ప్రతి మనిషి జీవితంలో బాల్యానికి అత్యంత ప్రాధాన్యం వుంటుంది. బాల్యం మధురమైంది. బాల్య జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతుంటాయి. అసలు బాల్యం అనేది లేకపోతే, జీవితం లేనట్టే. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలకి బాల్యం అంటే ఏంటో తెలియని పరిస్థితి. గ్రామీణ జీవితం విధ్వంసంతోనే మనిషి జీవన విధానంలో అనూహ్య మార్పులు. ఇప్పుడు 25 లేదా 30 ఏళ్ల లోపు పిల్లలకు బాల్య జీవితం కొద్దోగొప్పో మధుర స్మృతుల్ని మిగిల్చి వుంటుంది. అంతకు తక్కువ వయసున్న వారికి బాల్య జీవితం అడపాదడపా మాత్రమే గుర్తు వుంటుంది.
ఇక అంతకు తక్కువ వయసులో ఉన్న వారు ఏ మాత్రం బాల్యాన్ని ఆస్వాదిస్తున్నారో చెప్పలేని పరిస్థితి. బాల్యం అంటే గ్రామీణ ప్రాంతాల్లో గడపడమే. అవ్వాతాత, చిన్నాన్నపెదనాన్న, అత్తామామ, వారి పిల్లలు... ఇలా అనుబంధాలతో పెరగడం. అలాగే పల్లెల్లో ఈత సరదా తీర్చుకోవడం. ఈత నేర్చుకోవడానికి బావులకు వెళ్లిన జ్ఞాపకాల్ని తలచుకుంటే... ఇప్పటికీ మనం పిల్లలం అవుతాం.
ఈత నేర్చుకోడానికి ముందు మునగబేళ్లు కడుతుంటే, భయంతో ఏడుస్తూ, దూరంగా పరుగెత్తే సన్నివేశాల్ని గుర్తు చేసుకుంటే, అప్పుడు అలా చేశామా? అని మనలో మనమే నవ్వుకుంటాం. అలాగే పల్లెల్లో వేసవి కాలంలో తేనె లేపడాలు, తాటి ముంజలు కొట్టించుకుని తినడం, రకరకాల రుచికరమైన మామిడి పండ్లను తోటల నుంచి తెచ్చుకుని ఆవురావురమని తినడం... అబ్బో గతించిన రోజులే జీవితంలో గొప్పవనే ఫీలింగ్.
అలాగే పల్లెల్లో చిల్లాకట్టె, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటల్ని స్నేహితులతో కలిసి ఆడిన రోజులు జీవితాంతం నీడలా వెంటాడుతూనే వుంటాయి. రాత్రివేళ ఇళ్ల వద్ద ఆరుబయట చందమామ వెన్నెల్లో, మనసును జోకొట్టే చల్లని గాలిని శ్వాసిస్తూ నిద్రపోయిన రోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మరి ఇప్పుడు పిల్లలు పల్లెలకు వెళ్తున్నారా? అంటే ...చాలా తక్కువనే చెప్పాలి. సెలవుల్లో సైతం ఏదో ఒక కోచింగ్ పేరుతో పిల్లల్ని తల్లిదండ్రులు చావగొడుతున్నారు. తమకంటూ పుట్టిన వూరు, బంధువులు వున్నారని, వారితో పిల్లలు అనుబంధం పెంచుకునేలా చేయాలనే స్పృహ తల్లిదండ్రుల్లో కొరవడింది.
ఈత నేర్చుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళుతూ, గంటకు రేటు కడుతున్న పరిస్థితి. ప్రతి నిమిషాన్ని డబ్బుతో లెక్క కడుతూ భయం భయంగా గడపడమే తప్ప, ఆస్వాదించే ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు. అలాగే పట్టణాలు, నగరాల్లో జీవిస్తూ, ఆకాశం, నక్షత్రాలు, చందమామ వెన్నెల, చెట్ల నుంచి వీచే చల్లని గాలిని శ్వాసిస్తూ, బాల్యాన్ని ఆస్వాదించే భాగ్యం ఇప్పటి పిల్లలకు ఎంత మందికి ఉంది?
ఎంతసేపూ ఇంట్లో ఏసీ గదుల్లో గడపడమే తప్ప, ప్రకృతి ఒడిలో సేదదీరే అవకాశమే లేకుండా పోతోంది. గ్రామీణ క్రీడలంటే ఏంటో కూడా పిల్లలకి తెలియని పరిస్థితి. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా పోటీ ప్రపంచంతో పాటు పరుగు తీసే క్రమంలో పిల్లలకు బాల్యం కరువవుతోంది. తాము ఏదో కోల్పోతున్నామనే ఆలోచన మొదలైతేనే సమస్య. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకపోతే ఎలాంటి ఇబ్బంది వుండదు. బహుశా ఇప్పటి పిల్లలు ఆ దశలో ఉన్నారని అనుకోవాలేమో. భవిష్యత్ కాలం మరింత దుర్మార్గంగా ఉండే అవకాశాలున్నాయి. అందుకే గతించిన కాలమే గొప్పదని పెద్దలు ఊరికే చెప్పలేదు.