ఫ్యాన్స్ మధ్య చీలిక తెచ్చిన పవన్ సినిమా

పవన్ కల్యాణ్ విషయంలో అతడి ఫ్యాన్స్ ఎప్పుడూ ఒకే తాటిపై ఉంటారు. రాజకీయాలైనా, సినిమాలైనా అభిమాన గణం ఎప్పుడూ పవన్ వెంటే ఉంటుంది. కానీ సరిగ్గా ఎన్నికల వేళ, పవన్ కల్యాణ్ అభిమానులు రెండుగా చీలిపోయారు. దీనికి కారణం పవన్ సినిమానే.

ఉరుము లేని పిడుగులా పవన్ కల్యాణ్ సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. వకీల్ సాబ్ సినిమాను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న రీ-రిలీజ్ చేయబోతున్నారనేది ఆ ప్రకటన. తమ ఫేవరెట్ హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే, ఏ అభిమానికైనా సంతోషమే. పవన్ ఫ్యాన్స్ కూడా అలానే సంబరపడ్డారు. కానీ కొంతమంది మాత్రమే.

పవన్ ఇప్పుడు రాజకీయ రణరంగంలో ఉన్నాడు. పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టిపెట్టాడు. ఈ ఎన్నికల్లో అతడు తప్పనిసరిగా గెలిచి తీరాలి. ఇప్పుడు మిస్సయితే మరో ఐదేళ్ల వరకు ఛాన్స్ ఉండదు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అతడి అభిమానులు కూడా వెన్నంటే ఉన్నారు.

ఇలాంటి టైమ్ లో వకీల్ సాబ్ రీ-రిలీజ్ చేస్తే చాలామంది ఫ్యాన్స్ దృష్టి ఆ సినిమా వైపు మళ్లుతుంది. ప్రచారం మానేసి మరీ, థియేటర్లకు క్యూ కడతారు అభిమానులు. అది కొంతమంది ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. అందరూ పవన్ ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని వాళ్లు కోరుతున్నారు.

మరికొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం తమకు వకీల్ సాబ్ రీ-రిలీజ్ కావాలంటున్నారు. పవన్ సినిమా థియేటర్లలోకి వచ్చి చాన్నాళ్లయిందని, వకీల్ సాబ్ రీ-రిలీజ్ ను సెలబ్రేట్ చేస్తామంటున్నారు. ఇలా ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఓవైపు ఇలా ఫ్యాన్ వార్ నడుస్తుంటే, అటు మేకర్స్ మాత్రం దీంతో సంబంధం లేకుండా వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.

Show comments

Related Stories :