బావ‌ను ఓడించేందుకు వైసీపీలోకి మ‌ర‌ద‌లు!

త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను అడ్డుకున్న మాజీ మంత్రి, ప‌ల‌మ‌నేరు టీడీపీ అభ్య‌ర్థి ఎన్‌.అమ‌ర్నాథ్‌రెడ్డిపై ప్ర‌తీకారం తీర్చుకోడానికి టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఎన్‌.అనీషారెడ్డి త‌న భ‌ర్త శ్రీ‌నాథ్‌రెడ్డితో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారు. ఈ నెల 25న సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వారిని ఒప్పించారు. గ‌త ఎన్నిక‌ల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అనీషారెడ్డి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

అనీషారెడ్డి స్వ‌స్థ‌లం ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాయ‌చోటి. రాజ‌కీయాల్లో చురుగ్గా మెలిగేవారు. గ‌త ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అనీషారెడ్డి ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత మూడు నెల‌ల‌కే ఆమెను ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. దీంతో ఆమె మ‌న‌స్తాపం చెందారు. పీలేరు టీడీపీ అభ్య‌ర్థి న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి త‌న అనుయాయుడైన చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి అలియాస్ చ‌ల్లా బాబును పుంగ‌నూరు ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి కూడా ఆమెను కొన‌సాగించడానికి ఆస‌క్తి చూప‌లేదు. ఒక ద‌శ‌లో ప‌ల‌మ‌నేరుకు అనిషారెడ్డి, పుంగనూరుకు అమ‌ర్నాథ్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా నియ‌మిస్తే, రెండుచోట్ల టీడీపీ బ‌ల‌ప‌డుతుంద‌నే నివేదిక‌లు చంద్ర‌బాబుకు వెళ్లాయి. ఈ విష‌యం తెలిసి అమ‌ర్నాథ్‌రెడ్డి మ‌రింత‌గా అనీషారెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించారు. ఈ నేప‌థ్యంలో అనీషారెడ్డి, ఆమె భ‌ర్త శ్రీ‌నాథ్‌రెడ్డి క్ర‌మంగా టీడీపీకి దూర‌మ‌వుతూ వ‌చ్చారు.

ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిథున్‌రెడ్డి క‌లిసి మ‌ద‌న‌ప‌ల్లెలో నివాసం వుంటున్న అనీషారెడ్డి ఇంటికి వెళ్లారు. మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే, త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని హామీ ఇచ్చి, వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో వైసీపీలో చేర‌డానికి వారు స‌మ్మ‌తించారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ వైసీపీలో చేరితే... ప‌ల‌మ‌నేరు, పుంగ‌నూరుల‌లో అధికార పార్టీకి లాభమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రీ ముఖ్యంగా ప‌ల‌మ‌నేరులో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. 

Show comments

Related Stories :