అచ్చెన్న నెత్తిన పాలు పోస్తున్న దువ్వాడ ఇంటిపోరు!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఇప్పటికి రెండు సార్లు వరసగా గెలిచిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనను ఈసారి అయినా ఓడించాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది. వైసీపీ టార్గెట్ పెట్టుకుంది కానీ టెక్కలిలో ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ పార్టీలో వర్గ పోరు పెంచేసింది.

మొదట ఇంఛార్జిగా ఉన్న పేడాడ తిలక్ ని తప్పించి కొన్నాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ని నియమించింది. మళ్లీ ఆయనను తప్పించి సతీమణి టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణిని నియమించింది. కొద్ది నెలల క్రితం మళ్ళీ శ్రీనివాస్ కే బాధ్యతలు ఇచ్చింది. ఆయనకు టికెట్ కూడా ఇచ్చేసింది.

ఇప్పుడు దువ్వాడ సతీమణి వాణి రెబెల్ గా భర్త మీదనే పోటీకి తయారు అవుతున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అవి కాస్తా ముదిరి పాకాన పడి ఎన్నికల రాజకీయాలలోనే భర్తను ఢీ కొట్టాలని వాణి సిద్ధం అవుతున్నారు అని భోగట్టా. ఆమె ఈ నెల 22న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు అని అంటున్నారు. ఆమె రెబెల్ అభ్యర్థిగా పోటీలో ఉంటే అది వైసీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది అని అంటున్నారు.

ఇప్పటికే టెక్కలిలో బలమైన నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దువ్వాడ సతీమణి భర్త మీదే పోటీ అంటే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. పైగా ఇంటిపోరుతో పార్టీకి భారీ షాక్ తగులుతుందని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం నచ్చచెప్పి ఆమెను పోటీలో నుంచి తప్పిస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఆమె పోటీలో ఉంటే మాత్రం దువ్వాడ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి అంటున్నారు. Readmore!

Show comments