Gaami Review: మూవీ రివ్యూ: గామి

చిత్రం: గామి
రేటింగ్: 2.75/5
తారాగణం:
విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మొహమ్మద్ సమద్, హారిక, దయానంద్ రెడ్డి, శాంతిరావు, మయాంక్ తదితరులు
సంగీతం: నరేష్ కుమరన్
కెమెరా: విశ్వనాథ రెడ్డి
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరుణ్
నిర్మాత: కార్తిక్ శబరీష్
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల: మార్చి 8, 2024

ఈ మధ్యకాలంలో టైటిల్, పోస్టర్, ట్రైలర్ పరంగా ఆసక్తిగొలిపిన చిత్రమిది. విశ్వక్ సేన్ తొలిసారి ఆధ్యాత్మిక చిత్రంలో నటించాడా అని కాస్త అంచనాలు కూడా పెంచింది. ఇంతకీ విషయమేంటో చూదాం. 

శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరా. అతనికొక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరి స్పర్శ తగిలినా కిందపడిపోయి, చర్మం రంగు మారిపోయి, విపరీతమైన నొప్పికి గురౌతాడు. అది నయమవ్వాలంటే హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే మాలిపత్రాలు తెచ్చుకోవాలని ఒక సిద్ధుడు చెబుతాడు. ఆ పత్రాల కోసం శంకర్ బయలుదేరదాడు. అతనితో పాటు జాహ్నవి (చాందిని చౌదరి) అనే ఒక సైంటిస్ట్ కూడా బయలుదేరుతుంది.

ఈ కథ ఇలా ఉండగా మరొక చోట ఒక యువకుడు నిర్బంధంలో ఉంటాడు. చిత్రవధ అనుభవిస్తుంటాడు. బయటపడే ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ విఫలమవుతుంటాడు.

మరొక చోట ఒక పల్లెటూరిలో ఉమ అనే 12-13ఏళ్ల అమ్మాయి. ఆమెని తన తల్లిలాగ దేవదాసిగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది.

అసలీ మూడు కథలకి లింకేంటి? చివరికి ఈ మూడు కథలు ఒక చోట కలుస్తాయా? శంకర్ కి తన సమస్య నయమవుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానమే క్లైమాక్స్. 

సినిమా అంటే ఫలానా ఫార్ములా ఫాలో అవ్వాలని రూలేమీ లేదు. కానీ సినిమా లక్ష్యం మెదళ్లను కదిలించగలగాలి, మనసుల్ని తాకాలి, ఆసక్తిగా కూర్చోపెట్టాలి. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రయోగాలు చేయడం స్వాగతించతగినదే కానీ అలాంటివి ఎంచుకున్నప్పుడు కేవలం టెక్నికల్ అంశాలకే కాకుండా కథ, కథనం, సన్నివేశకల్పన, భావోద్వేగాలు.. లాంటి కీలకమైన విషయాలను విస్మరించకూడదు. 

ఈ "గామి" టైటిల్, పోస్టర్, ట్రైలర్ తో ఆకట్టుకుంది. కానీ కంటెంట్ పరంగా హత్తుకోదు. సినిమా మొదలయ్యి అరగంటైనా తెర మీద జరుగుతున్న కథేంటో అర్ధం కాదు. మూడు విభిన్నమైన ట్రాకుల్లో వేరు వేరు కథలు నడుస్తుంటాయి. అన్ని చోట్లా ఇన్ఫర్మేషన్ తప్ప ఎమోషన్ గానీ, ఆసక్తికరమైన హుక్ పాయింట్ కానీ అందకపోవడం వల్ల సహన పరీక్షలా అనిపిస్తుంటుంది. 

ఈ చిత్రరచన కరోనా కాలం ముందే జరిగినా లాక్డౌన్ టైములో దీనిని మరింత సమర్ధవంతంగా మలచుకున్నారని చెప్పారు. ఆ మలచుకోవడంలో జర్మన్ వెబ్ సిరీస్ "డార్క్" ని స్ఫూర్తిగా తీసుకున్నట్టుంది. అందులో ట్రైకెట్రా సింబల్ ని ఇందులో ఒక ట్రాక్ లో పెట్టారు. దాని అర్థమేంటో మాత్రం ఇక్కడ వివరించలేదు. అలాగే ఆ వెబ్ సిరీస్ లో కనిపించే నోవా పాత్ర తాలూకు యాంబియన్స్ ని, ఐసొలేటెడ్ చాంబర్ గదుల్ని, అందులోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని పోలిన ఒక టవర్ చిమినీని, ఇందులో పెట్టి తెలుగు తెర మీద కొత్త వాతావరణాన్ని సమర్ధవంతంగా చూపించాడు దర్శకుడు. 

అలాగే జైల్ సన్నివేశాల్లో టాం హ్యాంక్స్ నటించిన "గ్రీన్ మైల్" లోని ఎలిక్ట్రిక్యూషన్ చెయిర్ కాన్సెప్ట్ ని కూడా ఇందులో వాడుకున్నాడు. 

అలా రకరకాల చిత్రాలు, వెబ్ సిరీసుల్లోని కాన్సెప్ట్స్ ని ఇక్కడ అనుకున్న కథనానికి వాడుకోవడం వల్ల కొత్త యాంబియన్స్ ని అయితే పట్టుకొచ్చారు. 

కానీ కథనం కానీ, ఎంచుకున్న క్లైమాక్స్ కానీ ఇంటర్వల్ ముందే ఫలానా సినిమా ఇన్స్పిరేషన్ అయ్యుంటుంది అని అనిపించడం, చివరికి అదే అవ్వడం వల్ల ప్రేక్షకులు పెదవి విరిచే పరిస్థితి. ఆ సినిమా టైటిల్ చెబితే ఉన్న కొద్దిపాటి ఆసక్తిని కూడా చంపేసినట్టు అవుతుంది కనుక చెప్పట్లేదు. 

అయినా ఈ తరహా ప్లాట్ పాయింట్ "బందం రేగడ్" లా అనిపిస్తుంది. బహుశా అది కూడా కొంత ఇన్స్పిరేషన్ అయ్యుండొచ్చు ఈ చిత్రానికి. కానీ క్లైమాక్స్ మాత్రం ఆ చిత్రంతో పోలి ఉండదు.  

పై సినిమాలు, సిరీసులు ఏవీ చూడనివాళ్లకి ఏమో గానీ, చూసినవాళ్లకి మాత్రం ఈ "గామి"లో కొత్తదనమేదీ కనపడదు. ఈ రకంగా సినిమా తీయాలన్న ఆలోచన బానే ఉన్నా ఆచరణలో మాత్రం వీగిపోయింది. మరింత బలమైన కథతో, కథనంతో, ట్విస్టులతో నడిపుంటే సరికొత్త కల్ట్ చిత్రం అయ్యుండేది. 

చివరాఖర్లో 20 నిమిషాల్లో చెప్పే కథ కోసం రెండు గంటల సేపు.. ఒక దాంతో ఒకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా పేర్చిన సీన్లన్నీ చూస్తూ కూర్చోవాలంటే తలకు మించిన భారమే. 

ప్రేక్షకుడికి సినిమా మొదలైన పావుగంట లోపు ఆసక్తికరమైన "కొత్త హుక్ పాయింట్" దొరక్కపోతే రెస్ట్లెస్ అవుతున్న కాలమిది. ఫలానా అవసరంతో హిమాలయాల కెళ్లి ఫలానా పువ్వో, ఆకో తేవడమనేది "జగదేకవీరుడు అతిలోకసుందరి" కాలం నాటి పాయింట్. దానిని హుక్ పాయింట్ అనుకోమంటే మాత్రం చెయగలిగిదేం లేదు. 

టెక్నికల్ గా చూసుకుంటే ఓవరాల్ గా నేపథ్య సంగీతం ఈ సినిమాకి ఎంచుకునా డార్క్ నెరేషన్ కి బాగుంది. దీనికి కూడా పైన చెప్పుకున్న వెబ్ సిరీస్ నుంచి స్ఫూర్తి లేకపోలేదు! 

కెమెరా, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిడివి నార్మలే అయినా కథలో ఎమోషన్ అందక చాలా స్లోగా నడుస్తున్న ఫీల్ వస్తుంది. 

విశ్వక్ సేన్ తన పాత్రవరకు బాగానే చేసాడు. ఎక్కువ వైవిధ్యం చూపించడానికేం లేదు కానీ, డిజైన్ చేసిన క్యారక్టర్లో సీరియస్ గా కనిపిస్తూ ఒకే డైమెన్షన్లో ఉన్నాడు ప్రారంభం నుంచి చివరి వరకు. అతని కష్టాన్ని, ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. 

చాందిని చౌదరి పాత్ర దేనికో అర్ధం కాదు. ఏదో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది.

దేవదాసి పాత్రలో అభినయ బాగానే ఉంది. ఉమగా చేసిన బాలనటి హారిక మంచి నటనని కనబరిచింది. మిగిలిన నటీనటులంతా కొత్త మొహాలే అయినా పాత్రలకి సరిపోయారు, ఎంత చేయాలో అంత చేసారు. 

రొటీన్ సినిమా కాకుండా ఏదైనా వెరైటీగా చూద్దామనుకునే వారికి, ల్యాగులు అవీ పట్టించుకోకుండా మనసుకి హత్తుకోకపోయినా ఓపిగ్గా చివరిదాకా కూర్చోగలిగే ప్రేక్షకులకి తప్ప సామాన్యులకి ఈ సినిమాని అప్రిషియేట్ చేయడం కష్టసాధ్యం. వ్యక్తిగత వినోదాన్ని పక్కనపెట్టి పెద్దమనసుతో కొత్త ప్రయోగాత్మాక ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయదలచుకుంటే చూడొచ్చు. 

బాటం లైన్: కొత్త ప్రయోగం

Show comments

Related Stories :