ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరికి అత్యధిక ప్రాధాన్యం వుంది. అక్కడి నుంచి వరుసగా రెండుసార్లు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహించారు. సీనియర్ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడిని మట్టి కరిపించి మొదటిసారిగా రోజా చట్టసభలో అడుగు పెట్టారు. రెండోసారి ముద్దుకృష్ణమనాయుడి పెద్ద కుమారుడు గాలి భానుప్రకాశ్‌పై రోజా గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నారు.
మూడో దఫా ముచ్చటగా తానే నగరి నుంచి పోటీ చేస్తానని రోజా పలుమార్లు ప్రకటించారు. రోజాకు సొంత పార్టీలో వ్యతిరేకత తప్పడం లేదు. అయితే ఆమె ప్రత్యర్థి గాలి భానుప్రకాశ్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదని రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ విద్యాసంస్థల అధినేత అశోక్‌రాజు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీకి పెద్ద దెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నగరిలో రాజుల సామాజిక వర్గం టీడీపీకి అండగా వుంటోంది. అశోక్‌రాజు ఏదైనా పార్టీలో చేరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వుండాలని కోరుకుంటున్నారు. ఇదే జరిగితే రాజుల ఓట్లు ఆయన వైపు వుంటాయి. తద్వారా టీడీపీ నష్టపోనుంది. నగరిలో ఒక్క కమ్మ సామాజిక వర్గం ఓట్లే టీడీపీకి నమ్మకంగా ఉన్నాయి. మిగిలిన సామాజిక వర్గాల ఓటర్లు టీడీపీ వైపు లేరనే మాట వినిపిస్తోంది.
ప్రజానీకానికి టీడీపీ దూరం కావడానికి గాలి భానుప్రకాశ్ వైఖరే కారణమని చెబుతున్నారు. భానుప్రకాశ్‌కు సొంతింట్లోనే తీవ్ర వ్యతిరేకత వుంది. ముద్దుకృష్ణమనాయుడి భార్య సరస్వతి, చిన్న కుమారుడు జగదీశ్ చాలా కాలంగా భానుప్రకాశ్‌పై రగిలిపోతున్నారు. నగరిలో భానుప్రకాశ్‌కు వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే భానుప్రకాశ్ డబ్బు ఖర్చు పెట్టకపోవడంతో ఎవరూ వెంట నడవడం లేదు. రోజా విషయానికి వస్తే... అవసరాన్ని బట్టి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరనే పేరు వుంది.
అలాగే ప్రజలను అభిమానంగా పలకరించడంలో గాలి భానుప్రకాశ్ విఫలమయ్యారు. టీడీపీ హయాంలో దొంగలు, స్మగ్లర్లు, ధనవంతులకు పదవులు ఇచ్చి, పార్టీ కోసం పని చేసిన వాళ్లను భానుప్రకాశ్ విస్మరించారనే చెడ్డపేరు వుంది. దీంతో పార్టీకి సీనియర్లు దూరమయ్యారనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు టీడీపీలో గంధమనేని రమేశ్‌ప్రసాద్, ఏఎన్ రాధాకృష్ణ, అశోక్‌రాజు, పాకా రాజా, చలపతి తదితరులెవరూ కనిపించడం లేదు.
రోజాపై వైసీపీలో వ్యతిరేకత ఉన్నా, దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితిలో టీడీపీ లేదు. దీంతో రోజా ఎన్నికల సమయానికి తనదైన రీతిలో అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. నగరిలో టీడీపీ, వైసీపీలలో గెలుపు ఎవరిదంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇటు రోజా, అటు గాలి భానుప్రకాశ్‌కు సొంత పార్టీల్లో వ్యతిరేకత ఉండడమే.