ప‌వ‌న్‌కు మ‌రో కీల‌క నాయ‌కుడు గుడ్ బై!

పొత్తులో భాగంగా త‌క్కువ సీట్ల‌కే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒప్పుకోవ‌డంపై జ‌న‌సేన‌లో తీవ్ర అసంతృప్తి నెల‌కుంది. కొన్నేళ్లుగా ప‌వ‌న్ వెంట న‌డిచిన ముఖ్య నాయ‌కుల‌కు కూడా టికెట్లు ద‌క్క‌ని దుస్థితి. చంద్ర‌బాబునాయుడి ప‌ల్ల‌కీని తాను మోయ‌డంతో పాటు న‌మ్ముకున్నోళ్లంద‌రితో ఊడిగం చేయిస్తున్నాడ‌నే కోపం ప‌వ‌న్‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో బాబుకు ఊడిగం చేయ‌డానికైతే జ‌న‌సేన‌లో ఎందుకు ఉండాల‌ని కొంద‌రు నేత‌లు నిల‌దీస్తున్నారు.

మ‌రోవైపు ఇచ్చిన హామీల‌ను కూడా ప‌వ‌న్ నిల‌బెట్టుకోలేక‌పోవ‌డంపై ఆగ్ర‌హ జ్వాల‌లు మిన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఒక్కొక్క‌రుగా జ‌న‌సేన ముఖ్య నేత‌లు పార్టీ వీడుతున్నారు. ఇటీవ‌ల ఆచంట జ‌న‌సేన ఇన్‌చార్జ్ చేగొండి సూర్య‌ప్ర‌కాశ్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌ణుకు జ‌న‌సేన ఇన్‌చార్జ్ విడివాడ రామ‌చంద్ర‌రావు కూడా పార్టీని వీడేందుకు నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో త‌ణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ పేరు వుంది. దీంతో టికెట్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విడివాడ తీవ్ర మ‌న‌స్తాపం చెందారు. గ‌తంలో త‌ణుకులో వారాహి యాత్రలో భాగంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేలాది మంది సాక్షిగా విడివాడ రామ‌చంద్ర‌రావుకు టికెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో విడివాడ లాంటి నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌నందుకు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ కూడా చెప్పారు.  

వేలాది మంది సాక్షిగా ఇచ్చిన హామీని కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో విడ‌వాడ తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇటీవ‌ల త‌న వ‌ద్ద‌కొచ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇదే సంద‌ర్భంలో నాదెండ్ల‌పై విడివాడ అనుచ‌రులు దాడికి ప్ర‌య‌త్నించారు.

తాడేప‌ల్లిగూడెం బ‌హిరంగ స‌భ‌లో ఎవ‌రూ త‌న‌ను ప్ర‌శ్నించొద్ద‌ని, స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వొద్ద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌వ‌న్‌కల్యాణ్‌తో ఇక మాట్లాడేదేమీ లేద‌నే ఉద్దేశంతో విడివాడ పార్టీకి గుడ్ చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఆయ‌న అధికార పార్టీలో చేరుతారా? లేక స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తారా? అనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రాలేదు. ఒక‌వేళ బీజేపీ ఒంట‌రిగా పోటీ చేస్తే, ఆ పార్టీ నుంచి విడివాడ బ‌రిలో దిగే అవ‌కాశాలున్నాయి.

Show comments

Related Stories :