మ‌హారాష్ట్ర రాజ‌కీయం.. మంచి రంజు మీద‌కు!

దేశంలో రాజ‌కీయ వినోదాన్ని పంచే రాజ‌కీయంలో మ‌హారాష్ట్ర కూడా ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. అక్క‌డి రాజ‌కీయం గురించి అక్క‌డి ప్ర‌జ‌లేమ‌నుకుంటారో కానీ, మహారాష్ట్ర రాజ‌కీయం ఎప్పుడూ మీడియాకు పైసా వ‌సూల్ గా వ్యూయ‌ర్ షిప్ ను అందిస్తూ ఉంటుంది. దేశ ఆర్థిక, వాణిజ్య రాజ‌ధాని అన‌ద‌గ్గ ముంబై ప‌ట్టు కోసం రాజ‌కీయ పార్టీలు కూడా శ‌త‌థా ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక పార్టీ ప‌ట్ట పూర్తి స్థాయిలో కొమ్ము కాయ‌ని నైజం మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ది!

ఉత్త‌రాదిన బ‌లంగా వీచిన మోడీ గాలుల్లో కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ కాంగ్రెస్ కు, స్థానిక పార్టీ ఎన్సీపీకి మ‌రీ అన్యాయం చేయ‌లేదు మ‌రాఠాలు! అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కు మూడో వంతు సీట్ల‌నైనా ఇస్తూ వ‌చ్చారు! ఇక శివ‌సేన సాయంతో మ‌హారాష్ట్ర‌లో పాగా వేసిన బీజేపీ.. శివ‌సేన‌ను చీల్చే వ‌ర‌కూ వ‌చ్చింది! ఇప్పుడు అందుకు ప‌ర్య‌వ‌స‌నాల‌న్నింటినీ క‌మ‌లం పార్టీ ఎదుర్కొంటున్న‌ట్టుగా ఉంది!

ఇటీవ‌లి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి గ‌ట్టి ఝ‌ల‌క్ త‌గిలింది. శివ‌సేన షిండే వ‌ర్గం, ఎన్సీపీ అజిత్ ప‌వార్ వ‌ర్గంతో పొత్తుల‌తో 28 లోక్ స‌భ సీట్ల‌కు పోటీ చేసిన బీజేపీ కేవ‌లం తొమ్మిందింట మాత్ర‌మే నెగ్గింది! ఇది బీజేపీకి దారుణ ప‌రాజ‌య‌మే! ఒంట‌రిగా పోటీ చేసి ఆ మాత్రం నెగ్గి ఉన్నా గొప్ప‌దే కానీ, అస‌లు శివ‌సేన షిండేదే అని కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేత, కోర్టుల చేత చెప్పించినా బీజేపీకి పెద్ద ప్ర‌యోజ‌నం మాత్రం ద‌క్క‌లేదు! బీజేపీ  క‌నీసం పోటీ చేసిన సీట్ల‌లో మూడో వంతు చోట్ల కూడా నెగ్గ‌లేదు. అయితే షిండే వ‌ర్గం స‌త్తా చాటింది.

షిండే పార్టీ పోటీ చేసిన 15 సీట్ల‌లో ఏడు చోట్ల నెగ్గింది! ఇలా బీజేపీ క‌న్నా చీలిపోయిన శివ‌సేన స్ట్రైక్ రేటు మెరుగ్గా ఉంది. ఇక అజిత్ ప‌వార్ వ‌ర్గానికి నాలుగో చోట్ల పోటీకి అవ‌కాశం ఇచ్చింది బీజేపీ. అయితే ఆ ఎన్సీపీని మ‌రాఠాలు పూర్తి స్థాయిలో తిర‌స్క‌రించారు, ఇప్పుడు అజిత్ ప‌వార్ వ‌ర్గం బీజేపీపై ఫైర్ అవుతోంది. ఇక ఏడు ఎంపీ సీట్ల‌లో నెగ్గ‌డం ద్వారా షిండే ఎన్నిక‌ల వ‌ర‌కూ త‌న సీఎం ప‌ద‌విని ప‌దిల ప‌రుచుకున్నాడు. ఇప్ప‌టిక‌ప్పుడు అయితే షిండేను బీజేపీ దించ‌లేదు. ఎన్నిక‌ల వ‌ర‌కూ ఆయ‌ననే కొన‌సాగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బీజేపీ ఉంది. Readmore!

ఇక అస‌లు రాజ‌కీయం ఇప్పుడు అక్క‌డ మొద‌ల‌వుతోంది. త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో.. బీజేపీ కూట‌మిలో అప్పుడే సీట్ల కొట్లాట కూడా మొద‌ల‌వుతోంది. త‌మ‌కు క‌నీసం 100 సీట్ల‌లో పోటీకి అవకాశం ఇవ్వాల‌ని షిండే వ‌ర్గం వాదిస్తూ ఉంది. 288 అసెంబ్లీ సీట్లున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో క‌నీసం వంద చోట్ల పోటీ తాము చేస్తామ‌ని షిండే వ‌ర్గం వాదిస్తోంది. మ‌రి అన్ని సీట్లు ఆ పార్టీకే ఇస్తే.. అజిత్ ప‌వార్ వ‌ర్గం కూడా కొన్ని అసెంబ్లీ సీట్ల‌ను కోర‌వ‌చ్చు. క‌నీసం ఆ పార్టీ 40 అసెంబ్లీ టికెట్ల వ‌ర‌కూ డిమాండ్ చేసే అవ‌కాశం ఉంది. మ‌రి వారికి అన్ని సీట్ల‌ను కేటాయించి బీజేపీ స‌గం చోట్ల మాత్ర‌మే పోటీ చేసి ఏ మేర‌కు రాజ‌కీయం చేయ‌గ‌ల‌ద‌నేది శేష ప్ర‌శ్న‌!

అయితే.. అజిత్ ప‌వార్ ఎన్నిక‌ల వ‌ర‌కూ క‌మ‌లం పార్టీ వెంట ఉంటాడా, లేక ముందే చేతులెత్తేస్తాడా అనేది కూడా ఆస‌క్తిదాయ‌క‌మైన ప‌రిణామ‌మే! తిరుగుబాటు చేసిన‌నాడు ఉన్నంత ఊపు ఇప్పుడు అజిత్ లో క‌నిపించ‌డం లేదు. త‌న పెద‌నాన్నపై తిరుగుబాటు జెండా ఎగ‌రేసినంత ఈజీగా అజిత్ త‌న పార్టీని ప‌దిల‌ప‌రుచుకోలేక‌పోయాడు. బీజేపీ మ‌ద్ద‌తు ఉన్నా నిల‌దొక్కుకోలేకపోయాడ‌ని స్ప‌ష్టం అవుతోంది. అజిత్ ను ప‌క్క‌న పెట్ట‌డం ఇప్పుడు బీజేపీకి కూడా పెద్ద క‌ష్టం కాదు! క‌ష్ట‌మో న‌ష్ట‌మో షిండే కూట‌మి వ‌ర‌కే పొత్తుకు ప‌రిమితం అయ్యి బీజేపీ త‌న ల‌క్ ను ప‌రీక్షించుకోవ‌చ్చు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో!

అయితే ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం ఏమిటంటే.. లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కూ బీజేపీకి, దాని మిత్ర‌ప‌క్షాల‌కూ మోడీ ఫ్యాక్ట‌ర్ ఎంతో కొంత క‌లిసి వ‌చ్చి ఉండ‌వ‌చ్చు! మోడీని ప్ర‌ధానిగా కోరుకుంటూ ఓటేసిన వాళ్లు రేపు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ కూట‌మిని స‌హిస్తార‌నే న‌మ్మ‌కం ఏమీ లేదు! షిండే మొహాన్ని, ఫ‌డ్న‌వీస్ మొహాన్ని భ‌రిస్తూ ఓటేసేవారెంత మంది అనేది బీజేపీ కూట‌మిని క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశం. త‌మ ప్రత్య‌ర్థి పార్టీల‌ను చీల్చి చెండాడి.. ఎలాగోలా కూట‌మిని ఏర్పాటు చేసి ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించినంత ఈజీ కాదు రేపు మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డం! గుర్తుల్లేకుండా చేసి, త‌మ మాట విన‌ని రాజ‌కీయ నేత‌ల‌ను తెర‌మ‌రుగు చేయాల‌నే వ్యూహాల‌తో బీజేపీ  మ‌హారాష్ట్ర‌లో చాలా చేసింది! అందుకు ఫ‌లితాలు లోక్ స‌భ ఎన్నిక‌ల‌తోనే ఆ పార్టీకి గ‌ట్టిగా చూపించారు జ‌నాలు.

షిండేనైనా క్ష‌మించారేమో కానీ, బీజేపీని మాత్రం గ‌ట్టిగా తిర‌స్క‌రించారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనే బీజేపీ స్ట్రైక్ రేటు 30 శాతం లేదు! మోడీ ఫ్యాక్ట‌ర్ తో వ‌చ్చిన సీట్లే మూడో వంతు. అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో  ఇది ఏ స్థాయికి ప‌డిపోతుంద‌నే చ‌ర్చ ఇప్పుడు జ‌రుగుతూ ఉంది. దీంతో షిండే వ‌ర్గం కూడా ముందుగానే గ‌ళం విప్పి వీలైన‌న్ని సీట్ల త‌మ‌కే కావాల‌నే డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఉద్ధ‌వ్ నే భ‌రించ‌ని బీజేపీకి ఇప్పుడు షిండే వ‌ర్గం మాట‌లు చికాకును తెప్పిస్తూ ఉండ‌వ‌చ్చు కూడా! అయితే.. అప్పుడు ఉద్ధ‌వ్ ను స‌హించ‌ని ఫ‌లితానికి ఇప్పుడు షిండేను భ‌రించాల్సిందే అంత‌కు మించిన గ‌త్యంత‌రం క‌మ‌లం పార్టీకి లేన‌ట్టుగా ఉంది కూడా!

Show comments