అయ్య బాబోయ్‌... సుగుణ‌మ్మ‌కు వెన్నుపోటు!

తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణ‌మ్మ‌కు టికెట్ లేద‌ని స్ప‌ష్టం కావ‌డంతో ఇప్పుడామె వెంట వుండ‌డానికి నాయ‌కులెవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. అంత‌టితో ఆగ‌లేదు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఆమెకు నీడ‌లా ఉన్న ఒక ద్వితీయ శ్రేణి నాయ‌కుడు (రెండు ఇంగ్లీష్ అక్ష‌రాల‌తో తిరుప‌తిలో గుర్తింపు) వెన్నుపోటు పొడ‌వ‌డానికి పావులు క‌దుపుతున్నాడు.

గతంలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా పోలీస్‌ల‌కు మోస్ట్ వాంటెడ్ ప‌ర్స‌న్‌. ఎర్ర‌చంద‌నాన్ని అక్ర‌మంగా త‌ర‌లించ‌గా పోగు చేసుకున్న భారీ సొమ్మును వ‌డ్డీల‌కు ఇస్తూ, బ‌లిజ కులాన్ని అడ్డం పెట్టుకుని తిరుప‌తిలో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. జ‌న‌సేన‌కు తిరుప‌తి సీటు కేటాయించ‌డం, ఇదే స‌మ‌యంలో సుగుణ‌మ్మ ధిక్కార స్వ‌రాన్ని వినిపిస్తున్న నేప‌థ్యంలో, ఆమెకు వ్య‌తిరేకంగా ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్టానం పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేస్తున్నాడ‌త‌ను.

ప‌నిలో ప‌నిగా త‌న బ‌లాన్ని చూపి, సుగుణ‌మ్మ‌ను ప‌క్క‌కు నెట్టేసి తిరుప‌తి టీడీపీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి తెచ్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా క‌థ న‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో రెండు రోజులుగా అత‌ను తిరుప‌తిలో బూత్ లెవెల్ టీడీపీ నాయ‌కుల‌తో ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌ను జ‌న‌సేన అభ్య‌ర్థిని వ్య‌తిరేకిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ వైర‌ల్ అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు తిరుప‌తిలో కూట‌మి అభ్య‌ర్థి కావ‌డం త‌మ ఖ‌ర్మ అని స‌ద‌రు నాయ‌కుడు ఆ పోస్టులో పేర్కొన్నాడు. కావున తాము నోటాకు ఓటు వేస్తామ‌ని అత‌ను వెల్ల‌డించాడు.

ఇప్పుడాయ‌నే సుగుణ‌మ్మ‌కు ఇక రాజ‌కీయంగా నూక‌లు చెల్లాయ‌ని అంటున్నాడు. ఆమె స్థానాన్ని ఆక్ర‌మించేందుకు బూత్ లెవెల్‌లో మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నాడు. తాజాగా త‌న ఇన్‌చార్జ్ ప‌ద‌విని కాపాడుకోవ‌డం సుగుణ‌మ్మ‌కు అతిపెద్ద స‌వాల్‌గా మారింది. సుగుణ‌మ్మకు 70 ఏళ్ల వ‌య‌సు అని, యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటూ స్మ‌గ్ల‌ర్ & వ‌డ్డీల వ్యాపారి అయిన స‌ద‌రు టీడీపీ నాయ‌కుడు అదిష్టానం వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రౌడీ బ్యాచ్‌ను పెట్టుకుని, తిరుప‌తిలో అధికారం లేకుండానే దాదాగిరి చెలాయిస్తున్న అత‌నికే టీడీపీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే, ఇక ఆ పార్టీని పూర్తిగా మ‌రిచిపోవ‌చ్చనే చ‌ర్చకు తెర‌లేచింది.

అలాగే తిరుప‌తి ఇన్‌చార్జ్ ప‌ద‌వి రేస్‌లో కోడూరి బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వూకా విజ‌య్‌కుమార్, న‌ర‌సింహ‌యాద‌వ్ ఉన్నారు. వీరిలో కోడూరి బాల‌సుబ్ర‌మ‌ణ్యం అధిష్టానం ఆదేశాల‌ను గౌరవించి ఆర‌ణి శ్రీ‌నివాసులుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు న‌టిస్తున్నారు. వూకా విజ‌య్‌కుమార్‌, న‌ర‌సింహ‌యాద‌వ్ కూడా తిరుప‌తి టీడీపీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం అధిష్టానం పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలిసింది.

Show comments

Related Stories :