రాహుల్‌ గాంధీని డీఎంకే నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన గతంలోనూ అన్నాడీఎంకే పట్ల చూపిన అభిమానాన్ని డీఎంకే పట్ల ఎన్నడూ చూపించలేదని, కరుణానిధిని ఏనాడూ పరామర్శించలేదని అంటున్నారు. ప్రస్తుత రాహుల్‌ పర్యటనతో తమ రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత ప్రమాదంలో పడ్డాయంటున్నారు. ఇక కాంగ్రెసు నాయకులు డీఎంకేను విమర్శిస్తూ ఆ పార్టీ ఏనాడూ తమను గౌరవించలేదని, ఎన్నికల్లో సీట్ల పంపకంలో అవమానించిందని చెబుతున్నారు. 

చెన్నయ్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 200 సీట్లకుగాను తమకు కేవలం 14 సీట్లు ఇచ్చిందని, మదురైలో 100కు ఎనిమిది సీట్లు, తిరుచ్చిలో 78కి మూడు, కోయంబత్తూరులో 17, ట్యూటికోరిన్లో 7, సేలంలో 5 సీట్లు ఇచ్చిందని, వెల్లూరులో అసలు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు డీఎంకేతో తెగదెంపులు చేసుకొని  అన్నాడీఎంకేతో చేతులు కలుపబోమని, కాని పరిణామాలు మారుతాయని అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు, డీఎంకే విడివిడిగా పోటీ చేయగా, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేశాయి. కాని డీఎంకే 41 సీట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు పార్టీల స్నేహబంధం ఎలా ఉంటుందో మరి....!

Show comments