ఎన్నిక‌ల సంఘం దృష్టికి.. ప‌వ‌న్ పెళ్లిళ్ల గోల‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే మాట్లాడ్డం విమ‌ర్శ‌లు దారి తీసింది. తాజాగా ఈ విష‌యం ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు వ‌ర‌కూ వెళ్లింది. ఈ నెల 16న భీమ‌వ‌రంలో సీఎం జ‌గ‌న్ త‌మ నాయకుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అదికారి ముకేష్‌కుమార్ మీనాకు జ‌న‌సేన నాయ‌కులు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌వ‌న్ పెళ్లిళ్లను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల మార్పుతో ముడిపెట్టి జ‌గ‌న్ ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే సీఎం జ‌గ‌న్ ఎక్క‌డా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరును నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ద‌త్త పుత్రుడంటూ ప‌వ‌న్‌ను జ‌గ‌న్ దెప్పి పొడుస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు జ‌గ‌న్ విమ‌ర్శ‌ల్ని త‌మ నాయకుడికి సంబంధించిన‌విగా భావించి ఆవేద‌న చెందుతున్నారు.

ప‌దేప‌దే పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నార‌ని జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నారు. మూడు కాకుంటే, 30 పెళ్లిళ్లు వైసీపీ నేత‌లు చేసుకుంటే వ‌ద్దంటానా? అని ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. ప‌వ‌న్‌పై మ్యారేజీ స్టార్‌, ప్యాకేజీ స్టార్‌, నిత్య పెళ్లి కొడుకు అంటూ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు సెటైర్స్ విసురుతుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుండ‌డంతో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎంపై ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోని మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా జ‌గ‌న్ మాట్లాడాడ‌ని జ‌న‌సేన నేత‌లు త‌మ ఫిర్యాదులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే, రాష్ట్రంలోని మ‌హిళ‌ల గురించి విమ‌ర్శించ‌డం ఎలా అవుతుందో వారికే తెలియాలి. ఇలాగైతే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఎలా వుంటుంద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తుంటే, అందుకు విరుద్ధంగా జ‌న‌సేన నేత‌లు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  Readmore!

Show comments