ఎట్ట‌కేల‌కు ష‌ర్మిల‌కు నోటీసులు

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎట్ట‌కేల‌కు నోటీసులు ఇచ్చారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘిస్తూ, ఇష్టానురీతిలో నోరు పారేసుకుంటున్నార‌నే ఫిర్యాదుతో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, ప‌రువు ద‌క్కించుకునేలా ఓట్లు రాబ‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

వైఎస్సార్ బిడ్డ అయిన ష‌ర్మిల‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్టు ఆమె ఫ‌లితాలు చూపించ‌లేక‌పోతే, మ‌రుక్ష‌ణం నుంచే ఆమెపై రాజ‌కీయ దాడి మొద‌ల‌వుతుంది. ఈ విష‌యం తెలిసే, ఎన్నిక‌ల‌ను చావోరేవోగా భావిస్తున్న ష‌ర్మిల‌... వివేకా హ‌త్యను ఆయుధంగా మ‌లుచుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. ఇందుకు వివేకా కుమార్తె సునీత ఆమెకు తోడ‌య్యారు.

క‌డ‌ప ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌త్య‌ర్థి అవినాష్‌రెడ్డిని బ‌ద్నాం చేయాలంటే వివేకా కేసులో నిందితుడిగా ఉండ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ, ఏకంగా హంత‌కుడంటూ ష‌ర్మిల విమ‌ర్శిస్తున్నారు. ప‌దేప‌దే నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి స్పందించారు.  

కోర్టు ప‌రిధిలో ఉన్న వివేకా హ‌త్య కేసుపై ఎన్నిక‌ల ప్రచారంలో మాట్లాడ్డం ఎన్నిక‌ల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ష‌ర్మిల‌కు ఎన్నిక‌ల సంఘం ఆమెకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల‌పై ఆమె స్పంద‌న ఆస‌క్తి రేపుతోంది. ఇప్ప‌టికైనా ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి హంత‌కుడ‌ని ఆరోపించ‌డం మానుతారా? లేక అదే పంథా కొన‌సాగిస్తారా?.. ఏం జ‌రుగుతుందో? Readmore!

Show comments