తెదేపా వి పుండుమీద కారంరాసే ప్రయత్నాలు!

మాచర్ల నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం ఏ స్థాయిలో రగులుతున్నదో అందరికీ తెలుసు. పోలింగ్ అనంతర సంఘటనల్లో ఇరు పార్టీల మధ్య పాతకక్షలన్నీ తిరగతోడుకున్నట్టుగా ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు అతికష్టమ్మీద మాచర్లలో సాధారణ పరిస్థితులు తీసుకువస్తున్నారు.

పల్నాడు మొత్తం 144 సెక్షన్ విధించారు. ఏ నలుగురూ కలిసి గుంపుగా వీధుల్లోకే రావొద్దంటూ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మాచర్ల అధ్యయన కమిటీ అంటూ తెలుగుదేశం తరఫున ఒక బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వెళతాం అంటూ బయల్దేరడం.. ఖచ్చితంగా కవ్వింపు చర్య అనిపించుకుంటుంది.

కారణాలు కేవలం ఎన్నికలే కాకపోవచ్చు. ఆ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న పరస్పర కక్షలు, పగలు అన్నీ కలిపి.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో తిరిగి పెట్రేగి ఉండవచ్చు. మొత్తానికి రెండు వర్గాల మధ్య చాలా తీవ్రమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి. జరుగుతున్నవి ఘర్షణలు. కానీ రెండు వర్గాలకు చెందిన వారు, వారి తాలూకు మీడియా సంస్థలు తమ మీద జరుగుతున్న దాడులుగా వాటిని అభివర్ణించుకుంటూ వెళుతున్నాయి.

వైసీపీ మీద తెలుగుదేశం వారు దాడిచేస్తున్నారని, వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అదే సమయంలో తమ పార్టీ వారి మీద దాడులు చేస్తున్నారని హత్యాయత్నాలకు ఒడిగడుతున్నారని తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తున్నది. పరస్పర ఆరోపణల మద్య ఆ ప్రాంతంలో శాంతి సుహృద్భావ వాతావరణం నెలకొనాలంటే అన్ని పార్టీల వారు సహకరించడం చాలా అవసరం. Readmore!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఇప్పటికే ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు తెలుగుదేశం వారు కూడా దానికి తగినట్టుగానే స్పందిస్తే తప్ప వాతావరణం చల్లబడడం జరగదు. తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులతో దాడులకు గురైన తమ పార్టీ వారిని పరామర్శించడానికి ఒక కమిటీ ఏర్పాటుచేసింది. అందులో కొల్లు రవీంద్ర లాంటి వారితో పాటు జూలకంటి బ్రహ్మారెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. వారు పరామర్శలే చేస్తారా? లేదా దాడులకు గురైన వారిని కలిసి మరింతగా రెచ్చగొడతారా? అనేది ఒక అనుమానం.

ఇదిలా ఉండగానే.. మాచర్లకు అధ్యయన కమిటీ పేరిట మరో బృందాన్ని పంపడానికి తెలుగుదేశం సాహసిస్తోంది. రావణకాష్టంలా రగులుతున్నప్పుడు మరింతగా అగ్గి ఎగదోసే ప్రయత్నంగానే ఇది కనిపిస్తోంది. కానీ.. ఈ అధ్యయన కమిటీ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెదేపా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు తమ శక్తివంచన లేకుండా ఘర్షణల్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, తెదేపా చర్యలే.. మరింత రచ్చ జరగాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి.

Show comments